Lung Cancer | అన్ని క్యాన్సర్ల (Cancer) కన్నా ఊపిరితిత్తుల క్యాన్సర్ (Lung Cancer)తో బాధపడుతున్న వారి సంఖ్య మన దేశంలో పెరిగిపోతోంది. అందులోనూ ఎక్కువగా పురుషులే ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. ఈ క్యాన్సర్ కారణంగా ఏటా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఊపిరితిత్తుల్లో కణాలు అసాధారణంగా పెరిగినప్పుడు ఈ రకమైన క్యాన్సర్ వస్తుంది. అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధనా సంస్థ ప్రకారం 2022లో ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా నమోదైన క్యాన్సర్ లంగ్ క్యాన్సరే. ఆ ఏడాది 25 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. ఇది మొత్తం కొత్త క్యాన్సర్ కేసుల్లో 12.4 శాతానికి సమానం.
ధూమపానం ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ప్రధాన కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దాదాపు 85 శాతం కేసులకు ధూమపానమే కారణంగా పేర్కొంది. దీని కారణంగా ఏటా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వ్యాధిని ఆలస్యంగా గుర్తించడమే ఇందుకు ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. లంగ్ క్యాన్సర్‌ను ఆరంభ దశలోనే గుర్తించాలని (Lung Cancer Symptoms), దాంతో చికిత్సనందించడం సులభతరమవుతుందని అంటున్నారు.
ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడండి..
సాధారణంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలు (Symptoms) ప్రారంభ దశలో అంతగా కనిపించకపోవచ్చు. కానీ వ్యాధి పెరిగేకొద్దీ మన శరీరంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. అందులో నిరంతర దగ్గు ఒకటి. సాధారణ దగ్గు అయితే రెండు లేదా మూడు రోజుల్లోనే తగ్గిపోతుంది. లేదంటూ వారం రోజుల్లో పూర్తిగా తగ్గిపోతుంది. కానీ ఎన్ని రోజులు అయినా సరే.. దగ్గు తగ్గలేదంటే దాన్ని లంగ్ క్యాన్సర్‌గా అనుమానించాలి. ఈ లక్షణం ఎవరిలో అయినా ఉంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుల్ని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. మరికొందరిలో రక్తంతో కూడిన దగ్గు వస్తుంది. అప్పుడు వెంటనే చికిత్స తీసుకోవాలి.
లంగ్ క్యాన్సర్ ఉన్నవారికి ఊపిరి తీసుకోవడం చాలా కష్టతరమవుతుంది. ఛాతిలో నొప్పిగా ఉండటం, సడెన్‌గా బరువు తగ్గిపోవడం, ఆకలి లేకపోవడం, కంఠ స్వరంలో మార్పు, ఛాతిలో ఇన్‌ఫెక్షన్లు రావడం, చిన్నపనికే బాగా అలసిపోవడం, నీరసంగా ఉండడం.. వంటి లక్షణాలన్నీ లంగ్ క్యాన్సర్ ఉన్నవారిలో కనిపిస్తాయి. ఈ లక్షణాల్లో ఏవి ఉన్నాయని అనుకున్నా.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్య పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవాలి. దీంతో ప్రాణాలను కాపాడుకోవచ్చు.
నివారణ చర్యలు..
లంగ్ క్యాన్సర్‌కు ప్రధాన కారణం పొగతాగడం. ధూమపానం అలవాటు ఉన్న వారు దీన్ని మానుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అంతేకాదు, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవాలి. రోగనిరోధనక శక్తి పెరిగే ఆహారం తీసుకోవాలి. వాయు కాలుష్యం కూడా లంగ్ క్యాన్సర్‌కు కారణమవుతుంది. అందుకే బయటకు వెళ్లేటప్పుడు మాస్క్‌లు ధరించడం మంచిది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. శారీరక శ్రమ ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది.
ఇవి కూడా చదవండి :
Adulterated Milk : తూర్పుగోదావరి జిల్లాలో కల్తీ పాల కలకలం…నలుగురు మృతి
Supreme Court : కల్తీ నెయ్యి వివాదంలో సుప్రీంకోర్టులో ఏపీకి ఊరట!
