రాశిపైనే ప్రాణాలు వదిలిన రైత‌న్న‌

విధాత‌: ఈ యాసంగిలో వరి వేయొద్దని సాక్షాత్తూ పాలకుల ప్రకటనలు.. వరి విత్తనాలు అమ్మితే ఊరుకునేది లేదు.. షాపులు సీజ్ చేయడమేనంటూ కలెక్టర్ హెచ్చరికలు.. వరి వేస్తే ఉరేనని విపక్షాల విమర్శలు.. ధాన్యం కొంటామని కేంద్రం నుంచి లెటర్ తీసుకురావాలంటూ పాలకుల ప్రతి దాడులు వెరసి.. తెలంగాణలో వరి సాగు చేసిన రైతు దీనస్థితిని కళ్లకు కడుతున్నాయి. మొన్నటికి మొన్న మిర్యాలగూడలో రైతన్నలపై మిల్లర్ల దాష్టీకం. సరుకు దించుకోకుండా ఇబ్బంది పెడుతోంటే పోలీసాయన గద్దించాల్సి వచ్చింది. ఈ […]

  • Publish Date - November 6, 2021 / 04:17 AM IST

విధాత‌: ఈ యాసంగిలో వరి వేయొద్దని సాక్షాత్తూ పాలకుల ప్రకటనలు.. వరి విత్తనాలు అమ్మితే ఊరుకునేది లేదు.. షాపులు సీజ్ చేయడమేనంటూ కలెక్టర్ హెచ్చరికలు.. వరి వేస్తే ఉరేనని విపక్షాల విమర్శలు.. ధాన్యం కొంటామని కేంద్రం నుంచి లెటర్ తీసుకురావాలంటూ పాలకుల ప్రతి దాడులు వెరసి.. తెలంగాణలో వరి సాగు చేసిన రైతు దీనస్థితిని కళ్లకు కడుతున్నాయి.

మొన్నటికి మొన్న మిర్యాలగూడలో రైతన్నలపై మిల్లర్ల దాష్టీకం. సరుకు దించుకోకుండా ఇబ్బంది పెడుతోంటే పోలీసాయన గద్దించాల్సి వచ్చింది. ఈ రోజు అంతకంటే అత్యం విషాద ఘటన ఒకటి వెలుగుచూసింది. తన ధాన్యం ఎప్పుడు కొంటారో తెలియక.. రోజుల తరబడి పడిగాపులు కాస్తూ కుప్పపైనే కుప్పకూలిపోయాడో రైతన్న. తన ధాన్యం రాశిపైనే ప్రాణాలు వదిలేశాడు. వరి పండించినందుకు గుండెకోత కాదు.. ఆఖరికి గుండే ఆగిపోయిన దయనీయ ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది.

జిల్లాలోని లింగంపేట మండలం ఐలాపూర్‌కి చెందిన మామిడి బీరయ్య(57) అనే రైతు వరి సాగు చేశాడు. పంట చేతికి రాగానే ధాన్యం రాశులను మండల కేంద్రం లింగంపేటలోని కొనుగోలు కేంద్రానికి చేర్చాడు. గత నెల 27వ తేదీన ధాన్యంతో కేంద్రానికి వచ్చిన బీరయ్య అప్పటి నుంచి పడిగాపులు కాస్తూనే ఉన్నాడు. అక్కడ సీరియల్ చాంతాడంత పొడవుంది. కొనుగోళ్లు కూడా మందకొడిగా సాగుతున్నాయి. కొనుగోలు కేంద్రంలో వెంటనే కాటాలు వేయడం లేదు.