Heavy Rains | హైదరాబాద్ : ఈ వారం రోజుల పాటు తెలంగాణ( Telangana ) వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు( Heavy Rains ) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం( IMD Hyderabad ) ఒక ప్రకటనలో తెలిపింది. 26, 27 తేదీల్లో క్లౌడ్ బరస్ట్‌లతో( Cloudburst ) పలు చోట్ల అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
బంగాళాఖాతం( Bay of Bengal )లో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మ ల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. మిగతా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని వివరించింది.
సోమవారం హైదరాబాద్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, జనగామ, వరంగల్, కరీంనగర్, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినట్టు వెల్లడించింది. ముఖ్యంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సాయంత్రం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కొద్దిసేపటికే కురిసిన ఈ భారీ వర్షానికి రోడన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. రోడ్లపై మోకాళ్లల్లోతు వర్షపు నీళ్లు చేరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడి, కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
కాగా, గడిచిన 24గంటల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవగా, యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు -ఎంలో 14.26 సెం.మీ, ఆత్మకూరులో 9.71 సెం.మీ, మెదక్ జిల్లా అల్లాదుర్గ్‌లో 11.13 సెం.మీ, మహబూబాద్ జిల్లా పెద్దవంగరలో 9.59 సెం.మీ, జనగామ జిల్లా దేవరుప్పలలో 9.34 సెం.మీ, వికారాబాద్ జిల్లా కులకచర్లలో 8.94 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు వెల్లడించింది.
హైదరాబాద్ నగరంలో బంజారాహిల్స్‌లో అత్యధికంగా 10.3 సెం.మీ, శ్రీనగర్ కాలనీలో 9.7, ఖైరతాబాద్‌లో 8.33, వనస్థలిపురంలో 6.03 సెం.మీ. వర్షపాతం నమోదైంది.