27న సూర్యాపేట జన గర్జన సభ

– విజయవంతం చేయాలని బీజేపీ పిలుపు

విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: సూర్యాపేట జిల్లాకేంద్రంలో ఈనెల 27న బీజేపీ ఆధ్వర్యంలో జనగర్జన బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు తెలిపారు. ముఖ్య అతిథిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరవుతారన్నారు. మంగళవారం వారు సూర్యాపేటలో సభా స్థలిని పరిశీంచారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈ సభకు రెండు రోజుల ముందే కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామని పేర్కొన్నారు.


బీఆర్ఎస్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు గెలిపించే పరిస్థితిలో లేరన్నారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే, అది బీఆర్ఎస్ కు వేసినట్లే అని ప్రజలు భావిస్తున్నారనీ అన్నారు. 2014 , 18 ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేస్తే గెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరారన్నారు. ఇప్పుడు కూడా అదే జరుగుద్దని ప్రజలు విశ్వసిస్తున్నారని అన్నారు. లక్ష మందితో సూర్యాపేట జన గర్జన సభను నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట కాంగ్రెస్ లో ఏ టీం.. బీ టీం రెండు వర్గాలు ఉన్నాయని, రూపాయికి బొమ్మాబొరుసు మాదిరిగా బీఆర్ఎస్, కాంగ్రెస్ ఉన్నాయని ఎద్దేవా చేశారు. ప్రజా గర్జన సభలో బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలి, కాంగ్రెస్ కు ఎందుకు ఓటు వేయకూడదు, బీఆర్ఎస్ కు రెండుసార్లు ఓటు వేస్తే రాష్ట్ర ప్రజలను ఎలా మోసం చేసిందీ ప్రజల కు తెలుపుతామని ఆయన అన్నారు. అందరూ తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.