విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: అసలే ఎన్నికల సమయం… ఆపై ముఖ్యమంత్రి బహిరంగ సభ అంటే జనం ఎట్లొస్తరో తెలిసిందే. సీఎం బహిరంగ సభకు అభ్యర్థి ఎన్ని తిప్పలైన పడి జన సమీకరణకు పూనుకోవాల్సిందే. దీనిలో భాగంగానే మంగళవారం హాలియాలో జరిగిన సీఎం బహిరంగ సభకు అవే స్థాయిలో జనాన్ని తరలించేందుకు ఎమ్మెల్యే అభ్యర్థి శతదా ప్రయత్నం చేశారు. కానీ తానొకటి తలిస్తే.. దైవమొకటి తలచిన చందంగా బహిరంగ సభకు జనం రాకుండానే సభ సమాప్తం కావడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యమంత్రి బహిరంగ సభ మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమవుతుందని, దానికి అనుగుణంగా జనాన్ని సమీకరించినందుకు పెద్దఎత్తున ప్రచారం చేశారు.
అయితే మన రాజకీయ నాయకులు సమయానికి ఎవరూ రారని గుర్తించిన ఓటరు మహాశయులు సభ 3 గంటలకు అయితే.. సభ అయిపోయాక కూడా జనం రావడం కనిపించింది. సమయానికే సభకు జనం వస్తారని ఆశించిన నాయకులకు పెద్దఎత్తున ఖాళీ కుర్చీలు దర్శనమివ్వడం ఆందోళనకు గురిచేసింది. అనుకున్న సమయానికంటే ముఖ్యమంత్రి 10 నిమిషాలు ముందుగానే వచ్చి 20 నిమిషాలు ప్రసంగించి మూడు గంటల 45 నిమిషాలకు సభను ముగించి వెళ్లారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో ప్రసంగించే సమయానికి జనం సభా ప్రాంగణంలోకి రాకపోవడం వల్ల జనం తక్కువగా వచ్చినట్లు గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కాసింత అసహనానికి గురైనట్లు సమాచారం. ముఖ్యమంత్రి సభ అయిపోయాక కూడా జనం సభా ప్రాంగణం వైపు వెళ్లడం కొసమెరుపు.