విధాత, హైదరాబాద్: ఎన్నికల వేళ తెలంగాణ చుట్టూ కన్నడ రాజకీయాలు పరిభ్రమిస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ దూకుడును అడ్డుకోవడానికి బీఆరెస్ కర్నాటక అంశాలను తెరమీదకు తీసుకువచ్చింది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రాష్ట్రంలో కర్నాటక రైతులను తీసుకు వచ్చి ఆందోళనలు చేయిస్తోంది. తాజాగా ఈ నెల 22న కర్నాటక రైతుల చేత హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రదర్శన చేయించడానికి సిద్దమైంది. ఈ మేరకు కర్నాటక రైతుల పేరుతో నిరసన ప్రదర్శనకు అనుమతి కోసం దరఖాస్తు కూడా చేశారు.
కనుమరుగవుతుందనుకున్నపార్టీ బరిగీసి నిలబడడంతో…
రాష్ట్రంలో కనుమరుగవుతుందనుకున్న కాంగ్రెస్ పార్టీ లేచినిలబడి బరిగీసి కొట్లాడుతోంది. బీఆరెస్ ఊహకు అందనితీరుగా కాంగ్రెస్ గ్రాఫ్ పెరగడంతో పాటు బీజేపీకిఉన్న గ్రాఫ్ కూడా పడిపోయింది. బీజేపీలో ఉన్నబలమైన నేతలు వరుసగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆరెస్ పార్టీల మధ్య హోరా హొరి ఎన్నిలక పోరు జరుగుతోంది. నువ్వా..నేనా అన్నట్లుగా ప్రచారం సాగుతోంది. అయితే బీఆరెస్ పార్టీ మూడవసారి అధికారం చేపట్టడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. కానీ 10 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీకి సహజంగా ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది. వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్న నేపథ్యంలో చాకచక్యంగా కాంగ్రెస్ పార్టీ జోరుకు కళ్లెం వేసే దిశగా బీఆరెస్ వడివడిగా అడుగులేసింది.
తెరపైకి కర్నాటక కరెంటు సరఫరా అంశం
కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య కాలంలోనే అధికారంలోకి వచ్చిన కర్నాటక రాష్ట్రం వైపు బీఆరెస్ దృష్టి సారించింది. కర్నాటకలో కాంగ్రెస్ వైఫల్యాలే ఆయుధంగా మలుచుకుంది. ఇందులో భాగంగానే కొడంగల్‌లో కర్నాటక నుంచి మనుషులను తీసుకు వచ్చి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ధర్నాలు చేయించింది. అయితే ధర్నాకు వచ్చిన వాళ్లు మాకేమి తెలియదు.. డబ్బులు ఇస్తే వచ్చామని చెప్పడంతో కథ అడ్డం తిరిగింది. ముఖ్యంగా బీఆరెస్ నేతలు కర్నాటకలో కరెంటు సరఫరా అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చారు. కర్ణాటక ఎన్నికల్లో సాధించిన విజయం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పుంజుకోవడానికి ఊతమిచ్చింది. దీంతో కాంగ్రెస్‌పై ఎదురు దాడికి బీఆరెస్ కర్నాటకలో ఇచ్చిన హామీలనే అస్త్రాలుగా మలుస్తుంది.
కర్ణాటక ఇచ్చిన ఐదు గ్యారంటీలను మోడల్‌గా తీసుకుని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆరు గ్యారంటీలను ప్రకటించి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంది. కర్నాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అక్కడ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని బీఆరెస్ ఎదురు దాడికి దిగింది. కాంగ్రెస్ హామీలన్ని మేడిపండు చందమని, డొల్ల పథకాలని బీఆరెస్ ఆరోపిస్తోంది.
కాంగ్రెస్‌ను డిఫెన్స్‌లోకి నెట్టేందుకే..
