విధాత, అమరావతి :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహిళలకు ఉచిత బస్సు వల్ల ప్రయోజనం ఏంటని ఆయన ప్రశ్నించారు. విద్య, వైద్యంపై ఖర్చు చేయాలి కానీ..ఉచితాలు అలవాటు చేయకూడదంటూ తెలిపారు. బుధవారం నెల్లూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రభుత్వాలు విద్యా, వైద్యంపై ఖర్చు చేయాలి. అంతేకానీ, ఉచితాలు అలవాటు చేయకూడదు. విద్య వల్లపేదవాడు సంపన్నుడయ్యే అవకాశాలు ఉన్నాయి. వైద్యం ప్రతి మనిషికి అవసరమైనది. ఆర్థిక పరిస్థితిని శ్వేతపత్రం రూపంలో ప్రజలకు తెలపాల్సిన అవసరం ఉన్నది. ఐదేళ్లలో అప్పులు ఎంత చేస్తున్నారు…ఎంత తిరిగి చెల్లిస్తున్నారన్నది ప్రకటించాలి. సభలో లేనివారి పట్ల అమర్యాదగా వ్యవహరించకూడదు’ అని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు.
శాసన సభలో బూతుల సాంప్రదాయానికి తెర వేయాలని సూచించారు. సభలో లేని వారి పట్ల అమర్యాదగా వ్యవహరించకూడదన్నారు. అలాంటి వ్యాఖ్యలు చేసే వారిని సస్పెండ్ చేయాలని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు సభలో ఎలా నడుచుకోవాలో ట్రైనింగ్ ఇవ్వాలని కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపునకు పాల్పడితే చర్యలు తీసుకోవాలన్నారు. న్యాయస్థానాలు ప్రజా ప్రతినిధులపై కేసులను రెండు సంవత్సరాల్లో తీర్పులు వెలువరించాలన్నారు. కోర్టులు తక్కువైతే, జడ్జీలు తక్కువ సంఖ్యలో ఉంటే వెంటనే ఆ సమస్యను పరిష్కరించుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు.
