Sharukh Khan | ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దిగ్గజ రచయిత సలీం ఖాన్ను బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ శనివారం (ఫిబ్రవరి 21) రాత్రి పరామర్శించారు. వయోభారంతో పాటు ఆరోగ్య సమస్యల కారణంగా ఆసుపత్రిలో చేరిన సలీం ఖాన్‌ను చూసేందుకు షారుఖ్ స్వయంగా వెళ్లడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. షారుఖ్ ఖాన్ ఆసుపత్రి లోపలికి వెళ్తున్న దృశ్యాలు బయటకు రాకపోయినా, ఆయన కారు ఆసుపత్రి ప్రాంగణంలోకి వెళ్లడం, సుమారు గంటన్నర తర్వాత బయటకు రావడం వంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ సమయంలో సల్మాన్ ఖాన్ కూడా తన తండ్రి వద్దే ఉన్నట్లు సమాచారం.
మూడు దశాబ్దాలుగా షారుఖ్–సల్మాన్‌ల మధ్య ఉన్న స్నేహబంధం అందరికీ తెలిసిందే. తన కెరీర్ ప్రారంభ దశలో సలీం ఖాన్ మార్గదర్శకత్వం ఎంతో ప్రాధాన్యమైందని షారుఖ్ పలుసార్లు పేర్కొన్నారు.
ఆరోగ్య పరిస్థితి నిలకడగా
ఫిబ్రవరి 17న సలీం ఖాన్‌కు స్వల్ప మెదడు రక్తస్రావం (Brain Haemorrhage) కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.
“సలీం ఖాన్‌కు సర్జరీ అవసరం కాలేదు. చాలా స్వల్ప రక్తస్రావం మాత్రమే జరిగింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది” అని వైద్యుడు జలీల్ పార్కర్ వెల్లడించారు. ఇప్పటికే అమీర్ ఖాన్, జావేద్ అక్తర్ వంటి పలువురు సినీ ప్రముఖులు కూడా ఆయనను పరామర్శించారు.
భారతీయ సినిమాను మలిచిన రచయిత
సలీం ఖాన్ 1960లలో నటుడిగా కెరీర్ ప్రారంభించినప్పటికీ, 1970–80లలో రచయితగా బాలీవుడ్‌ను శాసించారు. సలీం–జావేద్ జంటగా జావేద్ అక్తర్తో కలిసి భారతీయ సినిమాకు కొత్త దిశను చూపించారు. షోలే, దీవార్, జంజీర్ వంటి ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్ చిత్రాలకు వీరి కథలు మూలస్తంభాలుగా నిలిచాయి. ‘యాంగ్రీ యంగ్ మ్యాన్’ యుగానికి శ్రీకారం చుట్టిన మేధావిగా సలీం ఖాన్‌కు భారతీయ చలనచిత్ర చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని సమాచారం. సినీ ప్రముఖులు, అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