తెలంగాణలో బీఆరెస్ పదేళ్లుగా సాగించిన పాలనను, పథకాల వైఫల్యాలను ఎండగడుతున్న కాంగ్రెస్ ప్రచారాన్ని దారి మళ్లీంచే వ్యూహాంతోనే బీఆరెస్ కర్ణాటక పథకాలపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ కాంగ్రెస్‌ను డిఫెన్స్‌లోకి నెట్టే ప్రయత్నం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఇందులో భాగంగానే కర్ణాటకలో ఐదు గంటల విద్యుత్తు సక్రమంగా సరఫరా కావడం లేదని, అందుకు అక్కడి రైతులు తరుచు సబ్ స్టేషన్ల వద్ద చేస్త్ను నిరసనల ఘట్టాలను బీఆరెస్ తన ఎన్నికల ప్రచారంలో ప్రధాన అస్త్రంగా చేసుకుందని అంటున్నారు. రెండు సార్లు అధికారంలో ఉన్న బీఆరెస్ తన వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికే కర్నాటక కరెంటు సరఫరా అంశాన్ని తెరపైకి తెచ్చిందన్న అభిప్రాయాన్నిరాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
పాత మిత్రుడితో ప్రెస్ మీట్
పనిలో పనిగా తమ పాత మిత్రుడు జేడీఎస్ అధినేత, కర్నాటక మాజీ సీఎం కుమారస్వామితో
కాంగ్రెస్ తన ఎన్నికల హామీల అమలులో విఫలమైందని, ప్రజలను మోసగించందంటూ చెప్పించిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మంత్రి హరీశ్‌రావు మీడియా యజమాన్యాలకు ఫోన్ చేసి కుమారస్వామి ప్రెస్ మీట్‌కు ప్రముఖంగా కవరేజ్ ఇవ్వాలని, చానళ్లలో లైవ్ కవరేజ్ ఇవ్వాలని అడిగారని ఆరోపించారు. ఇంకో అడుగు ముందుకేసి ఈ నెల 22న కర్ణాటక రైతులతో హైద్రాబాద్‌లో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసిందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
తమను ఎదుర్కోలేక బీఆరెస్ కావాలనే కన్నడ రైతుల పేరుతో బల ప్రదర్శన చేయాలని చూస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.కన్నడ రైతులు తాము ఎదుర్కోంటున్న విద్యుత్తు సమస్యలపై ఆ రాష్ట్రంలో నిరసన తెలుపకుండా తెలంగాణలో నిరసన ప్రదర్శన చేస్తే పరిష్కారం దొరకదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అయితే బీఆరెస్ తన రాజకీయ క్రీడ కోసం తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ను ఇరకాటంలోకి నెట్టేందుకు కన్నడ రైతుల నిరసన ఘట్టానికి దర్శక, నిర్మాతగా మారిందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
కన్నడ హామీలపై మాటల యుద్ధం
కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఐదు గ్యారంటీలుగా ప్రతి ఇంటికి గృహ జ్యోతి పథకం కింద 200యూనిట్ల ఉచిత విద్యుత్తు, గృహ లక్ష్మి పథకంతో మహిళా కుటుంబ పెద్దలకు ప్రతి నెల 2వేలు, అన్న భాగ్య పథకంతో బీపిఎల్ కుటుంబాలకు 10కిలలో ఉచిత బియ్యం, యువనిధి కింద 3వేల నిరుద్యోగ భృతి, శక్తి పథకంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ వసతిని ప్రకటించారు.
ఎన్నికల్లో తమకు విజయాన్ని అందించిన ఈ హామీలన్నింటిని అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోగా అమలు చేస్తామని చెప్పి ఆ దిశగా చర్యలు తీసుకుంది. అయితే ఆచరణలో వాటి అమలు పూర్తి స్తాయిలో సక్రమంగా సాగడం లేదని, నామమాత్రంగానే ఆ పథకాలు మారాయని బీఆరెస్, బీజేపీలతో పాటు కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి విమర్శలు సంధించారు.
ముఖ్యంగా ఐదు గంటల కరెంటు ఇస్తామని చెప్పి రెండు గంటలు కూడా ఇవ్వడం లేదని వారు ఆరోపిస్తున్నారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు సైతం కర్నాటకలో కాంగ్రెస్ ఐదు గ్యారెంటీల అమలులో వైఫల్యం చెందిందని, ఐదుగంటల కరెంటు అందక అక్కడి రైతులు మొసళ్లు తీసుకొచ్చి సబ్ స్టేషన్ల వద్ధ ధర్నాలు చేస్తున్నారని పేర్కోన్నారు. తెలంగాణలో 24గంటల ఉచిత విద్యుత్తుపై సందేహాముంటే కాంగ్రెస్ నేతలు కరెంటు తీగలు పట్టుకోవాలని సవాల్ చేస్తున్నారు.
విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఏకంగా తాను కర్ణాటకలో 18గంటలు కరెంటు తీగలు పట్టుకుని నిలబడుతానని, మీకు దమ్ముంటే తెలంగాణలో పట్టుకుని నిలబడాలని సవాల్ చేశారు. అయితే కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డికే శివకుమార్‌లు మాత్రం బీఆరెస్ మంత్రులకు కర్ణాటకలో కాంగ్రెస్ ఐదు గ్యారంటీల అమలుపై సందేహాలుంటే అక్కడికి వచ్చి చూడాలని ప్రతి సవాల్ చేశారు.
తాము ఇస్తామన్న ఐదు గంటల కరెంటు అక్కడ సరఫరా చేస్తున్నామని డీకే స్పష్టం చేశారు. పీసీసీ అధ్యక్షడు రేవంత్‌రెడ్డి ఒక్క అడుగు ముందుకేసి తాను బస్సు ఏర్పాటు చేస్తాను రండి కర్నాటక తీసుకువెళ్లి చూపిస్తానన్నారు. దీనికి ప్రతిగా చూడటానికి కర్నాటక వెళ్లాల్సిన అవసరం లేదని మంత్రి కేటీఆర్ అనడం గమనార్హం.