- పోర్టల్ అవకతవకలపై సీఎం నజర్
- ప్రజలముందే కమ్యూనిటీ ఆడిటింగ్
- ధరణిలో రికార్డ్లకున్న భద్రతేంటి?
- 2014 రికార్డు- ఇప్పటి రికార్డుకు సీక్వెన్స్ పరిశీలన
- మాడ్యూల్లో గందరగోళం ఉందన్న సీసీఎల్ఏ
- కలెక్టర్లపై పని వత్తిడి అందుకే పెండింగ్
- రిజెక్టెడ్ కేసులలో సర్కారు వద్ద 30 కోట్లపైనే
- నేను రాకముందు ధరణి వచ్చిందన్న సీసీఎల్ఏ
- సీరియస్ అయిన ముఖ్యమంత్రి రేవంత్
- పది రోజుల్లో పూర్తిస్థాయి నివేదికివ్వాలని ఆదేశం
- భూ వివాదాల పరిష్కారానికి కమిటీ యోచన
విధాత, హైదరాబాద్: ధరణి పోర్టల్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టి కేంద్రీకరించారు. బుధవారం సచివాలయంలో ధరణి పోర్టల్ అంశంపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి సమావేశమై, సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్‌రెడ్డి.. పది రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ధరణిపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తేనే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని, దీంతో పాటు గ్రామాల్లో ప్రజల ముందు కమ్యూనిటీ ఆడిటింగ్ చేయాలని కూ చెప్పారని సమాచారం.
ఫోరెన్సిక్ ఆడిటింగ్ ద్వారా రికార్డుల కరెక్షన్ ఏవిధంగా నిబంధనల ప్రకారంగా జరిగిందా? లేదా అక్రమ పద్దతుల్లో జరిగిందే అనే విషయం తెలిసి పోతుందన్నారని సమాచారం. ధరణి పోర్టల్ తీరుపై అనేక సందేహాలు వ్యక్తం చేసిన సీఎం.. ధరణిలో రికార్డులకు ఉన్న భద్రత ఎంత? అని రెవెన్యూ అధికారులను ప్రశ్నించారని తెలుస్తున్నది. ‘ప్రభుత్వం లేదా రైతుల వద్ద ఉండాల్సిన రికార్డులన్నీ ప్రైవేట్ వ్యక్తుల వద్ద ఉంచారు. ఆ డాటా తీవ్రవాదుల చేతికి వెళితే పరిస్థితి ఏమిటి?’ అని సీఎం అధికారులను అడిగారని విశ్వసనీయవర్గాలు చెప్పాయి.
ధరణిపై సీఎం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోయిన సీసీఎల్ఏ నవీన్ మిట్టల్.. ధరణి వచ్చినప్పుడు తాను లేనని అనడంతో ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారని తెలిసింది. ‘ఉన్న సమాచారం ఇప్పుడు చెప్పండి. మొత్తం సమాచారం తెలుసుకొని 10 రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక ఇవ్వండి’ అని మిట్టల్‌కు స్పష్టం చేశారని అధికారవర్గాలు తెలిపాయి. ధరణిపై ఫోరెన్సిక్ ఆడిట్, గ్రామాల్లో ప్రజల ముందు కమ్యూనిటీ ఆడిటింగ్ చేయాలన్నారని తెలిసింది. ఫోరెన్సిక్ ఆడిటింగ్ ద్వారా రికార్డుల కరెక్షన్ నిబంధనల ప్రకారంగా జరిగిందా? అక్రమ పద్ధతుల్లో జరిగిందా? అనే విషయం తెలిసిపోతుందన్న సీఎం.. ప్రజలముందే రికార్డుల ఆడిటింగ్ చేస్తే, రికార్డుల్లో జరిగిన తప్పులు బయటకు వస్తాయని, వాటిని ప్రజల సమక్షంలోనే సరి చేయవచ్చునని అన్నారని తెలిసింది. ఈ మేరకు గ్రామాల్లోరెవెన్యూ సదస్సులు పెట్టాలని చెప్పారని సమాచారం. ‘ధరణిలో రికార్డులు మార్చారు. చేతి రాత ద్వారా రూపొందించిన రికార్డు లేనప్పుడు 2014కు ముందున్న భూమి రికార్డుతో పాటు ఇప్పుడున్న భూమి రికార్డు పరిశీలించి, జరిగిన మార్పులు చట్ట ప్రకారంగా జరిగాయా లేదా? అన్నది పరిశీలించాలి’ అని అభిప్రాయపడ్డట్టు తెలిసింది.
