Gopanpally | 40ఏళ్లుగా ఉంటున్న తమ గుడిసెలను అక్రమంగా కూల్చివేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1982 నుంచి ఇక్కడే ఉంటున్నామని తమకు ఈ స్థలంలో ప్రభుత్వం 60గజాల్లో ఇళ్లు కట్టించి..పట్టాలను అందించాలని వేడుకుంటున్నారు. బాధితుల వివరాల ప్రకారం..రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండల పరిధిలోని గోపన్‌పల్లి శివారు ప్రాంతంలో క్రషర్ పనుల కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కూలీలు 1982లో బసవతారకంనగర్ అనే పేరుతో బస్తీ ఏర్పాటు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో గతంలో వారికి ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీ కార్డులు కూడా కల్పించారు. వీరిలో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఉన్నారు.
కొన్ని నెలలుగా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఓ నాయకుడు తమను బెదిరిస్తున్నారని, వెళ్లకపోతే చంపేస్తామంటున్నారని బాధితులు చెబుతున్నారు. ఈ క్రమంలో భయబ్రాంతులకు గురిచేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. తిరిగి తమపైనే తప్పుడు కేసులు పెడుతున్నారని తెలిపారు. అలాగే, తమకు న్యాయం చేయాలని పోరాటం కొనసాగిస్తున్న కొందరు ప్రజానేతలపై కూడా పోలీసులు అక్రమ కేసులు పెడుతూ పోరాటాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
గతంలో హైకోర్టు, హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా తమకు అనుకూలంగా ఆర్డర్లు ఇచ్చాయని, గుడిసెలు తీయొద్దని అధికారులకు ఆదేశాలిచ్చారని బసవతాకంనగర్ బస్తీ వాసులు గుర్తు చేశారు. 2021 డిసెంబర్‌లో పోలీసులు వచ్చి జేసీబీలతో తమ గుడిసెలు కూల్చినప్పుడు ప్రతిపక్ష పార్టీలు తమకు అండగా నిలబడి పట్టాలు ఇచ్చే వరకు కూడా పోరాటం చేస్తామని హామినిచ్చారన్నారు. అప్పుడు వచ్చిన నాయకుల్లో ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉన్నారన్నారు. కానీ, ఇప్పుడు దౌర్జన్యంగా తమ గుడిసెలను కూల్చివేస్తే ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పూర్వీకుల సమాధులు కూడా అక్కడే ఉన్నాయని.. ఇక్కడి నుంచి వెళ్లే ప్రసక్తి లేదని 20 రోజులుగా టెంట్లు వేసుకుని బస్తీవాసులు పోరాటం చేస్తున్నారు.