హైదరాబాద్: డిజిటల్ ఇండియా అని గొప్పలు చెప్పుకునే ఈ యుగంలో, దేశ ఐటీ రాజధానిగా పేరు గాంచిన హైదరాబాద్‌లో రెండు రోజులుగా ఇంటర్నెట్, టెలివిజన్ చీకట్లు అలుముకున్నాయి. కారణం ప్రభుత్వ మూర్ఖపు నిర్ణయం. తెలంగాణ స్టేట్ సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (TGSPDCL) సిబ్బంది విద్యుత్ స్తంభాలపై అమర్చిన ఫైబర్ లైన్లను విచక్షణారహితంగా కోసేయడంతో ఒక లక్షకు పైగా ఇంటర్నెట్ కనెక్షన్లు నిలిచిపోయాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులు పనులు ఆపివేసి కూర్చోవాల్సి వచ్చింది, IPTV ఆధారంగా పనిచేస్తున్న టెలివిజన్లు మూగబోయాయి. డిజిటల్ లావాదేవీలు జరపలేక వ్యాపారాలు ఆగిపోయాయి.
ప్రభుత్వం చెప్పిన కారణం రామంతాపూర్‌లో జరిగిన ఊరేగింపులో ఆరుగురు విద్యుత్ ప్రమాదంలో మృతి చెందడమే. ఈ దుర్ఘటన తర్వాత భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం అవసరం. కానీ దానికి పరిష్కారం ఇంటర్నెట్, కేబుల్ లైన్లను ఎడాపెడా కోసేయడం కాదు. సాంకేతిక అవగాహన లేకపోవడం, నిర్లక్ష్యం, అలోచనలేని చర్యలతో ప్రజల జీవన విధానమే స్తంభించిపోయింది.
ప్రజల జీవితంపై దెబ్బ
ఈ బ్లాక్ అవుట్ నగరంలో లక్షలాది మందిని గందరగోళంలో పడేసింది.
- వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఉద్యోగులు సమావేశాలు, ఆఫీసు పనులు చేయలేక ఇబ్బందులు పడ్డారు.
- డిజిటల్ పేమెంట్లు పూర్తిగా స్తంభించాయి. ఒక్క టీ కొనడానికి కూడా UPI విఫలమైంది.
- షాపులు, రెస్టారెంట్లు “క్యాష్ మాత్రమే” అంటూ బోర్డులు పెట్టాయి.
- POS మెషీన్లు పనిచేయకపోవడంతో కార్డులు స్వైప్ చేయడం ఆగిపోయింది.
ఇది కేవలం సాంకేతిక సమస్య కాదు – ప్రజల దైనందిన జీవితాన్ని ఒక్కసారిగా దెబ్బతీసిన ఆర్థిక అత్యయికస్థితి. చిన్న చిన్న వ్యాపారాల నుంచి పెద్ద స్టోర్ల వరకు అందరికీ నష్టమే వచ్చింది. కస్టమర్లు, షాపులు వాదనలతో పోట్లాడే పరిస్థితి వచ్చింది.
ప్రభుత్వ నిర్లక్ష్యం
ఈ స్థాయిలో సేవలు దెబ్బతిన్నా అధికారులు ఒక్క ప్రకటన కూడా విడుదల చేయలేదు. సమస్య పరిష్కారానికి ఎటువంటి టైమ్‌లైన్‌ను కూడా ప్రకటించలేదు. ఇది ప్రజలను మరింత ఆగ్రహానికి గురిచేసింది. “ప్రజలపై ఇంత నిర్లక్ష్యం చూపే ప్రభుత్వం ఇంకేం చేస్తుంది?” అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. ప్రజాసేవ చేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగం, ప్రజలే ఇబ్బందుల్లో పడేలా మూర్ఖపు నిర్ణయాలు తీసుకోవడం దురదృష్టకరం.
హైదరాబాద్ దేశంలోనే అతిపెద్ద ఐటీ కేంద్రం. ఇక్కడి నుంచి అంతర్జాతీయ కంపెనీలు పనిచేస్తున్నాయి. ఇలాంటి సమయంలో రెండు రోజుల పాటు ఇంటర్నెట్ నిలిచిపోవడం, “సాంకేతిక చీకట్లు” అలుముకోవడం నగర ప్రతిష్ఠను కూడా దెబ్బతీసింది. ప్రపంచానికి సాంకేతిక కేంద్రంగా పేరుగాంచిన ఈ నగరం, ప్రభుత్వ అవగాహన లేమితో “డిజిటల్ ఇండియా”కి వ్యతిరేక దిశలో వెళ్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రజలు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “ఇది డిజిటల్ డీటాక్స్ కాదు, మూర్ఖపు చర్య. కనీస అవగాహన లేకుండా అధికారుల తీరు అర్థరహితం” అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ISPలు కూడా కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. లైన్లు కోసిన తర్వాత “మీరు మళ్లీ రిపేర్ చేసుకోండి” అని చెప్పే అధికారుల నిర్లక్షపు సమాధానం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది.
కొద్దకాలం క్రితం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, తన బృందంతో బెంగళూరులో పర్యటించి, భూగర్భ విద్యుత్ కేబుల్ వ్యవస్థను పరిశీలించారు. తెలంగాణలో కూడా , ముఖ్యంగా వెంటనే హైదరాబాద్‌లో అమలు చేయాలని నిర్ణయించారు. అయితే షరామామూలుగా ఆర్థికపరిస్థితి అనుకూలించక, దాన్ని మూలన పడేసారు. ముందుగా ఈ పని చేసిఉంటే, కేబుల్ ప్రొవైడర్లు, ఇంటర్నెట్ ప్రొవైడర్లు తమ దారి తాము వెతుక్కునేవారు. కేవలం జియో, ఎయిర్టెల్ మాత్రమే స్వంత స్థంభాలు ఏర్పాటు చేసుకున్నాయి.
ఒకవైపు డిజిటల్ ఇండియా, క్యాష్‌లెస్ లావాదేవీలు అని పెద్దలు గొప్పలు చెబుతారు. మరొకవైపు ఇంటర్నెట్, కేబుల్ లైన్లను విచక్షణారహితంగా కోసి ప్రజలను ఇబ్బందుల్లో పడేస్తారు. ఇది సంస్కరణనా? లేక ప్రభుత్వ మూర్ఖపు చర్యనా? ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది