Agri Legal Aid Clinic । పోతన హలం దున్నిన నేలపై హాలికుల కోసం న్యాయ సహాయ కేంద్రం

బమ్మెరలో ‘అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్’ సేవలు దేశంలోనే మొదటి సారి నల్సార్‌, లీఫ్స్‌ల కృషితో రైతుల దరికి ఉచిత న్యాయ సేవలు విధాత: రైతుల వద్దకే న్యాయవాదులు వెళుతున్నారు. చట్టాలపై అవగాహన లేని రైతుల వద్దకే వెళ్లి ఉచితంగా న్యాయ సహాయం అందించడానికి నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయం(NALSAR University of Law), లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ సొసైటీ (లీఫ్స్) (Legal Empowerment and Assistance for Farmers Society (LEAFS) సంస్థలు […]

  • Publish Date - March 17, 2023 / 01:31 PM IST

  • బమ్మెరలో ‘అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్’ సేవలు
  • దేశంలోనే మొదటి సారి
  • నల్సార్‌, లీఫ్స్‌ల కృషితో రైతుల దరికి ఉచిత న్యాయ సేవలు

విధాత: రైతుల వద్దకే న్యాయవాదులు వెళుతున్నారు. చట్టాలపై అవగాహన లేని రైతుల వద్దకే వెళ్లి ఉచితంగా న్యాయ సహాయం అందించడానికి నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయం(NALSAR University of Law), లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ సొసైటీ (లీఫ్స్) (Legal Empowerment and Assistance for Farmers Society (LEAFS) సంస్థలు సంయుక్తంగా ‘అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్’ (Agri Legal Aid Clinic) లను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. ఇందులో మొదటి ప్రయత్నంగా శనివారం ప్రఖ్యాత కవి పోతనా మాత్యుడి స్వగ్రామం బమ్మెర (Bammera) లో ‘అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్’ను ప్రారంభిస్తున్నారు. ఈ క్లినిక్‌ను సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీ రామసుబ్రమణ్యన్ ప్రారంభిస్తారు.

ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ పి.వి.సంజయ కుమార్ , తెలంగాణ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయసేవల అథారిటీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్ జస్టిస్ పి. నవీన్ రావు పాల్గొంటారని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్ డాక్టర్ పి. శ్రీకృష్ణదేవ రావు, లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ సొసైటీ (లీఫ్స్) అధ్యక్షులు ఎం సునీల్ కుమార్ సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు.

వ్యవసాయ సంబంధిత సమస్యలపై ఉచిత న్యాయ సలహాలు

రైతులకు వ్యవసాయ సంబంధిత సమస్యలపై ఉచిత న్యాయ సలహాలు, న్యాయ సహాయం అందించడం కోసం ఈ క్లినిక్ పనిచేస్తుంది. ఇలాంటి క్లినిక్‌ ఏర్పాటు చెయ్యడం దేశంలోనే ఇది మొదటి సారి. దుక్కి దున్నే నాటి నుండి పండించిన పంటను మార్కెట్లో అమ్మేదాకా రైతులు ఎదుర్కునే సమస్యలు ఎన్నో ఉన్నాయి. రైతుల మేలుకోసం ప్రభుత్వం పలు చట్టాలు చేసింది. ఆ చట్టాలు తెలిసి ఉండి, వాటిని వినియోగించుకోగలిగితేనే ఏరువాక సాఫీగా సాగుతుంది.

భూమి సమస్యలు ఉత్పన్నమైనపుడు, నాణ్యతలేని విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల వల్ల నష్టం వాటిల్లినప్పుడు, మార్కెట్ మోసాలు జరిగినప్పుడు, పంటల బీమా అందనప్పుడు ఇలా పలు సందర్భాలలో చట్టంతో రైతులకు అవసరం ఏర్పడుతుంది. ఈ సమస్యల పరిష్కారానికి అధికారులను ఆశ్రయించాల్సి వచ్చినప్పుడు, కోర్టులకు వెళ్లాల్సి వచ్చినపుడు న్యాయ సేవలను పొందడం అవసరం.

కానీ చట్టాలపై అవగాహన లేక, న్యాయ సహాయం అందక రైతులు వారికి మేలు చేసే చట్టలున్నా లబ్ధి పొందలేక పోతున్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి తగు న్యాయ సేవలు అందించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ నేపథ్యంలో మొదటి ప్రయత్నంగా శనివారం బమ్మెర గ్రామంలో “అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్” ప్రారంభం కానున్నది.

Latest News