విధాత : లెఫ్ట్, కాంగ్రెస్ మధ్య పొత్తు అంశం సీరియల్ తరహాలో సాగుతున్నది. తమ అల్టిమేటం ముగిసినా పొత్తుపై కాంగ్రెస్ ఏమీ తేల్చకపోవడంతో ఆగ్రహానికి గరైన సీపీఎం నేతలు.. ప్రెస్‌మీట్ పెట్టి మరీ తాము పోటీ చేసే స్థానాలతో జాబితాను ప్రకటించారు. అయితే.. ఆ వెంటనే తమ్మినేనికి కాంగ్రెస్ సంప్రదింపుల కమిటీ చైర్మన్ కే జానారెడ్డి ఫోన్ చేసి.. తాము వామపక్షాలతో పొత్తును కోరుకుంటున్నామని, తొందరపడి అభ్యర్థులను ప్రకటించవద్దని కోరినట్టు తెలిసింది. పలు కారణాల రీత్యా సీట్ల సర్దుబాటు ఆలస్యమైందని శుక్రవారం నాటికి సీపీఎం పోటీ చేసే స్థానాలను వెల్లడిస్తామని చెప్పారని విశ్వసనీయవర్గాల సమాచారం. తాము చెప్పాల్సింది చెప్పామని, ఇక నిర్ణయం మీదేనని తమ్మినేని బదులిచ్చినట్టు తెలిసింది.