India Beat Bangladesh in Rain-Hit U19 World Cup Clash
విధాత క్రీడా విభాగం | హైదరాబాద్:
U19MCWC – IND vs BAN | బులావాయోలో జరిగిన ICC U-19 పురుషుల ప్రపంచ కప్ మ్యాచ్‌లో వర్షం ఆటను పలు మార్లు అడ్డుకున్నా, భారత యువజట్టు దూకుడులో ఏమాత్రం తగ్గలేదు. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ వైభవ్ సూర్యవంశీ, అభిజ్ఞాన్ కుందు నిలకడైన ఆటతో 238 పరుగుల స్కోరు సాధించింది. తదనంతరం, బంగ్లా డిఎల్ఎస్ పద్ధతిలో సవరించబడ్డ 165 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక 146 పరుగులకే పరిమితమైంది.
వైభవ్ రికార్డుల స్కోరు – కుందు నిలకడైన ఆటతీరు
రికార్డులు బద్దలు కొట్టడానికే పుట్టినట్లు 14 ఏళ్ల చిచ్చరపడుగు వైభవ్ సూర్యవంశీ 67 బంతుల్లో 72 పరుగులు చేసి మరో కొత్త చరిత్ర లిఖించాడు. U19 వరల్డ్ కప్ చరిత్రలో అర్థ సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడుగా రికార్డులకెక్కడంతోపాటు, యువ ODIల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో విరాట్ కోహ్లీని కూడా అధిగమించాడు. మరోవైపు 17 ఏళ్ల వికెట్‌కీపర్–బాటర్ అభిజ్ఞాన్ కుందు 80 పరుగులతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. ఈ ఇద్దరి ఇన్నింగ్స్ సహకారంతో భారత్ 238 పరుగుల మంచి స్కోరు నమోదు చేసింది. బంగ్లాదేశ్ బౌలింగ్‌లో అల్ ఫహాద్ ఐదు వికెట్లు తీసి భారత బ్యాటింగ్‌ను దెబ్బతీసాడు.
DLSతో 165 పరుగులకు మారిన బంగ్లా లక్ష్యం
వర్షం అంతరాయం కారణంగా లక్ష్యం మారి బంగ్లాదేశ్ 29 ఓవర్లలో 165 పరుగులు చేధించాల్సి వచ్చింది. మ్యాచ్ చివరి దశలో బంగ్లాదేశ్ ప్రతిఘటన చూపడంతో పోరు మరింత ఉత్కంఠభరితంగా మారింది. కానీ, భారత బౌలర్లు చివరి ఓవర్లలో బంగ్లాపై ఒత్తిడి పెంచి, వికెట్లను నేలకూల్చడంతో యువభారత్ విజయం ఖరారైంది. ఈ మ్యాచ్‌లో మరో ఆసక్తికర విషయమేమింటే, టాస్ సమయంలో భారత–బంగ్లా కెప్టెన్లు ఒకరితో ఒకరు చేతులు కలపకపోవడం. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న మారణకాండకు నిరసనగా భారత జట్టు ఈ చర్య తీసుకుంది.
కాగా, బంగ్లా బ్యాటింగ్‌లో టాప్ఆర్డర్ కాస్తా బాగానే ఆడినా, మిడిల్, లోయర్ ఆర్డర్ బ్యాటర్లు తేలిపోవడంతో లక్ష్యచేధన కష్టమైంది. చివరి ఓవర్లో 19 పరుగుల అవసరం కాగా, బంగ్లా పరుగులేమీ చేయకుండానే అదే స్కోరుపై ఆలౌట్ అయింది. కీలక సమయంలో వైభవ్ ఫీల్డింగ్‌లో కూడా మెరిసి అద్భుతమైన క్యాచ్‌తో మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. కెప్టెన్ అజీజుల్ హకీమ్, రిఫత్ బేగ్(37) మాత్రమే పోరాడి మ్యాచ్‌ను ఉత్కంఠగా మార్చారు. కానీ అర్థసెంచరీ సాధించిన హకీమ్(51), ఖిలన్ పటేల్ బౌలింగ్‌లో ఔట్ కాగానే మిగతావారందరూ ఒత్తిడిని అధిగమించలేక అలా వచ్చి ఇలా వెళ్లారు. విహాన్ మల్హోత్రా బంతితో వీరవిహారం చేసి, 4 వికెట్లతో పాటు, రెండు మెరుపు క్యాచ్‌లు అందుకుని, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
సంక్షిప్త స్కోర్లు:
భారత్: 48.4 ఓవరల్లో 238 పరుగులు ఆలౌట్ – వైభవ్ సూర్యవంశీ 72(67 బంతులు, 3 సిక్స్‌లు, 6 ఫోర్లు), అభిజ్ఞన్ కుందు 80(112 బంతులు, 3 సిక్స్‌లు, 4 ఫోర్లు), అల్ ఫహద్ 38 పరుగులకు 5 వికెట్లు
బంగ్లాదేశ్: (సవరించిన లక్ష్యం 29 ఓవర్లో 165 పరుగులు) – 28.3 ఓవర్లలో 146 పరుగులు ఆలౌట్ – అజీజుల్ హకీమ్ 51, రిఫత్ బేగ్ 37 పరుగులు, విహాన్ మల్హోత్రా 14 పరుగులకు 4 వికెట్లు
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ : విహాన్ మల్హోత్రా – 4 వికెట్లు, 2 క్యాచ్‌లు
