Venkaiah Naidu : ఉచిత పథకాలు పరిధులు దాటుతున్నాయి

ప్రభుత్వాల ఉచిత పథకాలు పరిధులు దాటుతున్నాయని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు విమర్శించారు. పార్టీ మారిన ప్రజాప్రతినిధులు పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Venkaiah Naidu

అమరావతి: ప్రభుత్వాల ఉచిత పథకాలు పరిధులు దాటుతున్నాయని..మహిళలకు ఉచిత బస్సు వల్ల ప్రయోజనం ఏంటి? అని మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలు తాహతుకు మించి అప్పులు చేస్తున్నాయని..ప్రభుత్వాలు అప్పులు తెచ్చేటప్పుడు వాటిని ఎలా తీరుస్తారన్న ప్రణాళికలపై అసెంబ్లీలో చర్చించాలని ఆయన కోరారు. ఐదేళ్లలో ఎంత అప్పు చేస్తున్నారు? తిరిగి ఎంత చెల్లిస్తున్నారు? అనే వివరాలను ఆర్థిక శ్వేత పత్రం రూపంలో ప్రజలకు వెల్లడించాల్సిన అవసరముందన్నారు. ప్రభుత్వాలు విద్య, వైద్యంపై ఖర్చు చేయాలి కానీ.. ఉచితాలు అలవాటు చేయకూడదని సూచించారు. విద్యతో పేదోడు సంపన్నుడయ్యే ఛాన్స్ ఉందని, వైద్యం ప్రతి ఒక్కరికీ అవసరమని వ్యాఖ్యానించారు.

పార్టీ మారితే పదవికి రాజీనామా చేయాలి

ప్రజాప్రతినిధులు పార్టీ మారితే.. ఆ పార్టీ ద్వారా పొందిన పదవికి రాజీనామా చేయాలని వెంకయ్యనాయుడు తెలిపారు. రాజ్యాంగంలో 10వ షెడ్యూల్‌ని సవరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పార్టీ మారి మంత్రులు అవుతున్నారని విమర్శించారు. చట్టానికి అతీతంగా ఎవరూ వ్యవహారించకూడదని సూచించారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ మన దేశంలోనే ఉందని గుర్తుచేశారు. మనదేశ కీర్తిని ప్రతి ఒక్కరూ చాటాలని పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధుల క్రిమినల్ కేసులుపై రెండేళ్లలోపే విచారణ జరగాలని చెప్పారు. ప్రభుత్వాలు కోర్టుల సంఖ్యలు పెంచి, జడ్జీలని నియమించాలని కోరారు. రాజకీయ వారసత్వానికి తాను వ్యతిరేకమని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. చట్టసభల్లో కుటుంబ సభ్యులని దూషించడం సరికాదని వెంకయ్యనాయుడు హితవు పలికారు. అలాంటి వారిపై చట్టాన్ని ప్రయోగించి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌పై జరిగిన దాడి యత్నాన్ని వెంకయ్య నాయుడు ఖండించారు. దాడికి ప్రయత్నం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇది ఛీఫ్ జస్టిస్‌కి సంబంధించిన అంశం కాదు, సమాజానికి, వ్యవస్థకి సంబంధించిన విషయమని పేర్కొన్నారు.