కొత్త స‌ర్కారుకు జీతాలే తొలి సమస్య

  • Publish Date - December 4, 2023 / 05:40 PM IST
  • కొత్త సర్కారుకు  ఆర్థిక కష్టాలు తప్పవా?
  • అప్పుల ఊబిలో తెలంగాణ
  • బ‌డ్జెట్ అప్పులు 3.57 ల‌క్ష‌ల కోట్లు
  • కార్పొరేష‌న్ల అప్పులు 1.30 ల‌క్ష‌ల కోట్లు
  • కాళేశ్వ‌రం వాటానే రూ.80 వేల కోట్లు
  • మిష‌న్ భ‌గీర‌థ వాటా రూ. 20 వేల కోట్లు
  • వ‌డ్డీ చెల్లింపులే అధికం.. అస‌లుకు పైస‌లేవి?
  • రాష్ట్ర స్వంత ఆదాయం నెల‌కు 10 వేల కోట్లు
  • ఖ‌ర్చు రెట్టింపు.. అప్పుల కోసం ఆర్జీలు
  • క‌ష్టకాలంలో కాంగ్రెస్ చేతికి పాల‌నా ప‌గ్గాలు

విధాత‌, హైద‌రాబాద్‌: కొలువు దీరే కొత్త స‌ర్కారుకు ఆర్థిక స‌వాళ్లు ఎదురు కానున్నాయి. మిగులు బ‌డ్జెట్‌తో ఏర్ప‌డిన కొత్త రాష్ట్రానికి 10 ఏళ్ల‌లో అల‌విగాని అప్పులు అయ్యాయి. ఉద్యోగుల‌కు మొద‌టి తేదీన జీతాలు ఇచ్చే ప‌రిస్థితి కూడా లేకుండా పోయింది. చివ‌ర‌కు వ‌డ్డీ చెల్లింపుల కోస‌మే ప్ర‌తి నెల రూ.2 వేల కోట్ల‌కు త‌గ్గ‌కుండా రుణాలు తీసుకోవాల్సిన దుస్థితి ఏర్ప‌డింది.

ఫ‌లితంగా రోజురోజుకూ తెలంగాణ స‌ర్కారు అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్న‌ది. ధ‌నిక రాష్ట్రంగా చెప్పుకొంటున్నతెలంగాణ‌కు అప్పులే ద‌ర్శ‌నమిస్తున్నాయి. ఎప్పుడు బాండ్ల వేలం వేస్తారా? అని రుణాల కోసం రిజ‌ర్వు బ్యాంకు వ‌ద్ద ప్ర‌తి నెల తెలంగాణ ప్ర‌భుత్వం ప‌డిగాపులు గాసే స్థితికి చేరుకున్న‌ది. ఇందుకోసం ఏకంగా ఆర్థిక శాఖ నుంచి ఒక అధికారినే కేటాయించారని తెలుస్తున్నది. 

నేరుగా తీసుకున్న రుణాలు 3.59 లక్షల కోట్లు

రాష్ట్ర ప్ర‌భుత్వం నేరుగా తీసుకున్న అప్పులు ఇప్ప‌టి వ‌ర‌కు రూ.3.59 ల‌క్ష‌ల‌ కోట్ల‌కు చేరుకున్నాయి. ఇవి కాకుండా రాష్ట్ర ప్ర‌భుత్వం వివిధ కార్పొరేషన్ల ద్వారా వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు మరో 1.29 ల‌క్ష‌ల కోట్ల రూపాయల వరకూ ఉన్నాయి. వీటిల్లో రుణాలు తీసుకోవ‌డం కోసం ప్ర‌త్యేకంగా తెలంగాణ ప్ర‌భుత్వం కార్పొరేషన్లను ఏర్పాటు చేయ‌డం కూడా విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. ఇలా కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ కోసం ఏకంగా కార్పొరేషన్ల ద్వారా రూ.80,265.51 కోట్ల రుణం తీసుకున్న‌ది.

