ముఖ్య‌మంత్రిపై నేరుగా పోటీ.. వాళ్లిద్దరి సాహసం వెనుక?

  • Publish Date - November 8, 2023 / 04:00 PM IST
  • సీఎంపై రేవంత్‌, ఈట‌ల పోటీ
  • కామారెడ్డి బ‌రిలో రేవంత్‌రెడ్డి
  • గ‌జ్వేల్‌లో ఢీ అన్న రాజేంద‌ర్‌
  • సీఎం రేసులో ఇద్ద‌రు నేత‌లు

విధాత‌: తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే అంశంపై జ‌రుగుతున్న చ‌ర్చ‌కు దీటుగా.. సీఎం పోటీ చేస్తున్న కామారెడ్డి, గ‌జ్వేల్‌లో కాంగ్రెస్‌, బీజేపీ అభ్య‌ర్థుల పోటీ అంశం చ‌ర్చ‌ల్లో ఉంటున్న‌ది. ఈ రెండు స్థానాల్లో గెలిచేదెవ‌ర‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఆ రెండు స్థానాలే.. గజ్వేల్‌, కామారెడ్డి! ఇక్క‌డ సీఎం కేసీఆర్‌పై పోటీ చేయ‌బోయే ప్ర‌త్య‌ర్థులే రేవంత్‌రెడ్డి, ఈట‌ల రాజేంద‌ర్‌. మ‌రో విశేషం ఏమిటంటే.. కేసీఆర్ ముఖ్య‌మంత్రిగా ఉంటే.. రేవంత్‌రెడ్డి, ఈట‌ల రాజేంద‌ర్ ఆయా పార్టీల్లో సీఎం రేసులో ఉన్నారు.

కేసీఆర్‌ గజ్వేల్‌లో గత రెండు పర్యాయాలు అలవోకగా గెలిచారు. కానీ ఈసారి అక్కడి పార్టీ శ్రేణులకు, నేతలకు ఇక నుంచి నెలలో ఒక రోజు అందుబాటులో ఉంటానని హామీ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొన్నది. మంత్రి హరీశ్‌ రావు సీఎం గెలుపు బాధ్యతనంతా తానే తీసుకున్నారు. దీనికి కారణం బీజేపీలో ప్ర‌స్తుతం నెంబ‌ర్ టూగా పేరొందిన ఈటల రాజేందర్‌ గజ్వేలో కేసీఆర్‌ను ఢీకొన‌డం. ఇక్కడ ఆయన పోటీ చేయడానికి సామాజిక సమీకరణాలతో పాటు ఏ పార్టీ లెక్క‌లు పార్టీకి ఉన్నాయి. వ్యక్తిగతంగా ఈటలనే ఆ స్థానాన్నిఎంచుకుని పార్టీ అధిష్ఠానాన్ని ఒప్పించారు. సీఎం పోటీ చేస్తున్న మరో స్థానం కామారెడ్డి. గజ్వేల్‌లో ఓడిపోతాననే కేసీఆర్‌ కామారెడ్డికి పారిపోతున్నారని విపక్షాలు విమర్శించాయి. కేసీఆర్‌ అక్కడ ఎందుకు పోటీ చేస్తున్నారన్నది చాలారోజుల వరకు ప్రజలకు కాదు, పార్టీ శ్రేణులకు కూడా తెలియదు.


గజ్వేల్‌లా ఇతర నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలి కదా అందుకే అక్కడ పోటీ చేస్తున్నానని కేసీఆర్ చెబుతున్నా.. దీనిపై రాజ‌కీయ ప‌రిశీల‌కుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రేవంత్‌రెడ్డి గతంలోనే పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే కేసీఆర్‌ పై పోటీ చేసి ఆయనను చిత్తుచిత్తుగా ఓడిస్తానని అన్నారు. కామారెడ్డికి సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించిన సీనియర్‌ నేత షబ్బీర్‌ అలీని కాదని రేవంత్‌కు ఆ ఆవకాశం ఇస్తుందా? అని అనుకున్నారు. చివరికి కేసీఆర్‌పై పోటీ చేసేది ఎవరనే దానికి కాంగ్రెస్‌ అధిష్ఠానం తెర దించింది. కామారెడ్డిలో కేసీఆర్‌ను రేవంత్ ఢీకొంటున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ప్రచారంలో భాగంగా ఆయన రాష్ట్రమంతటా పర్యటించాలి. కానీ ఈ సమయంలో రేవంత్ ఆ సాహసం ఎందుకు చేశారు? అనే ప్రశ్నతలెత్తింది. అయితే తాను నిలబడిన మరోస్థానం కొడంగల్‌లో క్షేత్ర స్థాయి నివేదికల ప్రకారం ఆయన చాలా సేఫ్‌ జోన్‌లో ఉన్నారని సమాచారం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

ఈటలే ఎందుకు?

