విధాత, నిజామాబాదు: కామారెడ్డి జిల్లా కేంద్రంలో రైతులు కదం తొక్కారు. కామారెడ్డి మున్సిపల్ రివైజ్డ్ మాస్టర్ ప్లాన్‌కు నిరసనగా వివిధ గ్రామాలకు చెందిన రైతులు దున్నపోతుతో ర్యాలీ నిర్వహించి, బిక్షాటన చేపట్టి నిరసన తెలిపారు. రైతులు భిక్షాటన చేసిన డబ్బులు, కూరగాయలు, ఇతర వస్తువులను మున్సిపల్ కార్యాలయం ఎదుట పడేశారు.
ఈ డబ్బులు లంచంగా తీసుకొని తమ భూములను ఆయా జోన్‌ల నుండి తొలగించాలని కోరారు. తమ బతుకులను నాశనం చేసే మాస్టర్ ప్లాన్‌ను వెంటనే రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఇండస్ట్రియల్ జోన్, గ్రీన్ జోన్, 100 అడుగుల రోడ్ పేరిట తమ భూములను లాక్కునే ప్రయత్నం విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
టేక్రియాల్, అడ్లూర్ ఎల్లారెడ్డి, ఇల్చిపూర్, లింగాపూర్, దేవునిపల్లి, అడ్లూర్ తదితర గ్రామాలకు చెందిన రైతులు కామారెడ్డి పట్టణంలోని కూరగాయల మార్కెట్ తో సహా కొత్త బస్టాండ్, నేషనల్ హైవే7, పాత బస్టాండ్, నిజాంసాగర్ చౌరస్తా, రైల్వే స్టేషన్, సుభాష్ రోడ్, గంజ్, ధర్మశాల, పంచముఖి హనుమాన్ ఆలయం పలు ప్రాంతాల్లో బిక్షాటన చేశారు.
అనంతరం మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని కమిషనర్‌కు భిక్షాటన చేయగా వచ్చిన డబ్బులు అప్పగించేందుకు ప్రయత్నించారు. కమిషనర్ రాకపోవడంతో మున్సిపల్ ప్రధాన ద్వారం ముందు కుప్పగా వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమ భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు ఎంతవరకైనా పోరాడుతామని స్పష్టం చేశారు.