రైల్వే స్టేషన్లలో దొంగలను పట్టుకునే క్రమంలో ఘర్షణ
హైదరాబాద్: హైదరాబాద్‌లో మరోసారి పోలీసు కాల్పుల కలకలం రేపింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు పెట్రోలింగ్‌లో భాగంగా నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు గుర్తించారు. వారిని ఆపి ప్రశ్నించగా, పారిపోయే క్రమంలో పోలీసులపైకి ఒకరు గొడ్డలితో దాడికి యత్నించాడు. మరో వ్యక్తి రాళ్ల దాడికి దిగాడు. ఈ క్రమంలో పోలీసులు కాల్పులు జరిపి దుండగులను పట్టుకున్నారు. కాల్పుల్లో రాజు అనే వ్యక్తితోపాటు మరొకరికి గాయాలయ్యాయి. మరో ఇద్దరు దుండగులు తప్పించుకున్నారు. వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. గాయపడినవారిని ఉస్మానియా దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవలే హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో పార్ధీ గ్యాంగ్ దొంగలను పట్టుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఇక గత నెలలో సికింద్రాబాద్‌లోని సిటీలైట్ హోటల్ వద్ద యాంటీ స్నాచింగ్ టీమ్ పోలీసులు.. పారిపోతున్న దొంగల బైక్ టైరును కాల్చాలని ప్రయత్నించగా.. ఆ తూటా బైక్ వెనుక కూర్చున్న వ్యక్తి కాలులోకి దూసుకెళ్లింది. అనంతరం ఇద్దరు స్నాచర్లను పట్టుకున్నారు. మరో ఘటనలో గత కొన్నిరోజులుగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న చైన్ స్నాచర్లపై సైదాబాద్ పోలీసులు కాల్పులు జరిపారు. వారిని అమీర్ గ్యాంగ్‌కు చెందిన దొంగలుగా గుర్తించారు.