ఈసారి ఎన్నికల్లో బీజేపీ బీసీ సీఎం నినాదం ఎత్తుకున్నది. బీజేపీ బీసీ సీఎం అస్త్రాన్ని ప్రయోగించబోతున్నదని ‘విధాత’ ముందే అంచ‌నా వేసింది. అదే నిజ‌మైంది. ప్ర‌ధాని స‌హా బీజేపీ నేత‌లంతా బీఆరెస్ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎత్తి చూప‌డంతోపాటు.. బీసీ సీఎం అంశాన్ని ప్ర‌ధానంగా ప్ర‌స్తావిస్తున్నారు.

కేసీఆర్‌కు కావాల్సింది చ‌ప్పట్లు కొట్ట‌డ‌మే!

అనుగుణంగానే బీజేపీ బీసీ సీఎం ప్రకటన చేసింది. ప్రధాని సహా ఆ పార్టీ జాతీయ నేతలంతా ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలతో పాటు బీసీ సీఎం అంశాన్నే ప్రధానంగా ప్రచారం చేస్తున్నారు. అయితే బీజేపీ గెలిచేది లేదు, అధికారంలోకి వచ్చేది లేదు కాబట్టే బీసీ సీఎం అంటున్నదనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో హంగ్‌ రావొచ్చన్నది ఆ పార్టీ అధిష్ఠాన పెద్దల అంచనా. కింగ్‌ కాకున్నా కింగ్‌ మేకర్‌ అయినా తమ డిమాండ్‌ను ఆ సమయానికి బైట పెట్టొచ్చన్నది కమలనాథుల వ్యూహంగా కనిపిస్తున్నది.


సీఎం సీటు కోసం పోటీపడేవారు కాంగ్రెస్‌లోనే కాదు కాషాయ పార్టీలోనూ ఎక్కువే ఉన్నారు. బీసీ సీఎం అనగానే ఆపార్టీ జాతీయ నేత మురళీధర్‌రావు బండి సంజయ్‌ పేరును ప్రస్తావించారు. ఎన్నికలకు ముందు సంజయ్‌ని పార్టీ బాధ్యతల నుంచి ఎందుకు తప్పించారనే విషయంపై స్పష్టత ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఆయనను సీఎం అభ్యర్థిగా పార్టీ అధిష్ఠానం అనుకున్నది అందుకే ఆయనను పార్టీ బాధ్యతల నుంచి తప్పించి అసెంబ్లీ బరిలోకి దింపింది అన్నారు. ఓబీసీ జాతీయ అధ్యక్షుడు కే లక్ష్మణ్‌కు ప్రధాని మోదీ, కేంద్ర హోమంత్రి షా, జాతీయ అధ్యక్షుడు నడ్డాల అండదండలు పుష్కలంగా ఉన్నాయ‌ని చెబుతారు. సంజయ్‌, లక్ష్మణ్‌.. ఇద్దరూ బీజేపీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై ఆ పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగుతున్నారు.


సీఎం సీటు ఆశిస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న‌ ఈటల రాజేందర్‌ అలా కాదు. కేసీఆర్‌తో విభేదాల కారణంగా ఆయన కారు దిగి కాషాయ కండువా కప్పుకొన్నారు. ఈ విషయాన్ని ఆయనే చెబుతున్నారు. తాను కూడా సీఎం అభ్యర్థి రేసులో ఉన్నాననే సంకేతాలు పంపడానికే ఆయన గజ్వేల్‌ బరిలో ఉన్నార‌నే చ‌ర్చ జ‌రుగుతున్న‌ది. అక్కడ గెలుపోటముల సంగతి పక్కనపెడితే సీఎంను ఢీ కొట్టే సాహసం చేస్తున్నతనకు సంజయ్‌, లక్ష్మణ్‌ల కంటే ఎక్కువ అర్హత ఉన్నదని చూపెట్టడానికే ఆయన ఆ ప్రయోగం చేస్తున్నార‌ని అంటున్నారు. అయితే ప్రాంతీయ పార్టీలలో ఏక వ్యక్తి స్వామ్యం ఉంటుంది. కాబట్టి పార్టీ, పాలనా పగ్గాలు ఏక వ్యక్తి కేంద్రంగానే ఉంటాయని తెలిసిందే.