సీఎం రేవంత్ లేవనెత్తిన ప్రశ్నలు
ధరణి పుట్టు పూర్వోత్తరాల గురించి సీసీఎల్ఏను సీఎం అడిగినప్పుడు.. ధరణి వచ్చినప్పుడు తాను లేనని మిట్టల్ సమాధానం ఇచ్చారని సమాచారం. ‘రాజకీయ నాయకులు రావచ్చు పోవచ్చు. కానీ, ఏ అధికారి అయినా సీటులోకి వచ్చిన తరువాత అంతకు ముందు నేను లేను కాబట్టి నాకేమీ తెలియదని చెప్పడం ఎలా కరెక్ట్ అవుతుంది?’ అని నిలదీశారని తెలుస్తున్నది. మొత్తం వివరాలు తెలుసుకొని సమాధానం చెప్పాలని సీసీఎల్ఏను సీఎం రేవంత్ ఆదేశించారని సమాచారం.
ఇప్పటికీ 18 లక్షల ఎకరాలు పార్ట్‌బీలో ఎందుకున్నాయి?
సమీక్ష సందర్భంగా అనేక ప్రశ్నలను సీసీఎల్‌పై ముఖ్యమంత్రి సంధించారని సమాచారం. ‘ధరణి వచ్చి ఇంతకాలం అయిన తరువాత పార్ట్-బిలో 18 లక్షల ఎకరాల భూమి ఎందుకు ఉంది? రిజెక్ట్ గ్రీవెన్స్ 18 లక్షలు ఎందుకున్నాయి? సమస్యలు పరిష్కారం అయితే హైకోర్టులో కేసులు ఇన్ని ఎందుకున్నాయి? ధరణి పోర్టల్ నిర్వహణ ప్రైవేట్ కంపెనీకి ఇచ్చారు.. కోర్ డేటా భద్రత ఎక్కడ? ప్రజలకు ప్రభుత్వానికి మధ్య రిలేషన్‌లో ప్రభుత్వం వద్ద ఉండాల్సిన డాటాను ప్రైవేట్ వ్యక్తులకు ఎలా ఇస్తారు? ఈ డాటా ఎక్కడ స్టోర్ చేశారు? ఈ సమాచారం తీవ్రవాదుల చేతిలో పడితే పరిస్థితి ఏమిటి? కంపెనీ జవాబుదారీతనం ఏమిటి?’ అని ప్రశ్నలు కురిపించారని తెలిసింది.
ప్రైవేటుకు ఎలా ఇస్తారు?
ప్రైవేట్ కంపెనీకి ధరణి పోర్టల్ నిర్వహణను ఎలా ఇచ్చారు. టెండర్ ప్రాసెస్ ఏమిటి? కంపెనీ యజమాన్యం ఎక్కడ? ధరణి సర్వర్లు ఎక్కడ ఉంటాయి? ఒకవేళ సర్వర్లు పేలితే ఆ డాటా పరిస్థితి ఏంటి? కంపెనీ వాడు మానివేస్తే డాటా పరిస్థితి ఏమిటి?’ అని రేవంత్ ప్రశ్నించారని తెలిసింది.
ఇప్పటికే ఆ పరిస్థితి వచ్చిందని, సెప్టెంబర్‌లోనే కాంట్రాక్ట్ అయిపోతే తాము రెండు నెలలు గడువు పొడిగించామని వివరించారని సమాచారం. దీంతో పూర్తి స్థాయి నివేదిక పదిరోజుల్లో ఇవ్వాలని సీఎం రేవంత్ సీసీఎల్ ఏను ఆదేశించారని తెలిసింది.
ఏ చట్టం ప్రకారం సవరణలు చేస్తున్నారు?
