మా పాలన ప్రగతికి ఆర్థిక సర్వే లెక్కలే సాక్ష్యం
5,944 కోట్ల మిగులుతో రాష్ట్రాన్ని అప్పగించాం
కొత్తగా ఒక్క ఉద్యోగం ఇచ్చారని నిరూపిస్తే
రాజకీయ సన్యాసం తీసుకుంటా
6 లక్షల 71 వేల కోట్ల అప్పు అవాస్తవం
నికర అప్పు 3 లక్షల 85 వేల 340 కోట్లే
జాబుల జాతరకు బదులు అబద్దాల జాతర
ద్రవ్యవినియయ బిల్లుపై చర్చలో కేటీఆర్
బడ్జెట్‌లో ఒక్క కొత్త పాలసీ లేదని విమర్శ
విధాత, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో అరచేతిలో స్వర్గం చూపించిందని.. బడ్జెట్‌లో మాత్రం మోచేతికి బెల్లం పెట్టిందని బడ్జెట్‌పై బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు. శాసనసభలో ద్రవ్య వినిమయం బిల్లుపై చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. 2014లో కొత్త రాష్ట్రం తెలంగాణ అనిశ్చిత వాతావరణంలో తన ప్రయాణం మొదలుపెట్టి పదేళ్లలో సంక్షేమై, అభివృద్ధి రంగాల ప్రగతి సూచీకలలో అగ్రగామిగా నిలిచిందన్నారు. కాంగ్రెస్ పాలనలో మళ్లీ రైతు, చేనేత ఆత్మహత్యలు, క్షీణిస్తున్న శాంతిభద్రతలతో రాష్ట్రం తిరుగోమన అడుగులేస్తుందన్నారు. ఆస్తులు దండిగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని కాంగ్రెస్ సభ్యులు మాట్లాడడం సరికాదన్నారు. సభకు ఇచ్చిన సోషియో ఎకానమిక్ అవుట్ లుక్‌లో తెలంగాణ గొప్ప రాష్ట్రంగా ఎదిగిందని పేర్కొన్నారని, 2022 మార్చి 15న ఇదే సభలో ప్రతిపక్ష హోదాలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ ప్రతి సంవత్సరం సంపద సృష్టిస్తున్నారని, రాష్ట్రాన్ని కరోనా అతాలకుతలం చేసినప్పటికీ ఆ దాడిని తట్టుకోని ఉత్పత్తిని, సంపదను పెంచడం జరిగిందన్నారని చెప్పారు. అక్కడ కూర్చోగానే స్వరం మారిందని, అయినప్పటికీ వారు ఇచ్చిన అవుట్ లుక్‌లోనే అన్ని విషయాలు వివరంగా చెప్పారని, ఇందులో వాస్తవాలు బయటపడ్డాయని కేటీఆర్ తెలిపారు. ఇప్పుడు ఎన్నికలు లేవని అన్నారు. నాలుగున్నరేండ్ల పాటు కలిసిమెలిసి పని చేసుకోవాలని చెప్పారు. మీకు ప్రజలు అవకాశం ఇచ్చారని, ప్రతిపక్ష పార్టీగా నిర్మాణాత్మక అభివృద్ధికి సహకరిస్తామని తెలిపారు. గత పదేండ్లలో ఏం మంచి జరిగిందో చెబుదామంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కేసీఆర్ ఫోబియా పట్టుకుందని ఎద్దేవా చేశారు. బడ్జెట్‌లో.. శుష్క ప్రియాలు ..