Egg Freezing | ఎగ్‌ ఫ్రీజింగ్‌ అంటే ఏంటి..? ఏ వయసులో చేస్తే మంచిది..?

Egg Freezing | ఎగ్‌ ఫ్రీజింగ్ (Egg Freezing)‌.. ఈ పదాన్ని ఈ మధ్య చాలా సార్లు వింటున్నాం. అందుకు కారణం మెగా కోడలు ఉపాసన ఈ పద్ధతి ద్వారా పిల్లలకు జన్మనివ్వబోతుండటమే. గతంలో ఫ్రీజ్‌ చేసిన ఎగ్స్‌ ద్వారా ఉప్సీ ఇప్పుడు గర్భం దాల్చింది. త్వరలోనే కవల పిల్లలకు జన్మనివ్వబోతోంది. ఈ విషయాన్ని ఉపాసన సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు.

Egg Freezing | ఎగ్‌ ఫ్రీజింగ్ (Egg Freezing)‌.. ఈ పదాన్ని ఈ మధ్య చాలా సార్లు వింటున్నాం. అందుకు కారణం మెగా కోడలు ఉపాసన ఈ పద్ధతి ద్వారా పిల్లలకు జన్మనివ్వబోతుండటమే. గతంలో ఫ్రీజ్‌ చేసిన ఎగ్స్‌ ద్వారా ఉప్సీ ఇప్పుడు గర్భం దాల్చింది. త్వరలోనే కవల పిల్లలకు జన్మనివ్వబోతోంది. ఈ విషయాన్ని ఉపాసన సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. దీంతో ఈ ఎగ్‌ ఫ్రీజింగ్‌ గురించి ఇప్పుడు తీవ్రంగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఈ ఎగ్‌ ఫ్రీజింగ్‌ అంటే ఏమిటో..? ఇప్పుడు తెలుసుకుందాం.

ఎగ్‌ఫ్రీజింగ్‌ను oocyte preservation అని కూడా పిలుస్తారు. మహిళల అండాలను వేరు చేసి వాటిని ఫ్రీజ్ చేసి నిల్వ ఉంచుతారు. భవిష్యత్తులో గర్భం దాల్చడానికి మహిళలు తమ అండాలను (eggs) యువ వయస్సులో సేకరించి.. గడ్డకట్టించి నిల్వ చేసే ప్రక్రియ. ఇది సంతానోత్పత్తిని కాపాడుకోవడానికి, వయస్సుతో సంబంధం లేకుండా నాణ్యమైన అండాలను ఉపయోగించుకోవడానికి సహాయపడుతుంది. కొందరు మహిళలు జీవితంలో అనుకున్నది సాధించాకనో, లేక లైఫ్‌లో సెటిల్‌ అయినాకనో పిల్లల్ని కనేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. అయితే, ఓ వయసు వచ్చాక పిల్లలు పుట్టడం కష్టం. వయసు పెరిగే కొద్దీ అండాల్లో నాణ్యత తగ్గిపోతూ వస్తుంది. అలాంటప్పుడు ఈ ఎగ్‌ ఫ్రీజింగ్‌ పద్ధతి ఉపయోగపడుతుంది.
అందుకే ప్రస్తుతం చాలా మంది సెలబ్రిటీలు ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు.

ఏ వయసులో చేసుకోవాలి..?

కెరీర్‌, వ్యక్తిగత కారణాల రీత్యా ప్రెగ్నెన్సీని వాయిదా వేసుకోవాలనుకునే మహిళలు అండాల శీతలీకరణ (Egg Freezing) పద్ధతినే ఎంచుకుంటున్నారు. అయితే, 20 నుంచి 30 ఏళ్ల వయసులోపు వారు ఎగ్‌ ఫ్రీజింగ్‌ చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అప్పుడే అవి నాణ్యంగా ఉంటాయట. అండాలను ఎంత చిన్న వయస్సులో ఫ్రీజ్ చేస్తే, భవిష్యత్తులో గర్భం దాల్చే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇలా సేకరించిన ఎగ్స్‌ను పదేండ్ల వరకూ భద్రపరుచుకోవచ్చని చెబుతున్నారు. ఈ ప్రక్రియ కష్టతరమని అంటారు. చాలా సురక్షితమైన పద్ధతిలోనే ఈ ప్రక్రియ జరుగుతుంది. అయితే, కొంతమంది మహిళలు ఈ ప్రాసెస్ లో కాస్త అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే మత్తుమందు ఇచ్చి, యోని ద్వారా అండాలను సేకరించి, ప్రత్యేక సాంకేతికతతో గడ్డకట్టిస్తారు. ఇలా చేయడం వల్ల నొప్పి తెలియదు. అసౌకర్యంగానూ అనిపించదు.

ఆ సమయంలో శృంగారానికి దూరంగా ఉండాలి..

అండాల సేకరణకు గరిష్టంగా పావుగంట సమయం పడుతుంది. రెండు వారాల ముందు నుంచే ఇందుకు సన్నద్ధమవ్వాల్సి ఉంటుంది. డాక్టర్‌ సలహా మేరకు హార్మోనల్‌ మందులు వాడాల్సి ఉంటుంది. ఈ సమయంలో దంపతులు శృంగారానికీ దూరంగా ఉండాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే హార్మోన్ల మందుల ప్రభావంతో గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువని చెబుతున్నారు. ఇలా సేకరించిన అండాలను అవసరమైనప్పుడు కరిగిస్తారు. శుక్రకణాలతో ఫలదీకరణం చెందించి పిండంగా మార్చి గర్భాశయంలో ప్రవేశపెడతారు. అంతేకాదు, ఈ పద్ధతి చాలా ఖర్చుతో కూడుకున్నది కూడా. అందరికీ సాధ్యం కాదు. అందుకే కొన్ని బీమా కంపెనీలు ఎగ్‌ ఫ్రీజింగ్‌ ఖర్చును కూడా భరించేందుకు ముందుకొస్తుంటాయి.
అనారోగ్యంతో బాధపడుతున్న వారు కూడా ఎగ్‌ ఫ్రీజింగ్‌ చేసుకొని అవసరమైనప్పుడు పిల్లల్ని కనొచ్చు.

Latest News