నాగార్జునా సాగ‌ర్‌లో నాకు ఎవ‌రూ పోటీ కాదు ఈ సారి విజ‌యం నాదే: నివేదిత

  • Publish Date - November 3, 2023 / 02:50 PM IST
  • జైవీర్ రాజ‌కీయాల‌లో ఎల్‌కేజీ స్టూడెంట్‌
  • భ‌గ‌త్ ప‌ట్ల స్థానిక ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త‌
  • గ‌త పాల‌కులు చేసింది శూన్యం
  • విద్య‌, ఉద్యోగ, ఉపాధి అవ‌కాశాలు క‌ల్పిస్తా
  • ఉపాధి క‌ల్ప‌న‌కే ఇక్క‌డ ప‌రిశ్ర‌మ స్థాపించా
  • లాభాలు మాకు ముఖ్యం కాదు…
  • పేద‌ల‌కు ఉపాధి క‌ల్పించ‌డ‌మే ల‌క్ష్యం

విధాత‌, హైద‌రాబాద్‌: నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌ను ధీటైన అభ్య‌ర్థులు కాంగ్రెస్‌, బీఆరెస్‌ల నుంచి లేర‌ని, ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం త‌న‌నే వ‌రిస్తుంద‌ని బీజేపీ సీనియ‌ర్ నాయ‌కురాలు నాగార్జున సాగ‌ర్ నియోజ‌క వ‌ర్గ అభ్య‌ర్థి కంక‌ణాల నివేదితా రెడ్డి ధీమా వ్య‌క్తం చేశారు. విధాత ప్ర‌తినిధికి ప్ర‌త్యేకంగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో నివేదితా రెడ్డి మాట్లాడుతూ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డానికే తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌న్నారు. త‌న‌కు ప్ర‌త్య‌ర్థిగా ఉన్న‌బీఆరెస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ దురుసు ప్ర‌వ‌ర్త‌న‌ ప‌ట్ల స్థానిక ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త మూట‌క‌ట్టుకున్నార‌న్నారు. ఏనాడూ ఆయ‌న ప్ర‌జ‌ల‌కు అందుబాటులో లేర‌న్నారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న కుందూరు జానారెడ్డి కుమారుడు జైవీర్ రెడ్డి చాలా చిన్న‌వాడు, అత‌నిని ఎవ‌రూ గుర్తుప‌ట్ట‌డం లేద‌ని చెప్పారు. ప్ర‌జ‌ల వ‌ద్ద‌ అత‌ను జానారెడ్డి కుమారుడిన‌ని చెప్పుకుంటూ ప్ర‌చారం చేస్తుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. అత‌నికి రాజ‌కీయ అనుభ‌వం ఏమాత్రం లేదని, రాజ‌కీయాల‌లో ఎల్‌కేజీ స్టూడెంట్ అని వ్యాఖ్యానించారు.

విద్యా స‌దుపాయాలు ఎక్క‌డ‌?

అత్య‌ధికంగా గిరిజ‌న ప్ర‌జ‌లున్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో విద్య అందుబాటులో లేద‌న్నారు. నియోజ‌క‌వ‌ర్గ కేంద్ర‌మైన హాలియాలో కానీ, వ్యాపార కేంద్ర‌మైన‌ పెద్ద‌వూర‌, ప‌ర్యాట‌క కేంద్ర‌మైన నాగార్జు సాగ‌ర్‌ల‌లో కూడా ఒక్క ప్ర‌భుత్వ డిగ్రీ కాలేజీ లేదు, ఒక్క ఇంజ‌నీరింగ్ కాలేజీ లేద‌న్నారు. జానారెడ్డి 40 ఏళ్లు రాజ‌కీయాల‌లో ఉండి, వివిధ శాఖ‌ల‌కు మంత్రిగా ప‌ని చేసిన‌ప్ప‌టికీ నియోజ‌క వ‌ర్గానికి ఒక్క కాలేజీ కూడా తీసుకురాలేక పోయాడ‌న్నారు. క‌నీసం సాగ‌ర్‌కు రావాల్సిన మెడికల్ కాలేజీని కూడా రాకుండా చేశార‌ని ఆరోపించారు. ఇక్క‌డి ప్ర‌జ‌లు, గిరిజ‌నులు చ‌దువుకుంటే చైత‌న్య‌వంతులై త‌న‌ను ప్ర‌శ్నిస్తార‌ని త‌న‌కు రాజ‌కీయ మ‌నుగ‌డ ఉండ‌దేమోన‌నే అపోహ‌తో విద్య‌కు ఏమాత్రం ప్ర‌ధాన్య‌త ఇవ్వ‌కుండా, గిరిజ‌న బిడ్డ‌ల‌కు తీర‌ని అన్యాయం చేశార‌ని ఆరోపించారు. అలాగే ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు లేకుండా పోయాయ‌న్నారు.


