Site icon vidhaatha

వెంకయ్య పుస్తకాలు మార్గదర్శకాలు పుస్తకావిష్కరణలో … ప్రధాని మోదీ

విధాత , హైదరాబాద్ : మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జీవితంపై రూపొందించిన పుస్తకాలు ప్రజలకు ప్రేరణగా, మార్గదర్శకాలుగా నిలుస్తాయని ప్రధాని మోదీ అన్నారు. వెంకయ్యనాయుడి పుట్టిన రోజు సందర్భంగా ఆయన జీవిత ప్రస్థానంపై రూపొందించిన మూడు పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని హైదరాబాద్ గచ్చిబౌలీలోని అన్వయ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించారు. ప్రధాని మోదీ వర్చువల్‌గా ఆ పుస్తకాలను ఆవిష్కరించారు. వర్చువల్గా ప్రధాని విడుదల చేశారు. సేవలో వెంకయ్యనాయుడు జీవితం’, 13వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు లక్ష్యం, సందేశం’, ‘మహానేత వెంకయ్యనాయుడు జీవితం, ప్రయాణం’ అనే పుస్తకాలను మోదీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఆదివారం గ్రామీణం ప్రాంతం నుంచి ఉప రాష్ట్రపతిగా ఉన్నత స్థానానికి ఎదిగిన వెంకయ్య జీవితం ఆదర్శనీయమన్నారు. వెంకయ్యనాయుడితో సుదీర్ఘకాలం పనిచేసే అవకాశం నాకు దక్కిందని, వేలాది కార్యకర్తలు ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నారని గుర్తు చేశారు. ఎమర్జన్సీకి వ్యతిరేకంగా పోరాడిన వెంకయ్య 17 నెలల జైలు జీవితం గడిపారని, గ్రామీణ, పట్టణాభివృద్ధి శాఖలో కేంద్ర మంత్రిగా వెంకయ్యనాయుడు తనదైన ముద్ర వేశారని కొనియాడారు. స్వచ్ఛభారత్, అమృత్ యోజన వంటి ఎన్నో పథకాలు సమర్థంగా అమలు చేశారని, ఆయన వాగ్దాటి ముందు ఎవరూ నిలవలేరని, రాజ్యసభ చైర్మన్ గా సభను సజావుగా నడిపారని, ఆయన సేవలను దేశం మరవదని పేర్కోన్నారు. ఆర్టికల్ 370 రద్దు బిల్లు ఆమోదంలో వెంకయ్య పాత్ర కీలకమని, దీర్ఘకాలం ఆయన ఆరోగ్యంగా ఉండి మార్గనిర్దేశం చేయాలని ప్రధాని మోదీ అన్నారు.

మాతృభాష తర్వాతే ఏ భాషయైనా : వెంకయ్యనాయుడు

ప్రాంతీయ భాషల్లోనే ప్రభుత్వ ఆదేశాలు ఉండాలని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. తాను ఆంగ్ల భాషకు వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాలన్నీ భారతీయ భాషల్లో ఉండాలని చెప్పారు. ఆ తర్వాతే ఆంగ్ల భాషలో ఉండాలని కోరారు. మాతృభాష, సోదర భాష తర్వాతే ఇతర భాషలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మాతృభాషలను కేంద్రప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, అది చాలా గొప్ప విషయమని వెంకయ్యనాయుడు కొనియాడారు. దేశ ప్రజలకు ప్రధాని అందిస్తున్న సేవలు కొనసాగించాలని వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ ఫార్మ్‌ నినాదంతో ఆయన ముందుకెళ్తున్నారని చెప్పారు. అవసరం ఉన్నంత వరకు ఉచిత రేషన్ పథకంతో పాటు యువతకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను కొనసాగించాలని కోరారు. చట్ట సభలకు ఎంపికైన వారు హుందాగా ప్రవర్తించాలని వెంకయ్య హితవు పలికారు. సిద్ధాంతం నచ్చకపోతే నాయకులు పార్టీ మారవచ్చునని, పార్టీ ద్వారా వచ్చిన పదవిని వదిలి వెళ్లాలని, కార్యకర్తలకు నేతలు నియమావళి రూపొందించాలన్నారు. రాజకీయాల్లో జవాబుదారీతనం తీసుకురావడానికి ప్రయత్నించాలని, రాజకీయాల్లో కులం, ధనం ప్రభావం తగ్గిపోవాలని అన్నారు. గుణం చూసి నాయకులకు ఓటు వేయాలని, మార్పు రాకపోతే ప్రజాస్వామ్యం బలహీనపడుతుందన్నారు. దేశ ప్రతిష్టను నిలబెట్టాలంటే చెడు పోకడలను అడ్డుకోవాలి” అని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.

Exit mobile version