శూన్య హస్తాలు, గ్యారెంటీలకు టాటా.. లంకె బిందెల వేట, డిక్లరేషన్లు డీలా.. డైవర్షన్ల మేళా.., హామీ పత్రాలకు పాతర.. శ్వేత పత్రాల జాతర, నిరుద్యోగుల మీద నిర్బంధలు, జర్నలిస్టుల మీద దౌర్జన్యాలు, విమర్శస్తే కేసులు.. ప్రశ్నిస్తే దాడులు, నేతన్నల ఆత్మహత్యలు.. ఆటో అన్నల బలవన్మరణాలు, ఓట్లకు ముందు అభయ హస్తం.. ఓట్లు పడ్డాక శూన్య హస్తం మ్యానిఫెస్టో అరచేతిలో స్వర్గం.. బడ్జెట్‌లో మాత్రం మోచేతికి బెల్లం, మూడు తిట్లు.. ఆరు అబద్ధాలతో పొద్దున లేస్తే బట్ట కాల్చి మీద వేసే పనులు ఇందులో కనబడుతున్నాయని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. తమ బడ్జెట్‌ను అభినందించాలని భట్టి కోరుతున్నారన్న కేటీఆర్.. ‘ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి మాట తప్పినందుకు అభినందించాలా? డిక్లరేషన్లకు దిక్కు మొక్కు లేకుండా చేసినందుకు అభినందించాలా? 420 హామీలను తుంగలో తొక్కినందుకు అభినందించాలా?’ అని ప్రశ్నించారు. అభినందించడం కాదు మిమ్మల్ని అభిశంసించాలన్నారు. మన దగ్గర రీకాల్స్ సిస్టం లేదు కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు నాలుగేండ్లు భరించాలి తప్ప మరో మార్గం లేదని వ్యాఖ్యానించారు.
రెవెన్యూ సర్‌ప్లస్‌తో రాష్ట్రాన్ని అప్పగించాం
2014లో రాష్ట్రం ఏర్పడిన సమయంలో మిగులు బడ్జెట్‌తో అప్పజెప్పితే అప్పులపాలు, అప్పులకుప్ప చేశారని కాంగ్రెస్ నేతలు అనడం సరికాదని కేటీఆర్ అన్నారు. 2014లో రెవెన్యూ మిగులు రూ.369 కోట్లు ఉంటే.. 2022-23లో రెవెన్యూ సర్‌ప్లస్ రూ. 5,944 కోట్లతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పజెప్పామన్నారు. ‘2024 బడ్జెట్‌లో రెవెన్యూ సర్‌ప్లస్ 297 కోట్లు. రూ.369 కోట్లతో అప్పజెప్పితే రూ.5944 కోట్లతో మీకు అప్పజెప్పాం. ఇది తప్పా..? అప్పుల పాలైంది అని ఎలా అంటారు?’ అని నిలదీశారు. జీతాలు ఇచ్చేందుకు అప్పులు తెస్తున్నామని ఆర్థిక మంత్రి అనడం సరికాదని కేటీఆర్ పేర్కొన్నారు. ‘భారతదేశంలోనే తెలంగాణ 74 శాతం డెవలప్‌మెంట్ ఎక్స్‌పెండించర్‌తో అగ్రభాగాన ఉన్నట్లు ఆర్బీఐ లెక్కలను సోషియో ఎకానమిక్ అవుట్ లుక్‌లో కోట్ చేశారు. ఇప్పుడేమో జీతాలకు పైసల్లేవు, అప్పులు తీర్చడానికి అప్పులు చేస్తున్నామని చెబుతున్నారు. వాస్తవం ఏందంటే.. కమిటెడ్ ఎక్స్‌పెండిచర్ గురించి తెలుసుకోవాలి. కమిటెడ్ ఎక్స్‌పెండిచర్ అంటే శాలరీస్, పెన్షన్లు, వడ్డీ చెల్లింపులు కలపడమే దీని అర్థం. ఈ విషయంలో మనం చాలా స్పష్టంగా ఇతర రాష్ట్రాలతో పోల్చితే చాలా బెటర్‌గా ఉన్నాం. తెలంగాణలో రూపాయిలో కమిటెడ్ ఎక్స్‌పెండిచర్ 47 పోతే 53 పైసలు అదనంగా ఉన్నాయి. జాతీయ సగటు 56 పైసలు. కమిటెడ్ ఎక్స్‌పెండిచర్‌లో అత్యల్పంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ 4వ స్థానంలో ఉంది. తిమ్మినిబమ్మి చేయొద్దని సూచిస్తున్నా. వడ్డీలు, జీతాల కోసం డబ్బులు సరిపోవట్లేదని వారు మాట్లాడడం సరికాదు’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
నికర అప్పు కేవలం రూ. 3,85,340 కోట్లు మాత్రమే..