దీంతో ఇక్క‌డి ప్ర‌జ‌లు ఉపాధి కోసం వ‌ల‌స‌లు పోతున్నార‌న్నారు. తాను ఈ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు ఉన్న‌త విద్య‌, ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించాల‌న్న ల‌క్ష్యంతో రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌న్నారు. ఈ మేర‌కు తాను ఈ ప్రాంతంలో అనేక క‌ష్ట‌న‌ష్టాల‌కు ఓర్చుకొని ప‌రిశ్ర‌మ‌ను స్థాపించి, స్థానికుల‌కు ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించాన‌ని తెలిపారు. త‌మకు ఆర్థికంగా న‌ష్టాలు, క‌ష్టాలు ఎదురైన‌ప్ప‌టికీ లాభాలు ముఖ్యం కాద‌ని, భావించి, పేద‌ల‌కు ఉపాధి క‌ల్పించ‌డ‌మే ల‌క్ష్యంగా భావించి ఈ ప‌రిశ్ర‌మను నిర్వ‌హిస్తున్నామ‌న్నారు. అధికారం త‌మ‌కు అండ‌గా ఉంద‌ని సాగ‌ర్ కేంద్రంలో ఉన్న ఎన్ ఎస్పీ క్వార్ట‌ర్స్‌ను క‌బ్జాలు చేస్తున్నార‌ని, వీటిని క‌బ్జాదారుల చెర నుంచి విడిపించి, అర్హులైన వారికి అందేలా చేస్తాన‌న్నారు. అలాగే సాగ‌ర్ వ‌ర‌ద కాలువను స్థానిక ఎమ్మెల్యే నిర్ల‌క్ష్యం చేయ‌డం వ‌ల్ల దాదాపు ల‌క్ష ఎక‌రాల వ‌ర‌కు బీడు ప‌డి పోయింద‌న్నారు. దీనికి మ‌ర‌మ్మ‌త్తులు చేసి, వ‌ర‌ద నీరు సాఫీగా వ‌చ్చేలా చేస్తామ‌న్నారు. పోడు భూముల స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్త‌మ‌న్నారు. ప్ర‌పంచ ప‌ర్యాట‌క కేంద్రంగా ఉన్న‌సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గానికి కేంద్రం స‌హ‌కారంతో మంచి విద్యాసంస్థ‌లు తీసుకువ‌చ్చేందుకు కృషి చేస్తామ‌న్నారు.

జానారెడ్డి ఇక్క‌డ చేసిందేమీ లేదు

మొద‌ట త‌న‌ను టీడీపీ నాయ‌కులు రాజ‌కీయాల్లోకి ఆహ్వానించారని, తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రం ఆవిర్భావం త‌రువాత మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో కిష‌న్‌రెడ్డి ఆహ్వానం మేర‌కు బీజేపీలో చేరానని నివేదితారెడ్డి చెప్పారు. అప్ప‌టి నుంచి తాను ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌లో ఉన్నాన‌ని చెప్పారు. సాగ‌ర్ నియోజ‌క వ‌ర్గం నుంచి ఉద్ధండుడైన‌ రాజ‌కీయ నాయ‌కుడు జానారెడ్డి ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు చేసింది ఏమీ లేద‌ని విమ‌ర్శించారు. ఇక్క‌డ బీఆరెస్ ఎమ్మెల్యే అహంకార పూరితంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో స్థానికుల నుంచి వ్య‌తిరేక‌త ఉంద‌న్నారు. అందుకే ఇక్క‌డి ప్ర‌జ‌లు త‌న‌కు చేరువయ్యార‌న్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో అత్య‌ధికంగా ఉన్న మ‌హిళ‌లు మా ఆడ బిడ్డ వ‌చ్చింద‌న్న‌ సంతోషంలో ఉన్నార‌ని తెలిపారు. ఈ ఎన్నిక‌ల్లో త‌న‌కు కాంగ్రెస్‌, బీఆరెస్ అభ్య‌ర్థులు పోటీనే కాద‌న్నారు. మంచి మెజార్టీతో తాను గెలుస్తాన‌ని ధీమా వ్య‌క్తం చేశారు.