విధాత : తెలంగాణలో చెప్పిన సంక్షేమ పథకాలు అమలు చేయని సీఎం కేసీఆర్ ప్రభుత్వం ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. బుధవారం మగ్ధుం భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్.. బీజేపీకి పరోక్షంగా సహకరిస్తోందన్నారు. ఆ రెండు పార్టీలు ఒకే తాను ముక్కలేనన్నారు. బీఆర్ఎస్‌పై కొట్లాడిన బండి సంజయ్‌ని బీజేపీ రాష్ట్ర చీఫ్ పదవి నుంచి అన్యాయంగా తొలగించారన్నారు.
రాష్ట్రంలో బీజేపీని ఓడించేందుకు పని చేస్తామని సీపీఐ నారాయణ స్పష్టం చేశారు. ఎంఐఎం, బీజేపీ, బీఆరెస్‌లు మూడు లోపాయికారి అవగాహాన రాజకీయాలు చేస్తున్నాయన్నారు. ఏపీలో వైసిపి తొత్తుగా ఉన్నందున జగన్, అవినాష్ బయట తిరుగుతుంటే చంద్రబాబును లొంగదీసుకునేందుకు జైల్లో వేశారని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉపముఖ్యమంత్రి సిసోడియను అరెస్టు చేసిన కేంద్రం కవితని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టడం అధికారంలో ఉన్న పార్టీలకు అలవాటుగా మారిపోయిందన్నారు.
సీఎం కేసీఆర్ మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయినట్లుగానే బీఆరెస్ ప్రభుత్వం కూడా కూలిపోతుందని ప్రకృతి ఇచ్చిన సందేశమే ఆ ఘటన అని పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేందుకు మోడీ విధ్వంస చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కాళేశ్వరం లక్ష్మీ బ్యారేజ్ కుంగిపోవడానికి కారణం కూడా రాహుల్ గాంధీనే ముద్దాయి చేస్తారేమోనని నారాయణ ఎద్దేవా చేశారు. బీఆరెస్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ తో రాజకీయ అవగాహన కోసం చర్చలు జరిగాయని తెలిపారు. పార్టీ అంతిమంగా ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ దానికి కట్టుబడే ఉంటారన్నారు.
తెలంగాణ ఎన్నికల్లోకి సీపీఐకి రెండు స్థానాలు ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందన్నారు. అందులో ఒకటి జనరల్ స్థానం కొత్తగూడెం మరొకటి ఎస్సీ రిజర్వుడు స్థానం చెన్నూరు అని అయితే అధికారికంగా ప్రకటించాల్సి ఉందన్నారు. పార్టీలో అంతర్గతంగా ఎన్ని అభిప్రాయాలు ఉన్నప్పటికీ పార్టీ విధానాలను, పార్టీని దిక్కరించి ఎవరు కూడా బయటికి వెళ్తారని తాను అనుకోవడం లేదన్నారు. సీపీఐ నేత అజిజ్ పాషా మాట్లాడుతూ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో ఏడు స్థానాలలోనే పోటీ చేస్తున్న ఎంఐఎం రాజస్థాన్లో మాత్రం 17 స్థానాలలో పోటీ చేస్తుందని విమర్శించారు. చాలామంది ఏడు సీట్లలో ఎంఐఎం గెలుస్తుంది అని చెబుతున్నారని తనకు మాత్రం అనుమానంగానే ఉందన్నారు. బీజేపీకి సహకరించేందుకు ఎంఐఎం ఇతర రాష్ట్రాలలలో పోటీ చేస్తుందన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో కుంగిపోయిన లక్ష్మీబ్యారేజీని పరిశీలించేందుకు సీపీఐ బృందం గురువారం ఏడు గంటలకు వెళుతుందని తెలిపారు. నారాయణ. సయ్యద్ అజీజ్ పాషా. చాడ వెంకటరెడ్డిలతో కూడిన బృందం అక్కడికి వెళ్ళనుందని తెలిపారు. అలాగే కరీంనగర్ మానేరు పై కేబుల్ బ్రిడ్జిని కూడా తమ బృందం పరిశీలిస్తుందన్నారు. కేబుల్ బ్రిడ్జి అద్భుతం అని పర్యాటక ప్రాంతంగా ఉండబోతుందని ప్రారంభించిన సందర్భంగా మంత్రి కేటీఆర్ కొద్ది రోజులకే అది దెబ్బతినడం విచారకరమన్నారు. 117 కోట్ల అంచనాలతో ప్రారంభించి 224 కోట్లు ఖర్చు చేశారని అయినా నాణ్యత లోపాలు ఉండడం ఘోరమన్నారు.
చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ లక్ష్మీ బ్యారేజ్ కుంగిపోవడానికి విధ్వంస చర్య అని పోలీసులు చెప్పడాన్ని తప్పుపట్టారు. నాగార్జునసాగర్, శ్రీశైలం, శ్రీరాంసాగర్ వంటి ప్రాజెక్టుల వద్ద నిరంతర పహారా ఉంటుందని కాళేశ్వరం వద్ద అలాంటి పహారా లేకపోతే విగ్రహ చర్యకు పోలీసులు అసమర్ధతే కారణమని చెప్పారు. ఒకవేళ పహారా ఉండి కూడా విద్రోహ చర్య జరిగితే అది పోలీసుల వైఫల్యమే అవుతుందని వెంకట్ రెడ్డి ఆరోపించారు.