సొంత వనరుల్లో తెలంగాణ టాప్‌లో ఉందని, 6 లక్షల 71 వేల కోట్ల అప్పు ఉందని దుష్ప్రచారం చేయడం సరికాదని కేటీఆర్ అన్నారు. బీఆరెస్ ప్రభుత్వం చేసిన నికర అప్పు 3 లక్షల 85 వేల 340 కోట్లు మాత్రమేనని స్పష్టం చేశారు. ఆనాడు బీఆరెస్ హయాంలో మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టును రూ.16 వేల కోట్లతో రూపొందించామని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టు వ్యయాన్ని ఏకంగా రూ. లక్షా యాభై వేల కోట్లకు పెంచారని చెబుతూ దీనిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఒక్క ఉద్యోగం ఇచ్చారని నిరూపిస్తే రాజకీయ సన్యాసం
కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎనిమిది నెలల కాలంలో కొత్తగా ఒక్క ఉద్యోగం ఇచ్చినట్టు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేసి, రాజకీయ సన్యాసం తీసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కేటీఆర్ సవాల్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అశోక్‌నగర్‌కు రాహుల్ గాంధీ వచ్చారని, ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, ఏడాది లోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీనిచ్చారని గుర్తు చేశారు. నిజంగా రాహుల్ హామీ, వీరి నిర్వాకం చూసిన తర్వాత గోబెల్స్ బతికి ఉంటే వీళ్ల దగ్గర ట్యూషన్ నేర్చుకుంటానని పోతుండేనని ఎద్దేవా చేశారు. 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని బడ్జెట్ చెప్పారన్న కేటీఆర్.. వాటికి నోటిఫికేషన్లు ఎప్పుడు ఇచ్చారు? పరీక్ష ఎప్పుడు జరిగింది? నియామకాలు ఎప్పుడు ఇచ్చారు? సభకు చెప్పాలని డిమాండ్ చేశారు. మేం ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించిన 30 వేల ఉద్యోగాలను తామే ఇచ్చామని చెప్పుకొంటూ తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. జాబుల జాతర బదులు అబద్ధాల జాతర నడుస్తున్నదని ఎద్దేవాచేశారు. సీఎం రేవంత్ రెడ్డి పాలసీలు తెస్తామన్నారు కానీ ఇప్పటి వరకు ఒక్క కొత్త పాలసీ తేలేదని విమర్శించారు. ‘కేసీఆర్ అంటే జలసీ తప్ప.. ఏ పాలసీ తేలేదు. మహేశ్వరంను న్యూయార్క్‌లా, మూసీని లండన్ థేమ్స్ నదిలా మారుస్తాం అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు. ఎవరి ఇంటెలిజెన్స్ ఏంటో ప్రజలు తేల్చుతారు/ అని చెప్పారు.
పంచపాండవుల కథలా రుణమాఫీ
పంచ పాండవులు .. మంచంకోళ్లు అన్నట్టే రుణమాఫీ కథ ఉన్నదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. లక్ష రూపాయలకే 16వేల కోట్లు అయితే లక్షన్నరకు 12వేల కోట్లు ఎట్లా అవుతుందని ప్రశ్నించారు. ‘రుణమాఫీ మొదలు 40 వేల కోట్లు అన్నరు.. తర్వాత కేబినెట్ లో 31 వేల కోట్లు అన్నరు.. బడ్జెట్ లో 25 వేల కోట్లే పెట్టిండ్రు’ అని విమర్శించారు. చారాన కోడికి బారానా మసాలా అన్నట్లుగా పత్రికల్లో మాత్రం భారీ ప్రకటనలు ఇచ్చుకుంటున్నారని విమర్శించారు.