విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. గురువారం కనగల్ మండలం ధర్వేశిపురంలో నిర్వహించిన మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎంపీ మాట్లాడారు. పార్లమెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను కలిస్తే.. బీజేపీలోకి వెళ్తున్నాడని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
ప్రాణం పోయినా బీజేపీలోకి పోనని, తన శవం మీద కూడా కాంగ్రెస్ పార్టీ జెండానే ఉంటుందని అన్నారు. బీఆర్ఎస్ అడుగులకు మడుగులొత్తుతున్న పోలీసు అధికారులు, ఇతర అధికారులను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ వదలమని స్పష్టం చేశారు. ప్రభుత్వ అధికారులు, పోలీసులపై తమకు గౌరవం ఉందని, ఆ గౌరవాన్ని నిలబెట్టుకొని పనిచేయాలని సూచించారు. లేనిపక్షంలో అధికారంలోకి వచ్చాక వారి సంగతి చూస్తామని హెచ్చరించారు. దసరా పండుగను ప్రజలు ఘనంగా జరుపుకోవాలని, ఆరోజు రావణ కాష్టం మాదిరిలా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దహనం చేయాలన్నారు. మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నాడని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీని విమర్శించే స్థాయి ఆయనకు లేదన్నారు. రాజకీయ జీవితం ప్రసాదించిన నల్లగొండ నియోజకవర్గాన్ని మరువనున్నారు. 6 గ్యారెంటీ స్కీములను కచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు. ఈనెల 15న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మొదటి జాబితాను ప్రకటిస్తారని వెల్లడించారు. రాష్ట్రంలో పార్టీ 75 స్థానాల్లో విజయం సాధిస్తుందని అన్నారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి ఆరు గ్యారెంటీ స్కీంల కరపత్రాన్ని ఎంపీ ఆవిష్కరించారు.