అధికార అహంతోనే కవిత వ్యాఖ్యలు: మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి

బీఆరెస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అధికార దురహంకారంతోనే రాహుల్ గాంధీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఖండించారు

విధాత ప్రతినిధి,నిజామాబాద్‌: బీఆరెస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అధికార దురహంకారంతోనే రాహుల్ గాంధీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఖండించారు. నిజామాబాదు జిల్లా కాంగ్రెస్ భవన్ లో గురువారం వారు విలేకరులతో మాట్లాడారు. కవిత తన స్థాయిని మించి మాట్లాడుతున్నారని, రాహుల్ గాంధీని పొలిటికల్ టూరిస్ట్ అనడం సిగ్గుచేటన్నారు. దేశం కోసం వారి కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని గుర్తు చేశారు. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని పట్టుకొని నోటికి వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణ కోసం మీ కుటుంబంలో ఎంత మంది జైలుకు వెళ్లారని, ఎంతమంది ప్రాణాలర్పించారని ప్రశ్నించారు.

దేశం కోసం ప్రాణాలర్పించిన కుటుంబం రాహుల్ గాంధీది అయితే, తెలంగాణ ఉద్యమంతో దొంగదీక్ష చేసిన చరిత్ర కేసీఆర్ ది అని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో బీఆరెస్‌ కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లాకు బీఆరెస్‌ హయాంలో జరిగిన అభివృద్ధి శూన్యమని, గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి మాత్రమేనని తెలిపారు. ప్రాజెక్టుల రిడీజనింగ్ పేరుతో బడ్జెట్ ను పెంచి, అందులో కమీషన్‌ దండుకొని లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.అదే డబ్బును ఇప్పుడు ఎన్నికల్లో విచ్చల విడిగా ఖర్చుపెట్టి గెలవాలని ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని దృఢ నిశ్చయంతో ఉన్నారని అన్నారు. రాహుల్ గాంధీ విజయ భేరి యాత్రలో తెలంగాణ రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం దోపిడీ చేస్తున్న తీరును ఎండగట్టడంతో పాటు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా ఏ విధంగా అన్యాయం చేసిందో ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.రానున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో సరికొత్త తెలంగాణ ఎలా ఆవిష్కృతం కాబోతుందో ఈ యాత్ర ద్వారా తెలియజేస్తారని అన్నారు. రాహుల్ గాంధీ పర్యటనతో జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ హస్తగతం చేసుకోవడం ఖాయం అని ధీమా వ్యక్తంచేశారు.

రాహుల్ గాంధీ విజయభేరి బస్సు యాత్రలో భాగంగా జిల్లాలోని కమ్మర్పల్లి నుండి మోర్తాడ్ బస్ స్టాండ్ వద్ద కార్నర్ మీటింగ్ నిర్వహించి, ఆ తర్వాత ఆర్మూర్ చేరుకొని కార్నర్ మీటింగ్‌ లో పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. నిజామాబాద్ అర్బన్ ప్రాంతంలో అనివార్య కారణాలవల్ల రాహుల్‌ పర్యటన రద్దయిందని అన్నారు.