కేసీఆర్ మాటలకు మోసపోతే గోసపడతారు: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

  • Publish Date - November 3, 2023 / 02:24 PM IST

– నల్లగొండను దత్తత తీసుకొని ఏం చేశారు?

– నల్లగొండ మున్సిపాలిటీలో విస్తృత ప్రచారం

విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: సీఎం కేసీఆర్ మరోసారి వచ్చి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తాడని, ఆయన మాటలకు మోసపోతే గోస పడతామని కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, నల్లగొండ అసెంబ్లీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. శుక్రవారం కోమటిరెడ్డి నల్లగొండలోని 35, 36 , 37వ వార్డుల్లో విస్తృత ప్రచారంచేశారు. డప్పు చప్పులు, కోలాట బృందాలతో కాలనీల్లో ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి గడపగడపకు ప్రచారం చేశారు. ఎన్నికల్లో మరోసారి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. పద్మా నగర్, రవీంద్ర నగర్ కాలనీల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు.

గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్ నల్లగొండను దత్తత తీసుకుంటే తాను కూడా సంతోషపడ్డానని అన్నారు. కానీ దత్తత పేరుతో ఎన్నికల్లో లబ్ధి పొంది, నల్లగొండను ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ఒక్క రోడ్డు వేసి నల్లగొండను అభివృద్ధి చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. నల్లగొండ నియోజకవర్గంలో తన హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప, బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు. గుంతలు పడిన రోడ్లకు మట్టి పోసిన దాఖలాలు కూడా లేవని అన్నారు. డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి పేద ప్రజలను వంచనకు గురి చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీ స్కీములను కచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు.

ప్రభుత్వంలో తాను ఏ స్థాయిలో ఉన్నా నల్లగొండ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజలంతా ఈ ఎన్నికల్లో తనకు అండగా ఉండి గెలిపిస్తే వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుర్రి శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్ బోయినపల్లి శ్రీనివాస్, నాయకులు ఇటికాల శ్రీనివాస్, మొరిశెట్టి నాగేశ్వరరావు, నంద్యాల బ్రహ్మానందరెడ్డి, అవుట రవీందర్, ఇటికాల శ్రీకాంత్, సురిగి మారయ్య, సూరెడ్డి సరస్వతి, పాదూరి మోహన్ రెడ్డి, వంగాల అనిల్ రెడ్డి, సుజాత, పుట్ట వెంకన్న, గడ్డం భరత్, గూడశివ, నాంపల్లి భాగ్య పాల్గొన్నారు.