మిష‌న్ భ‌గీర‌థ కోసం రూ.24,364.38 కోట్ల రుణం తీసుకున్న‌ది. ఇలా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల‌కు 10 శాతం వ‌ర‌కు వ‌డ్డీ చెల్లించాల్సి ఉంటుంది. వీటిని చెల్లించే ప‌రిస్థితిలో ఆ కార్పొరేష‌న్లు లేవు. దీంతో ఈ అప్పుల భారం ప్ర‌భుత్వం మోయాల్సిందే. ఆర్టీసీ, జీహెచ్ఎంసీ, జ‌ల‌మండ‌లి, రోడ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్, హౌసింగ్ కార్పొరేష‌న్‌, విద్యుత్ సంస్థ‌లు ఇలా అవ‌కాశం ఉన్న ప్ర‌తి సంస్థ నుంచి రుణాలు తీసుకున్నారు.

వడ్డీలే నెలకు 1700 కోట్లు

వివిధ రూపాల‌లో తీసుకున్న అప్పుల‌కు ప్ర‌తి నెల వ‌డ్డీ కింద‌నే దాదాపు రూ.1700 కోట్లు చెల్లిస్తున్న‌ది. అస‌లు రూ.213 కోట్లు మాత్ర‌మే తీరుస్తున్న‌ది. రాష్ట్ర ప్ర‌భుత్వ ఆదాయం అప్పులు తీర్చే స్థాయిలో పెర‌గ‌డం లేదు. రాష్ట్ర ప్ర‌భుత్వం కాగ్‌కు స‌మ‌ర్పించిన లెక్క‌ల ప్ర‌కారం అక్టోబ‌ర్-2023 నెల‌ను ప‌రిశీలిస్తే.. ప‌న్నుల ద్వారా (జీఎస్టీ, మ‌ద్యం అమ్మ‌కాలు, రిజిస్ట్రేష‌న్లు) వ‌చ్చే ఆదాయం రూ.10,691.20 కోట్లు మాత్ర‌మే.

దీనికి గ్రాంట్స్‌, రుణాల రిక‌వ‌రీ ద్వారా వ‌చ్చిన ఆదాయంతోపాటు భూముల అమ్మ‌కాల ద్వారా వ‌చ్చిన ప‌న్నేత‌ర ఆదాయం క‌లిపితేనే నెల‌కు రూ.12,570.71 కోట్లు వ‌స్తున్న‌ది. ప‌న్నేత‌ర ఆదాయం ప్ర‌తి నెలా రాదు. ప‌న్నుల ద్వారా వ‌చ్చే ఆదాయ‌మే రాష్ట్ర ప్ర‌భుత్వానికి నికరంగా వ‌చ్చే ఆదాయంగా ప‌రిగ‌ణించాల్సి ఉంటుంది. 

ఖర్చులు పెరుగుతున్నాయి

ప్ర‌తి నెలా ప్ర‌భుత్వానికి వ‌చ్చే ఆదాయంలో హెచ్చు త‌గ్గులుంటాయి కానీ, ఖ‌ర్చులు మాత్రం రోజు రోజుకూ పెరుగుతాయి కానీ త‌రిగే ప‌రిస్థితి లేదు. రాష్ట ప్ర‌భుత్వానికి వ‌చ్చే ఆదాయం కంటే ఖ‌ర్చు నెల‌కు రెండు వేల కోట్లు అద‌నంగా రూ.14,613.29 కోట్లకు చేరుకున్న‌ది.

దీంతో బ‌డ్జెట్ నిర్వ‌హ‌ణ ఇబ్బంది కావ‌డంతో ప్ర‌తి నెల ఉద్యోగుల‌కు వేత‌నాలు ఒక‌ట‌వ తేదీన ఇవ్వ‌లేకపోతున్న‌ది. దాదాపు నెల‌లో 15 రోజులపాటు వ‌స్తున్న డ‌బ్బుల‌ను వేత‌నాల‌కు స‌ర్దుతున్నారు. తెచ్చిన అప్పుల‌కు వ‌డ్డీల కింద నెల‌కు రూ.1691.39 కోట్లు చెల్లిస్తున్న‌ది. ప్ర‌తినెలా ఈ మొత్తం ప్ర‌భుత్వ అకౌంట్ నుంచి అటోమెటిక్‌గా క‌ట్ అవుతుంది.

