WPL-2026 : RCB vs DC | స్మృతి సెంచరీ మిస్​, వాల్ ఫిఫ్టీ – అజేయ బెంగళూరు ఘనవిజయం

స్మృతి మంధాన 96 పరుగులు, జార్జియా వాల్ అర్ధసెంచరీతో RCB మహిళలు ఢిల్లీ క్యాపిటల్స్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఢిల్లీ 166 పరుగులకు ఆలౌట్ కాగా, లారెన్ బెల్–సయాలి సత్ఘరే ప్రారంభంలోనే డీసీ బ్యాటింగ్‌ వెన్నవిరిచారు. స్మృతి చివర్లో అవుటైనా, రిచా ఘోష్–వాల్ జంట ప్రశాంతంగా బెంగళూరు లక్ష్యఛేదనను విజయవంతంగా పూర్తి చేశారు.

Smriti Mandhana and Georgia Voll celebrate their match-winning partnership during RCB’s chase against Delhi Capitals in WPL 2026.

Smriti Mandhana’s 96 Powers RCB to 8-Wicket Win Over DC

విధాత క్రీడా విభాగం | 17 జనవరి 2026 | హైదరాబాద్​:

WPL-2026 : RCB vs DC | ముంబై DY పాటిల్ స్టేడియంలో ఇవాళ జరిగిన WPL–2026 పోరులో రాయల్​ చాలెంజర్స్​ బెంగళూరు రాయల్​గా విజయం సాధించింది.  మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 166 పరుగులకే ఆలౌట్ కాగా, ఛేదనలో బెంగళూరు చెలరేగి 19వ ఓవర్లో విజయం సాధించింది. బెంగళూరు కెప్టెన్​ స్మృతి మంధాన, జార్జియా వాల్​ వీరవిహారం చేసి చెరో చేత్తో విజయం అందుకున్నారు.

క్రీజ్​లో పాతుకుపోయిన మంధాన – వాల్​

ఢిల్లీ విధించిన 167 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు అలవోకగా అందుకుంది. ఓపెనర్ గ్రేస్​ హారిస్​(1) 3వ ఓవర్లోనే షఫాలీకి దొరికిపోగా, క్రీజ్​లోకి వచ్చిన జార్జియా వాల్​, మరో ఓపెనర్​, కెప్టెన్​ స్మృతి మంధానతో బ్యాట్​ కలిపి ఆడుతూ పాడుతూ కూ​ల్​గా విజయంవైపు పయనించారు. వీరిద్దరూ రెండో వికెట్​కు 142 పరుగు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. లక్ష్యానికి 12 పరుగుల దూరంలోనే ఉండగా, దురదృష్టవశాత్తు స్మృతి తృటిలో శతకం చేజార్చుకుని 96 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్​ చేరింది. తర్వాత వచ్చిన హిట్టర్​ రిచా ఘోష్​ అండతో వాల్​ అటు తన హాఫ్​ సెంచరీని, ఇటు విజయ లక్ష్యాన్ని ఒకే ఫోర్​తో అందుకుంది. కాగా, దీంతో ఆడిన 4 మ్యాచ్​లలోనూ విజయం సాధించి ఆర్​సీబీ టేబుల్​ టాపర్​గా కొనసాగుతోంది.

ఢిల్లీ టాపార్డర్​ కకావికలు – గౌరవప్రదమైన స్కోరు అందించిన షఫాలీ అర్థశతకం

టాస్​ ఓడిపోయి బ్యాటింగ్​ ప్రారంభించిన ఢిల్లీ కాసేపట్లోనే లారెన్ బెల్, సయాలి సత్వగారే వేసిన అద్భుతమైన ఓవర్లతో టాప్​ ఆర్డర్​ను కోల్పోయింది. కేవలం రెండు ఓవర్లలోనే 10 పరుగులు మాత్రమే చేసి నాలుగు వికెట్లు కోల్పోయిన దీనస్థితిలో ఉన్న ఢిల్లీని షఫాలి వర్మ ఒంటరి పోరాటంతో నిలబెట్టింది. ఆమె 41 బంతుల్లో 62 పరుగులు చేసి జట్టు తిరిగి గాడిలో పడటానికి పునాది వేసింది. చివర్లో లూసీ హామిల్టన్ దూకుడుగా ఆడి కొన్ని కీలక పరుగులు రాబట్టినా, ప్రీమా రావత్, నదీన్ డి క్లర్క్, బెల్ వరుసగా కీలక వికెట్లు తీసి ఢిల్లీని 166కు పరిమితం చేశారు.

సంక్షిప్త స్కోర్లు :

ఢిల్లీ క్యాపిటల్స్​ : 20 ఓవర్లలో 166 పరుగులు ఆలౌట్​ – షఫాలీ వర్మ 62(41 బంతులు, 4 సిక్స్​లు, 5 ఫోర్లు), లూసీ హామిల్టన్​ 36(19 బంతులు, 3 సిక్స్​లు, 3 ఫోర్లు) – లారెన్​ బెల్​ – 3 వికెట్లు, సయాలీ సత్ఘరే – 3 వికెట్లు.

రాయల్​ చాలెంజర్స్​ బెంగళూరు: 18.2 ఓవర్లలో 2 వికెట్లకు 169 పరుగులు – స్మృతి మంధాన 96(61 బంతులు, 3 సిక్స్​లు, 13 ఫోర్లు), జార్జియా వాల్​ 54(42 బంతులు, 2 సిక్స్​లు, 5 ఫోర్లు) – మరిజాన్​ కప్​ – 1 వికెట్​, నందిని శర్మ– 1 వికెట్​

ప్లేయర్​ ఆఫ్​ ది మ్యాచ్​: స్మృతి మంధాన (బెంగళూరు)

Latest News