సమావేశంలోనే జిల్లా కలెక్టర్లు ఏ చట్టం ప్రకారం సవరణలు చేస్తున్నారన్న ప్రశ్న తలెత్తిందని అధికారవర్గాలు వెల్లడించాయి. ఏ రకమైన రూల్స్ ఉన్నాయో సీఎం ఆరా తీసినట్టు సమాచారం. సాదాబైనామాలకు చెందిన 9 లక్షల దరఖాస్తులు, పోడు భూముల పట్టాల సమస్య, కౌలు చట్టం అమలు, కౌలురైతుల సమస్యలపై చర్చ జరిగిందని తెలుస్తున్నది.
రిజెక్ట్ కేసులు ఎందుకు పరిశీలించడం లేదు?
ధరణిలో సమస్య పరిష్కారానికి ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకుంటే రిజక్ట్ అని సమాధానం వస్తున్నదని, మళ్లీ మళ్లీ దరఖాస్తు చేస్తుంటే ఇదేమిటని ఎందుకు పరిశీలించడం లేదని రేవంత్ సీసీఎల్ఏను అడిగారని సమాచారం.
దీంతో కలెక్టర్లపై పనిభారం ఎక్కువగా ఉందని చెప్పడంతోపాటు ధరణి మాడ్యూల్స్‌లో గందరగోళం ఉందని, ఓవర్ లాప్స్ ఉందని తెలిపారని తెలుస్తున్నది. రిజెక్ట్ డబ్బులు ఎందుకు ఇవ్వరని అడిగారని అధికారవర్గాలు చెప్పాయి.
ధరణిలో రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకొని ఏకారణం చేతనో రిజిస్టర్ కాకపోతే ఆ డబ్బులు ఎందుకు తిరిగి వాపస్ ఇవ్వలేక పోతున్నారని సీఎం ప్రశ్నించినప్పడు ఇలా భూ యజమానులకు తిరిగి ఇవ్వాల్సిన డబ్బులు ప్రభుత్వం వద్ద రూ. 30నుంచి రూ.40 కోట్ల వరకు ఉన్నట్లు తెలిపారని సమాచారం. ధరణిలో ఇప్పటికీ డాటా కరెక్షన్ దరఖాస్తులు 2.31 లక్షల వరకు పెండింగ్‌లో ఉన్నట్లు సీఎంకు తెలిపినట్లు చెబున్నారు. వీటిలో అత్యధికంగా రూ.40 వేల దరఖాస్తులు ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే ఉన్నట్లు తెలిపారని సమాచారం.
భూ వివాదాలకు పరిష్కారానికి ప్రత్యేక కమిటీ
రాష్ట్రంలో భూ సంబంధిత వివాదాలకు శాశ్వత పరిష్కారానికై తగిన మార్గదర్శకాల రూపకల్పనకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
గతంలో వేసిన కోనేరు రంగారావు కమిటీ మాదిరిగానే ఈ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. భూసంబంధిత వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించే విధంగా ఈ కమిటీ ప్రతిపాదనలను సూచించాలన్నారు. ఈ కమిటీలో మంత్రులతోపాటు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు, రైతు ప్రతినిధులు, భూ సంబంధిత చట్టాల్లో నిష్ణాతులు సభ్యులుగా ఉండాలన్నారు. ధరణి ప్రారంభంనుండి ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలపై సవివర నివేదిక అందచేయాలని సీఎస్‌ను సీఎం రేవంత్ ఆదేశించారు.
ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి దామోదర రాజ నర్సింహా, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, సీసీఎల్ ఏ నవీన్ మిట్టల్, సీఎంఓ అధికారులు శివధర్ రెడ్డి, శేషాద్రి, షా-నవాజ్ ఖాసీం, రైతు ప్రతినిధులు కోదండ రెడ్డి, సంపత్ కుమార్, వేం నరేందర్ రెడ్డి, మన్నె నర్సింహారెడ్డి భూమి చట్టాల నిపుణులు, భూమి సునీల్, రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు వి. లచ్చిరెడ్డి, రవీందర్‌రెడ్డి, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.