Bhoomi Ratna Award | భూమి సునీల్‌కు ‘భూమి రత్న’ పుర‌స్కారం..రైతుల భూ హక్కుల కోసం చేసిన విశిష్ట సేవలకు గౌర‌వం

ప్ర‌ఖ్యాత భూమి హ‌క్కుల సంస్క‌ర్త‌, న్యాయ‌ నిపుణులు, రైతు న్యాయవాది ఎం.సునీల్ కుమార్‌(భూమి సునీల్‌)కు ‘భూమి రత్న’ పుర‌స్కారం ల‌భించింది. రైతుల భూమి హ‌క్కులు, గ్రామీణ ప్రాంతాల్లో న్యాయ సాధికార‌త‌కు గానూ ఆయ‌న అందించే విస్తృత సేవ‌ల‌కు ఈ గౌర‌వం దక్కింది

విధాత, హైదరాబాద్ :

ప్ర‌ఖ్యాత భూమి హ‌క్కుల సంస్క‌ర్త‌, న్యాయ‌ నిపుణులు, రైతు న్యాయవాది ఎం.సునీల్ కుమార్‌(భూమి సునీల్‌)కు ‘భూమి రత్న’ పుర‌స్కారం ల‌భించింది. రైతుల భూమి హ‌క్కులు, గ్రామీణ ప్రాంతాల్లో న్యాయ సాధికార‌త‌కు గానూ ఆయ‌న అందించే విస్తృత సేవ‌ల‌కు ఈ గౌర‌వం దక్కింది. హైదరాబాద్‌లో రైతునేస్తం, శ్రీ ముప్పవరపు ఫౌండేషన్ సంయుక్తంగా ఆదివారం (26వ తేది) నాడు హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ఈ ప్రతిష్టాత్మక అవార్డుతో భూమి సునీల్ ను సత్కరించారు. నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడైన సునీల్ కుమార్ గత ఇరవై ఏళ్లుగా భూసంస్కరణలు, గ్రామీణ చట్టపరమైన సాధికారత, వ్యవసాయ చట్టాలు, విధానాల రూపకల్పనలో విశేష సేవలందిస్తూ వస్తున్నారు.

ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ‌( SERP)లో రాష్ట్ర లీగల్ కో-ఆర్డినేటర్‌గా పని చేసిన సమయంలో ఆయన నేతృత్వంలో అమలు చేసిన కమ్యూనిటీ పారా లీగల్ ప్రోగ్రాం ద్వారా 10 లక్షలకు పైగా గ్రామీణ కుటుంబాలు తమ భూములపై హక్కులు పొందగలిగాయి. రూరల్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్ (RDI) డైరెక్టర్‌గా పనిచేసినప్పుడు, రైతులకు న్యాయ అవగాహన పెంపొందించడం, భూమి పరిపాలనా వ్యవస్థల బలోపేతం, భూసంస్కరణ విధానాల రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారు. నీతి ఆయోగ్ ల్యాండ్ లీజింగ్ నిపుణుల కమిటీ, భారత ప్రభుత్వ ల్యాండ్ టాస్క్ ఫోర్స్, పలు రాష్ట్ర స్థాయి భూసంస్కరణ కమిటీలలో సభ్యుడిగా కూడా సునీల్‌కుమార్‌ సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ధరణి కమిటీ‌’లో సభ్యుడిగా ఉన్నప్పుడు భూ పరిపాలన మెరుగుదలకు ఆయన చేసిన సూచనలు, అలాగే భూభారతి చట్టం రూపకల్పనలో ఆయ‌న చేసిన పాత్ర విశేషంగా నిలిచాయి.

ప్రస్తుతం భూమి సునిల్ తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడిగా, అలాగే 2018లో తాను స్థాపించిన లీగల్ ఎంప‌వ‌ర్‌మెంట్‌ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ సొసైటీ (LEAFS) అధ్యక్షుడుగా పని చేస్తున్నారు. LEAFS ద్వారా నిర్వహిస్తున్న న్యాయగంట, భూ న్యాయ శిబిరాలు, సాగు న్యాయ యాత్ర వంటి కార్యక్రమాలు రైతులకు ఉచిత న్యాయ‌ సహాయాన్ని అందిస్తున్నాయి. ఈ సంస్థ తెలంగాణ గ్రామాల లో అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ ల కీలక భూమిక పోషించింది. నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో అనుబంధ ఆచార్యులు, సలహాదారుడిగా కూడా సునీల్‌కుమార్ సేవలందిస్తున్నారు. ఇదే కాకుండా MCHRDI, APHRDI, TAPARD, న్యాయ, పోలీసు అకాడమీలలో రిసోర్స్ ప‌ర్స‌న్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. రైతుల భూమి హక్కులపై అవగాహన పెంచడానికి ఆయన ‘భూమికోసం’, ‘మీ భూమి.. మీ హక్కు’ వంటి టెలివిజన్, డిజిటల్ కార్యక్రమాలు, భూమికోసం , సాగున్యాయం వంటి యూట్యూబ్ ఛానళ్ల ద్వారా చట్టాల‌పై అవగాహన క‌ల్పిస్తున్నారు.