Site icon vidhaatha

అమెరికాలో కాల్పుల కలకలం.. మరో తెలుగు యువకుడి మృతి

మృతుడు బాపట్లకు చెందిన దాసరి గోపికృష్ణగా గుర్తింపు

విధాత : అమెరికాలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు మృతి చెందాడు. మృతుడిని ఏపీలోని బాపట్ల జిల్లాకు చెందిన దాసరి గోపీకృష్ణ (32)గా గుర్తించారు. కర్లపాలెం మండలం యాజలికి చెందిన గోపీకృష్ణ జీవనోపాధి కోసం 8 నెలల క్రితం అమెరికా వెళ్లాడు. టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్‌లో ఓ సూపర్ మార్కెట్‌లో పనిచేస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం గోపీకృష్ణ కౌంటర్‌లో ఉండగా.. ఓ దుండగుడు నేరుగా వచ్చి తుపాకీతో అతడిపై కాల్పులు జరిపాడు. తీవ్రగాయాలతో గోపికృష్ణ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అనంతరం దుండగుడు ఓ వస్తువు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ తర్వాత గోపీకృష్ణను ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయాడు.

ఈ సమాచారం తెలియడంతో అతడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. గోపి స్వగ్రామం యాజలిలో విషాదఛాయలు అలముకున్నాయి. మరోవైపు దుండగుడు కాల్పులు జరిపిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇటీవల అమెరికాలో గన్‌ కల్చర్‌ దాడులలో పలువురు భారతీయులు మృతి చెందడం ఆందోళన కల్గిస్తుంది. మంచి భవిష్యత్తు కోసం అనేక వ్యయప్రయాసాలకోర్చి ఖండాలు దాటి అమెరికా వెలుతున్న భారతీయులు, ముఖ్యంగా తెలుగు వారు పదుల సంఖ్యలో దాడుల్లో, ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్న తీరు వారి కుటుంబాలను దుఃఖమయం చేస్తుంది.

Exit mobile version