ఈటల పరిస్థితి పోషమ్మ గుడి ముందు పొట్టేలు కట్టేసినట్టేనా?

గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌ఫై పోటీ నిలబడటం ద్వారా బీఆరెస్‌ మాజీ నేత, మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ రాజకీయంగా సంచలనం సృష్టించారు

  • Publish Date - November 27, 2023 / 12:50 PM IST
  • లేక హుజూరాబాద్‌ తరహాలో కోలుకోలేని షాక్‌ ఇస్తారా? 
  • గజ్వేల్‌లో రాజేందర్‌కు ఎదురీతా? మునకా?
  • హుజూరాబాద్‌లో త్రిముఖ పోటీ త‌ప్పదా?


విధాత ప్రత్యేకం: గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌ఫై పోటీ నిలబడటం ద్వారా బీఆరెస్‌ మాజీ నేత, మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ రాజకీయంగా సంచలనం సృష్టించారు. సాధారణంగా కేసీఆర్‌పై పోటీ అంటే పోషమ్మ గుడి ముందు పొట్టేలు కట్టేసినట్టే అన్న నానుడి తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఉన్నది. కేసీఆర్‌ను ఎదుర్కొనేవారికి శంకరిగిరి మాన్యాలే అని కూడా చెబుతారు. అయితే.. కేసీఆర్‌తో విభేదించి.. పార్టీకి రాజీనామా చేసిన ఈటల రాజేందర్‌.. హుజూరాబాద్‌ బరిలో నేరుగా కేసీఆర్‌ నిలబడనప్పటికీ.. అక్కడ గులాబీ పార్టీ అభ్యర్థిని ఓడించడం ద్వారా.. కేసీఆర్‌నే ఓడించారు. ఆ షాక్‌ నుంచి కోలుకోవడానికి బీఆరెస్‌కు చాలాకాలమే పట్టింది.


కానీ.. ఈసారి హుజూరాబాద్‌తోపాటు.. నేరుగా కేసీఆర్‌నే ఢీకొనేందుకు ఆయన గజ్వేల్‌లోనూ పోటీకి దిగుతుండటం ఎన్నికల వేళ తీవ్ర ఆసక్తి రేపుతున్నది. రెండుచోట్ల పోటీ చేస్తున్న ఈటలకు, గజ్వేల్‌, హుజురాబాద్‌లో ఎదురులేదా? లేదా రెంటికి చెడ్డ రేవడి ఔతారా? అనే చర్చ నడుస్తున్నది. గజ్వేల్‌లో కేసీఆర్‌కు ఈటల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్న మాట వాస్తవమని క్షేత్రస్థాయి చర్చలను బట్టి అర్థమవుతున్నది. మల్లన్నసాగర్‌ నిర్వాసితులు, బీసీ ఓటర్లు ముఖ్యంగా ఈటల సామాజికవర్గ ముదిరాజ్‌ల మద్దతు రాజేందర్‌కే ఉంటుందని అంటున్నారు. కానీ ఇవే ఆయనను గజ్వేల్‌లో గెలువు అవకాశాలను మెరుగుపరచలేవంటున్నారు. కేసీఆర్‌పై వ్యతిరేకత ఉన్నప్పటికీ కేసీఆర్‌ గట్టేక్కే అవకాశాలు లేకపోలేదన్న చర్చకూడా నడుస్తుండటం విశేషం.

