Heavy Rain | హైదరాబాద్ : ఆకాశానికి ఏమైనా చిల్లు పడిందా అన్నట్లు.. హైదరాబాద్ నగరంలో ఆదివారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. ఈ అతి భారీ వర్షం కారణంగా కేవలం నిమిషాల వ్యవధిలోనే రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. రహదారులన్నీ చెరువులను తలపించాయి. పలు చోట్ల రహదారులపై మోకాళ్ల లోతుకు పైగా వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనాలు ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పలు వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయినట్లు సమాచారం. మరో రెండు గంటల పాటు వాన దంచికొట్టే అవకాశం ఉన్నందున ప్రజలు నివాసాలకే పరిమితం కావాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పలు కాలనీవాసుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. వర్షపు నీరు ఇండ్లలోకి చేరుకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
షేక్‌పేట, మణికొండ, నార్సింగి, గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, రాయ్‌దుర్గ్, టోలీచౌకీ, మెహిదీపట్నం, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి, నాంపల్లి, అబిడ్స్, గోషామహల్, కూకట్‌పల్లి, అమీర్‌పేట్, సనత్‌నగర్, మాదాపూర్, హైటెక్‌సిటీ, బేగంపేట్, సికింద్రాబాద్, తార్నాక, రాంనగర్, నాచారం, అంబర్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీనగర్, హయత్‌నగర్, సంతోష్ నగర్, చార్మినార్, ఉప్పుగూడ, జియగూడతో పాటు తదితర ప్రాంతాల్లో వాన దంచికొట్టింది.
రాత్రి 8 గంటల వరకు అందించిన సమాచారం మేరకు మల్కాజిగిరి ఈస్ట్ ఆనంద్ బాగ్‌లో 5.53 సె.మీ, నేరెడ్‌మెట్‌లో 5, బండ్లగూడలో 4.75, మల్లాపూర్‌లో 4.2, నాచారంలో 4.13, ఉప్పల్ చిలుకానగర్‌లో 3.85 సె.మీ. వర్షపాతం నమోదైంది.