Hyderabad | ఓటేసిన ప్రముఖులు.. హైదరాబాద్‌లో సినీ తారల సందడి

పార్లమెంటు ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలు పార్టీల ప్రముఖ నాయకులు, ఎంపీ అభ్యర్థులు, సెలబ్రిటీలు, సినీ తారలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

  • Publish Date - May 13, 2024 / 05:15 PM IST

విధాత : పార్లమెంటు ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలు పార్టీల ప్రముఖ నాయకులు, ఎంపీ అభ్యర్థులు, సెలబ్రిటీలు, సినీ తారలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు కొడంగల్‌లోని ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతిపక్ష నేత, మాజీ సీఎం కేసీఆర్ దంపతులు చింతమడక పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నందినగర్ పోలింగ్ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు.

రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి నల్లగొండలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సతీమణి ఎమ్మెల్యే పద్మావతితో కలిసి కోదాడ నియోజకవర్గం నయానగర్ స్కూల్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి నల్లగొండ నాగార్జున కాలనీలోని ఎంవీఆర్ స్కూల్‌ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ బస్సులో వెళ్లి హుస్నాబాద్‌లో తన ఓటు వేశారు.

ములుగు జిల్లా అగ్గన్నపేటలో మంత్రి సీతక్క, ఖమ్మం జిల్లా మధిరలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, గొల్లగూడెంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కల్లూరు మండలం నారాయణపురంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి జి.కిషన్‌రెడ్డి కాచిగూడ పోలింగ్ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటుహక్కు వినియోగించుకున్నారు.

కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయర్ జ్యోతినగర్ చైతన్యపురి సాధన స్కూలు పోలింగ్ బూత్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. సికింద్రాబాద్ అమృత విద్యాలయం పోలింగ్ బూత్ లో హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత ఓటుహక్కు వినియోగించుకున్నారు. మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కుటుంబ సభ్యులతో కలిసి శామిర్ పేట పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.

హైదరాబాద్‌లో ఓటేసిన సినీ తారలు

పార్లమెంటు ఎన్నికల పోలింగ్లో హైదరాబాద్‌లో తెలుగు సినీ నటులు..సెలబ్రిటీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు .జూబ్లీహిల్స్‌లోని ఓబుల్ రెడ్డి స్కూల్ పోలింగ్ కేంధ్రంలో జూనియర్ ఎన్టీఆర్ దంపతులు ఓటు వేశారు. ఇదే పోలింగ్ కేంద్రంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్‌లో సినీనటుడు చిరంజీవి, కంట్రీ క్లబ్‌లో రాంచరణ్ దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఫిలింనగర్‌లో నటుడు అల్లు అర్జున్ దంపతులు ఓటేశారు. నానక్‌రామ్ గూడలో నటుడు నరేశ్‌, కుందన్ బాగ్‌లో జయేశ్ రంజన్‌, జూబ్లిహీల్స్‌లో దర్శకుడు తేజా, నటుడు కోట శ్రీనివాస్‌రావు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఏపీలో పులివెందులలో జగన్‌.. ఉండవల్లిలో చంద్రబాబు

ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పులివెందులలో బాకరాపురం జయమ్మ కాలనీ పోలింగ్ కేంద్రంలో సీఎం జగన్ దంపతులు ఓటు వేశారు. ఉండవల్లిలో టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు దంపతులు ఓటు వేయగా, మంగళగిరిలో జనసనే అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవాతో కలిసి వచ్చి తన ఓటు వేశారు. ఇక్కడ లెజినోవాకు మాత్రం ఓటు హక్కు లేదు. ఇక హిందూపురంలో నటుడు బాలకృష్ణ దంపతులు ఓటు వేయగా, ఏపీ పీసీసీ చీఫ్, కడప కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్‌. షర్మిల భర్తతో కలిసి ఇడుపుల పాయలో ఓటు వేశారు.

Latest News