సృష్టి టెస్టు ట్యూబ్ బేబీ సెంటర్ కేసు విచారణ
Hyderabad Sperm Bank | విధాత, హైదరాబాద్ : సృష్టి టెస్టు ట్యూబ్ బేబీ సెంటర్ అక్రమాలు బయటపడిన నేపథ్యంలో సికింద్రాబాద్‌లోనిఇండియన్ స్మెర్మ్ టెక్ సెంటర్ ను పోలీసులు సీజ్ చేశారు. మంగళవారం పోలీసులు ఇండియన్ స్పెర్మ్ టెక్‌లో తనిఖీలు చేపట్టారు. క్లూస్ టీమ్ సహాయంతో గోపాలపురం పోలీసులు ఆధారాలను సేకరించే ప్రక్రియ చేపట్టారు. అక్రమంగా పలువురి నుంచి సేకరించిన వీర్యకణాలకు సంబంధించిన మూడు డబ్బాలు, ఆధార్ కార్డులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహడు పంకజ్‌ను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఇండియన్ స్మెర్మ్ టెక్‌లో రోజువారీ కూలీలు, యాచకులు, పాదచారులకు కమీషన్ ఇచ్చి వీర్య కణాలు, అండాలను సేకరిస్తున్నారన్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి ఇప్పటికే ఏడుగురిని అరెస్టు చేశారు. క్లినిక్ యజమాని, మేనేజర్ గా వ్యవహరిస్తున్న పంకజ్ సోని తన వద్ద కొంతమందిని ఏజెంట్లుగా, టెక్నీషియన్లుగా నియమించుకున్నాడు. వారు.. బిచ్చగాళ్లకు, అడ్డాకూలీల వంటివారికి డబ్బు ఆశ చూపించి వారి నుంచి వీర్యం, అండాలను సేకరిస్తున్నారు. విద్యావంతులకు రూ.4వేల వరకు చెల్లించి వీర్యం సేకరణ చేస్తున్నారు. చదువురానివారికైతే.. బిర్యానీ పొట్లం, మందు బాటిల్ తో సరిపెడుతున్నారు. అండ దానం చేసే మహిళలకు 20-25 వేలు ఇస్తున్నారు.
ఆర్ట్ (అసిస్టెడ్ రీ ప్రొడక్టివ్ టెక్నాలజీ) నిబంధనల ప్రకారం ఆరోగ్యవంతులైన వ్యక్తుల నుంచి, అదీ 21 నుంచి 55 ఏళ్లలోపు ఉన్నవారి నుంచి.. వారికి అన్నిరకాల వైద్యపరీక్షలూ నిర్వహించి, ఎలాంటి జన్యువ్యాధులు, అంటువ్యాధులు లేవని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే వీర్యం సేకరించాలి. ఒక దాత నుంచి గరిష్ఠంగా 25సార్లు మాత్రమే వీర్యాన్ని సేకరించాలి. ఒక దాత నుంచి తీసుకున్న వీర్యాన్ని ఒక మహిళకు ఒకసారి గర్భధారణకు మాత్రమే ఉపయోగించాలి. కానీ.. స్పెర్మ్ క్లినిక్ ఈ నిబంధనలన్నింటినీ తోసిరాజని ఒకే వ్యక్తి నుంచి వారానికొకసారి చొప్పున వీర్యం సేకరిస్తున్నాయి.
మరోవైపు సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో డాక్టర్ నమ్రత సహా నిందితులు సికింద్రాబాద్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. 35 ఏళ్ల పాటు సుదీర్ఘ అనుభవం ఉన్న తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని పిటిషన్ లో నమ్రత పేర్కొన్నారు. నేరం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో అయితే తెలంగాణ పోలీసులు కేసులు ఎలా నమోదు చేసి అరెస్ట్ చేస్తారని పిటిషన్ లో డాక్టర్ నమ్రత ప్రశ్నించారు.