హుజూరాబాద్‌లో త్రిముఖ పోటీ

హుజూరాబాద్‌లో కూడా త్రిముఖ పోటీ నెలకొనే అవకాశాలు ఉన్నాయంటున్నారు. గత ఉప ఎన్నికలో హుజురాబాద్‌ నియోజకవర్గంలోని హుజురాబాద్‌, జమ్మికుంట, వీణవంక, కమలాపూర్‌, ఇల్లంతకుంట అన్నిమండలాల్లో ఈటలకే ఆధిక్యం వచ్చింది. కానీ ఈసారి హుజురాబాద్‌ టౌన్‌, గ్రామీణ ఓటర్లలో దాదాపు 60 శాతంమంది కాంగ్రెస్‌ అభ్యర్థి వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. దీనికి కారణం లేకపోలేదు. ఇక్కడ పోటీ చేస్తున్న ఒడితల ప్రణవ్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వొడితల రాజేశ్వర్‌రావు, కెప్టెన్‌ లక్ష్మీకాంతరావులకు మనుమడు. అలాగే 2004 ఎన్నికల్లో, 2008 ఉప ఎన్నికలో కెప్టెన్‌ ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడం వల్ల హుజురాబాద్‌ మండలం వరకు ఆ కుటుంబానికి గట్టి పట్టున్నది. అందుకే అక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు అక్కడే వస్తాయంటున్నారు. ఈటల సొంత మండలమైన కమలాపూర్‌లోనూ ఇద్దరికీ సమానంగా ఓట్లు వస్తాయనే అంచనాలున్నాయి. ఈ రెండు మండలాల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డికి తక్కువ ఓట్లే వచ్చినా వీణవంక, ఇల్లంతకుంటలో బీఆర్‌ఎస్‌కు అనుకూల వాతావరణం ఉంటుందని చెబుతున్నారు. ఇక అభ్యర్థుల గెలుపు అవకాశాలను నిర్ణయించే జమ్మికుంట టౌన్‌, గ్రామీణ ప్రాంత ఓట్లు మూడు పార్టీల అభ్యర్థులకు పడేలా ఉన్నాయి. జమ్మికుంట పట్టణంలోని వ్యాపారవర్గాలు ఈటలవైపే ఉన్నా మిగిలిన వర్గాలు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులవైపు చూస్తున్నారని అర్థమవుతున్నది.

పాడి కౌశక్‌రెడ్డి పరిస్థితేంటి?

వీణవంక.. పాడి కౌశిక్‌రెడ్డి సొంత మండలం. ఆయనకు ఈ మండలంలో పాటు ఇల్లంతకుంటలోనూ పట్టున్నది. ఇక్కడ బీఆర్‌ఎస్‌కు కొంత అనుకూలత ఉన్నదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే కౌశిక్‌ రెడ్డి బంధువు పాడి ఉదయ్‌ నందన్‌ రెడ్డికి కూడా వీణవంక మండలంలో మంచి పేరే ఉన్నది. కౌశిక్‌రెడ్డి, ఉదయ్‌ నందన్‌రెడ్డి మధ్య విభేదాలున్నాయి. దీంతో ఇక్కడ ఈటల.. ఉదయ్‌ నందన్‌రెడ్డి మద్దతు కోరారు. ప్రస్తుతం ఉదయ్‌నందన్‌రెడ్డి.. ఈటల గెలుపు కోసం పనిచేస్తున్నారు.


అది ఎంతవరకు ఫలిస్తుందన్నదని ఫలితాల వరకూ వేచి చూడాలని అంటున్నారు. ఈ త్రిముఖ పోరులో ప్రధానపోటీ బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థుల మధ్యే ఉంటుందని కొందరు అంటున్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థిది మూడో స్థానమే అనేది కొందరి వాదన. అయితే వొడితెల ప్రణవ్‌కు గెలుపు అవకాశాలే కాదు, ఒకవేళ తాను గెలువకపోయినా ఈటల ఓటమికి కారణమై కౌశిక్‌ బైటపడినా ఆశ్చర్యపోనక్కరలేదంటున్నారు. బీజేపీ బీసీ ముఖ్యమంత్రి నినాదాన్ని ఎత్తుకున్న తర్వాత అందరిచూపు ఈటలవైపే ఉన్నది. ఆ పార్టీకి అధికారంలోకి వచ్చేన్ని సీట్లు రాకపోవచ్చు అన్నది అందరికీ తెలిసిందే. అయితే ఈసారి రెండంకెల సీట్ల వరకు చేరుకోవచ్చు అనే అంచనాలు వెలువడుతున్నాయి.