Telangana farmers land law awareness | హైదరాబాద్, ఆగస్ట్ 13 (విధాత): భూమిని సాగు చేసే రైతులకు, భూమి చట్టం, విత్తన చట్టం గురించి తెలిసినప్పుడే వారి సమస్యలపై అధికారుల వద్దకు వెళ్లి పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుందని వ్యవసాయ కమిషన్ సభ్యుడు, ప్రముఖ న్యాయవాది భూమి సునీల్ చెప్పారు. చట్టం తెలిస్తే అది మనకు చుట్టంగా మారుతుందన్నారు. బుధవారం మెదక్ జిల్లాలో రైతులకు భూ బారతి చట్టంతో పాటు, విత్తన చట్టంపై అవగాహన కలిగించడం, రైతుల సమస్యలు తెలుసుకొని వాటికి పరిష్కార మార్గాలు చూపడం కోసం లీఫ్స్ సంస్థ ఆధ్వర్యంలో న్యాయవాదుల బృందం సాగు న్యాయయాత్ర చేపట్టింది. ఉదయం 8 గంటలకు నర్సాపూర్ రైతు వేదిక వద్ద మొదలైన ఈ యాత్ర కౌడిపల్లి, కుల్చారం, శంకరం పేట(ఆర్)ల మీదుగా సాగి.. సాయంత్రం చేగుంటలో ముగిసింది. మార్గమధ్యంలో పొలాల్లో పని చేస్తున్న రైతుల వద్దకు వెళ్లి వాళ్ల భూమి సమస్యలను న్యాయవాదుల బృందం అడిగి తెలుసుకున్నది.
రైతు వేదికల వద్దకు వందల సంఖ్యలో వచ్చిన రైతులు తమ భూముల సమస్యలను సునీల్‌కు వివరించారు. వాటిని పరిశీలించిన సునీల్ మాట్లాడుతూ ఆయా సమస్యలకు పరిష్కార మార్గాలను తెలియజేశారు. అలాగే స్థానిక ఎమ్మార్వో కార్యాలయాలకు వెళ్లి రైతుల సదస్సులలో వచ్చిన దరఖాస్తులు, వాటి స్టేటస్ అడిగి తెలుసుకున్నారు. మెదక్ జిల్లాలో పట్టాలున్న భూములను అటవీ అధికారులు వచ్చి ఇవి అటవీ భూములని తమను సేద్యం చేయకుండా అడ్డుకుంటున్నారని రైతులు వివరించారు. అసైన్ భూములను వారసులకు మ్యుటేషన్ చేయడం లేదని, పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇవ్వడం లేదని రైతులు సునీల్‌కు వివరించారు.
రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా అటవీ- రెవెన్యూ భూముల మధ్య సరిహద్దు సమస్యలున్నాయని, వాటిని జాయింట్ సర్వే ద్వారా పరిష్కరించవచ్చునని భూమి సునీల్ రైతులకు తెలిపారు. అనేక సందర్భాలలో రెవెన్యూ భూములను అటవీ శాఖకు ప్రభుత్వం అప్పగిస్తుందని, అలాంటి సందర్భంలో రెవెన్యూ శాఖ నుంచి తీసుకునే భూముల విషయంలో అటవీశాఖ మొదట ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేస్తుందని చెప్పారు. ఆ తరువాత జాయింట్ సర్వే నిర్వహించి, విచారణ అనంతరం తుది నోటిఫికేషన్ విడుదల చేసి ఆ భూములను అటవీశాఖ స్వాధీనం చేసుకుంటుందన్నారు. అయితే ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత ఎలాంటి ఫైనల్ నోటిఫికేషన్ లేకుండా అలానే వదిలేస్తున్నారని, దీంతో రెవెన్యూ వాళ్లు ఈ భూములను తమ భూములుగానే భావించి రైతులకు అసైన్ చేస్తున్నారని చెప్పారు. ఆ తరువాత అటవీ శాఖ అధికారులు వచ్చి ఇవి తమ భూములని అంటున్నారని, ఇలాంటి సమస్య ఉన్న చోట్ల ఆర్డీఓతో పాటు అటవీశాఖ అధికారులతో కలిపి జాయింట్ సర్వే చేసి సమస్యను పరిష్కరించాల్సి ఉంటుందన్నారు. ఈ విషయాన్ని అగ్రికల్చర్ కమిషన్ సభ్యులుగా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతానని రైతులకు సునీల్ హామీ ఇచ్చారు.
కొంత మంది రైతులు వారసత్వ భూములు మ్యూటేషన్ చేయడం లేదని, కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇవ్వడం లేదని అగ్రికల్చర్ కమిషన్ దృష్టికి తీసుకు వచ్చారు. ఈ విషయంపై స్పందించిన ఆయన.. భూ భారతి చట్టం-2025 ద్వారా సెక్షన్ 6 రూల్ 4 ప్రకారం దరఖాస్తు చేసుకొని పట్టాదార్ పాస్ పుస్తకం పొందవచ్చనని వివరించారు. ధరణిలో అలాంటి అవకాశం లేదని, కొత్త భూ భారతి చట్టంలో ప్రతి సమస్యను పరిష్కరించే అవకాశం ఉందని స్పష్టంచేశారు. ఈ మేరకు దరఖాస్తు చేసుకుంటే అధికారులు పరిశీలించి, అవసరమైతే ఫీల్డ్ విజిట్ చేసి పరిష్కరిస్తారని తెలిపారు. కొత్త చట్టంలో భూమి రిజిస్ట్రేషన్ చేసే సమయంలోనే సర్వే నిర్వహించి భూమికి మ్యాపింగ్ చేసిన తరువాతనే రిజిస్ట్రేషన్ చేస్తారని, దీని ద్వారా హద్దుల సమస్యలు సమసి పోతాయని చెప్పారు.
లైసెన్స్డ్ సర్వేయర్లు
రాష్ట్రంలో సర్వేయర్ల కొరత తీర్చడానికి లైసెన్డ్స్ సర్వేయర్లు వస్తున్నారని సునీల్ తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం ఆరు వేల మందికి సర్వేలో శిక్షణ ఇస్తుందన్నారు. భూ భారతి చట్టం అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుందని, దీనిని మీరు ఎంతగా తెలుసుకుంటే అంత మంచిదన్నారు. కల్తీ విత్తనాలు రైతులకు అమ్మిన కంపెనీల నుంచి భారీ ఎత్తున నష్టపరిహారం పొందే అవకాశం ఉందని రైతులకు ఈ సందర్భంగా సునీల్ వివరించారు. కాకపోతే కొనుగోలు చేసిన సమయంలో విత్తన కంపెనీల రశీదులు మన వద్ద జాగ్రత్తగా దాచి పెట్టుకోవాలని, అలాగే కొన్ని విత్తనాలను కూడా తీసి పక్కన పెట్టుకోవాలన్నారు. ఇవన్నీ విత్తన కంపెనీలు మనల్ని మోసం చేయడానికి వీలు లేకుండా సాక్ష్యాలుగా ఉంటాయని రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో భూదాన్ బోర్డు మాజీ చైర్మన్ గున్న రాజేందర్ రెడ్డి , రైతు కమిషన్ చైర్మన్ ఓఎస్టీ హరి వెంకట ప్రసాద్, లీఫ్స్ సంస్థ న్యాయవాదులు, ప్రతినిధులు అభిలాష్, జీవన్, మల్లేశ్, ప్రవీణ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.