కానీ జాతీయ పార్టీల్లో అలా ఉండదు. సీఎంగా ఎవరు అన్నది పార్టీ అధిష్ఠాన నిర్ణయమే ఫైనల్‌. మోడీ-షాలు గత తొమ్మిదిన్నరేళ్లుగా పార్టీ విధేయుల కంటే ఆయా ప్రాంతీయపార్టీల్లో చీలిక తెచ్చి ప్రభుత్వాలను పడగొట్టిన వారికే ప్రాధాన్యం ఇచ్చార‌ని ప‌రిశీల‌కులు గుర్తు చేస్తున్నారు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్రంలో ఏ పార్టీకీ మెజారిటీ రాకపోతే అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఈ ముగ్గురిలో ఎవరిలో ఒకరిని ఖరారు చేస్తుంది. ఒకవేళ కాంగ్రెస్‌ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించినా.. బీఆర్‌ఎస్‌ మెజారిటీ మార్కును చేరుకోలేకపోయినా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన చక్రం తిప్పే వారికే ఆ అవకాశం దక్కొచ్చనే ప్రచారం ఉన్నది.

కామారెడ్డికి రేవంత్‌ వెళ్లానికి కారణం!

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందనే ప్రచారంతో పాటు, అతి పెద్ద పార్టీగా నిలువబోతున్నదని కొన్ని సర్వేలు వెల్లడించాయి. అప్పటి నుంచే ఆ పార్టీలో సీఎం సీటు కోసం పోటీ పడుతున్న వారి సంఖ్య పెరిగిపోయింది. సీనియర్‌ నేతలు జానారెడ్డి, జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇప్పటికే ఈ విషయాన్ని బహిరంగంగానే చెప్పారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్టీ అధిష్ఠానం ద్వారా ఆయ‌న‌ ప్రయత్నాలను తెర వెనుక ప్రారంభించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే అయ్యాక రాష్ట్రంలోనూ దళిత సీఎం నినాదం తెరమీదికి వచ్చింది. కేసీఆర్‌ దళితుడిని సీఎం చేస్తానన్న హామీ ఏమైందని కాంగ్రెస్‌ పార్టీ కంటే ఎక్కువగా మోదీ, షాలు చాలారోజులు ప్రశ్నించారు. కానీ ప్రస్తుతం ఈ అంశాన్ని పక్కనపెట్టారు. దీన్ని కాంగ్రెస్‌ ఎత్తుకున్నది. ఒకవేళ పార్టీ మెజారిటీ వస్తే ఆ అవకాశం ఎవరికి వస్తుందనే చర్చ జరుగుతుండగానే.. సీతక్క పేరును రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనలో ప్రస్తావించారు. దీన్ని ఎంపీ కోమటిరెడ్డి ఖండించారు. రేవంత్‌రెడ్డి మాట ఇక్కడ నడువదని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఒకవేళ పార్టీ అధిష్ఠానం అనుకుంటే మా పార్టీలో భట్టి విక్రమార్క, పొదెం వీరయ్య లాంటి వాళ్లు లేరా? అన్నారు.


కేసీఆర్‌ స్థాయి నేతల కాంగ్రెస్‌లో ఎవరూ లేరు అని ఆ పార్టీ నేతలే అనేక సందర్భాల్లో చెప్పారు. కానీ రేవంత్‌ పీసీసీ అధ్యక్షుడు అయ్యాక పార్టీ కార్యకర్తలు, శ్రేణులు కేసీఆర్‌కు ప్రత్యామ్నయ నేత ఆయనే అంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠాన నిర్ణయం ఎలా ఉన్నా తన ప్రయత్నం తాను చేస్తున్నారు. సీనియర్లు చేయలేని సాహసాన్ని చేస్తున్నారు. కామారెడ్డిలో కేసీఆర్‌ను ఢీ కొట్టడం ద్వారా తన బలాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే తన మనసులో మాటతో పాటు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులతోనూ ఈ మాట చెప్పిస్తున్నారు. బీజేపీలో వలె కాంగ్రెస్‌ పార్టీలో ఉండదు. సీఎం సీటు దక్కించుకోవాలంటే రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మొదలు ఏఐసీసీలో అనేకమంది పెద్దల ఆమోదం ఉండాలి. అప్పుడే తనకు అధిష్ఠానం అండదండలు దక్కుతాయని ఆయన భావిస్తున్నారు.

బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల జాతీయ నాయకత్వాల ఆలోచనలు ఎలా ఉన్నా రేవంత్‌ రెడ్డి, ఈటల రాజేందర్‌లు సీఎం సీటు కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే అక్కడ ఇక్కడా కాకుండా ఏకంగా కేసీఆర్‌ పోటీ చేస్తున్న స్థానాల్లో ఆయనను ఢీ కొంటేనే ఆ మైలేజ్‌ వస్తుందని అనుకుంటున్నారు. ఆర‌క‌మైన చ‌ర్చ జర‌గ‌డంతో ఇప్ప‌టికే వారు స‌క్సెస్ అయ్యార‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.