ప్ర‌భుత్వం ప్ర‌తి ఏటా వడ్డీలు చెల్లిస్తున్న‌ది కానీ అస‌లు చెల్లిస్తున్న‌ట్లు ఎక్క‌డా బ‌డ్జెట్ ప‌ద్దుల్లో చూపించ‌డం లేదు. అయితే వివిధ ప‌థ‌కాల‌కు మాత్రం నెల‌కు రూ.4 వేల కోట్ల పైచిలుకు ఖ‌ర్చు చేస్తున్న స‌ర్కారు దీనిని రెవెన్యూ ఖ‌ర్చు కింద చూపిస్తున్నది. అలాగే ఉద్యోగుల వేత‌నాల‌కు రూ.3114.94 కోట్లు, పెన్ష‌న్లకు రూ.1441.87 కోట్లు ఖ‌ర్చు అవుతున్న‌ది. 

నిర్వహణ ఖర్చుల భారం

ప్ర‌తి నెల నిర్వ‌హ‌ణ ఖ‌ర్చులే భారంగా మారిన ప‌రిస్థితి తెలంగాణ ప్ర‌భుత్వానికి ఏర్ప‌డింది. ఇలాంటి క్లిష్ట ప‌రిస్థితిలో ప్ర‌జ‌ల‌కు అనేక హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చింది. దీంతో బ‌డ్జెట్ నిర్వ‌హ‌ణ ఏవిధంగా చేస్తార‌న్న చ‌ర్చ ఆర్థిక నిపుణుల్లో జ‌రుగుతున్న‌ది. ఇప్ప‌టికే విద్యుత్తు బ‌కాయిలు వేల కోట్ల‌కు పేరుకుపోయాయి. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌డానికి భారీ ఎత్తున నిధులు అవ‌స‌ర‌మ‌వుతాయి. అమాతం ఖ‌ర్చులు పెరిగి పోయే ప‌రిస్థితి ఉన్న నేప‌థ్యంలో తెలంగాణ ఆర్థిక శాఖ‌కు బ‌డ్జెట్ నిర్వ‌హ‌ణ క‌త్తిమీద సాములాంటిదేన‌న్న అభిప్రాయం స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతున్నది. 

నెల‌కు నికరంగా వ‌చ్చే ఆదాయం (అక్టోబ‌ర్ నెల‌లో)

ప‌న్నుల ద్వారా రూ.10,691. 20 కోట్లు

పన్నేతర రూ. 1660.23 ( భూముల అమ్మ‌కాల ఆదాయం)

గ్రాంట్స్ రూ. 216.47

రుణాల రిక‌వ‌రీ రూ.2.81

మొత్తం ఆదాయం రూ.12,570.71 కోట్లు

ఖ‌ర్చులు

రెవెన్యూ ఖ‌ర్చులు (ప‌థ‌కాలు) రూ.4,418.42 కోట్లు

వ‌డ్డీ చెల్లింపులు రూ.1691.39 కోట్లు

వేత‌నాలు రూ. 3114.94 కోట్లు

పెన్ష‌న్లు రూ.1441.87 కోట్లు

స‌బ్సిడీలు రూ. 374.67 కోట్లు

క్యాపిట‌ల్ ఖ‌ర్చులు రూ. 3301.22 కోట్లు

 వేత‌నాలు రూ. 57.61 కోట్లు

రుణాలు రూ. 213.17 కోట్లు

 మొత్తం ఖ‌ర్చు రూ.14,613.29 కోట్లు

మొత్తం ఆదాయం రూ.12,570.71 కోట్లు

 మొత్తం ఖ‌ర్చు రూ.14,613.29 కోట్లు

త‌రుగుద‌ల రూ. 2,042.58 కోట్లు

అక్టోబర్‌లో 2,044.62 కోట్ల రుణం

ఈ పరిస్థితుల్లో అక్టోబ‌ర్ నెల‌లో ఓపెన్ మార్కెట్‌లో ప్రభుత్వం రూ.2,044.62 కోట్ల రుణం తీసుకున్న‌ది. దీనిని ప‌రిశీలిస్తే తెచ్చిన అప్పుల‌కు వ‌డ్డీలు చెల్లించ‌డానికే ప్ర‌తి నెల కొత్త అప్పులు చేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. వాస్త‌వంగా ఈ ఏడాది మొత్తంలో క‌లిపి రుణం తీసుకోవ‌డానికి ఎఫ్ఆర్‌బీఎం ప్ర‌కారం అసెంబ్లీ ఆమోదం తీసుకున్న‌రుణం రూ.38,234.94 కోట్లు, కానీ ఈ ఏడాదిలో ఇప్ప‌టికే తీసుకున్న రుణం రూ.33,378.34 కోట్లు.