దారి మార్చిన కామ్రేడ్లు

  • Publish Date - November 2, 2023 / 02:13 PM IST

– కాంగ్రెస్తో పొత్తు సందిగ్ధత

– సమస్యలు పరిష్కరించే వారికే మద్దతు

– ప్రజలను మభ్యపెడుతున్నారంటూ విమర్శ

– సీపీఐ రాష్ట్ర నేత తక్కళ్లపల్లి శ్రీనివాస రావు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు తెలియజేయాలనే అంశంపై కామ్రేడ్ల దారి మారింది. రెండు రోజుల్లోనే సీపీఐ నాయకులు తమ గొంతు మార్చారు. నిన్నటి వరకు బీఆర్ఎస్, బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలని, ఎన్నికల్లో కృషి చేయాలని ప్రకటిస్తూ వచ్చారు. కాంగ్రెస్తో కలిసి కార్యాచరణ కొనసాగించేందుకు ఆసక్తి కనపరిచారు. కానీ రెండు రోజుల్లోనే మార్పు జరిగింది. తాజా ఎన్నికల్లో నిన్నటి వరకు సీపీఐ, సీపీఎంలతో ఎన్నికల పొత్తు కొనసాగుతుందని భావించగా, తాజాగా ఆ పరిస్థితుల్లో మార్పు నెలకొంది. వామపక్ష పార్టీలతో కాంగ్రెస్ పొత్తు ఉంటుందా? లేదా అనేది సందిగ్ధంగా మారింది. ఈ స్థితిలో సీపీఎం తాను పోటీ చేసే 17 స్థానాలను ప్రకటించింది. కూడా అయితే సీపీఐ పోటీ చేసే స్థానాలను ప్రకటించకపోయినప్పటికీ తన స్వరం మార్చింది.


పేదలు, గుడిసెవాసులు, ఇల్లు లేని వారు, భూములు లేనివారు, పేద, మధ్యతరగతి వర్గాలకు ఏ పార్టీ సహకరిస్తుందో, వారి సమస్యలు ఎవరు పరిష్కరిస్తారో వారికి మద్దతు తెలియజేస్తామంటూ ప్రకటన చేయడం గమనార్హం. వాస్తవానికి ఈ ఎన్నికలకు ముందు సీపీఐ, సీపీఎం పార్టీలు బీఆర్ఎస్ తో పొత్తు ఉంటుందనే ఆశాభావంతో ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నికల అనంతరం మూడు పార్టీల మధ్య పొత్తు ఉంటుందని నమ్మకంతో ఉండగా, బీఆర్ఎస్ తమ అభ్యర్థులను ఏకపక్షంగా ప్రకటించి కామ్రేడ్లకు గట్టి షాక్ ఇచ్చింది. ఈ స్థితిలో బీఆర్ఎస్, బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్తో పొత్తు ఉంటుందనే వాతావరణం నెలకొంది. చర్చలు, సీట్ల పంపిణీ, ఎక్కడెక్కడ పోటీ చేయాలి, అవకాశం ఎక్కడుందనే అనేక అంశాలపై చర్చ సాగుతూ వచ్చింది. చివరికి పొత్తు అంశం ఎటూ తేల్చకుండా అక్కడే ఆగిపోయింది. ఈ స్థితిలో పూర్తిగా కాంగ్రెస్ పై ఆధారపడకుండా తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితికి వామపక్షాలు నెట్టివేయబడ్డాయి. ఈ క్రమంలోనే కామ్రేడ్ల స్వరం మారినట్టు భావిస్తున్నారు. సీపీఎం 17 స్థానాలకు పోటీ చేయనున్నట్లు ప్రకటించింది.

సమస్యలు పరిష్కరించే వారికే మద్దతు

గుడిసెవాసుల అభివృద్ధికి సహకరించే వారికే సీపీఐ మద్దతు ఉంటుందని ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస రావు అన్నారు. గురువారం సీపీఐ వరంగల్ జిల్లా కార్యాలయం తమ్మెర భవన్ లో పార్టీ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం గడ్డం యాకయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తక్కళ్లపల్లి శ్రీనివాస రావు మాట్లాడారు. నగరంలోని పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు అందించాలన్నారు. గుడిసెవాసుల కాలనీలలో విద్యుత్, రోడ్లు, తాగునీటి సౌకర్యం కల్పించాలని, గుడిసెవాసులకు పట్టాలు ఇచ్చి పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. గత అనేక సంవత్సరాలుగా ప్రభుత్వ భూముల్లో నిలువ నీడ లేని పేదలు గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారని, వారికి కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు.


ప్రస్తుతం ఎన్నికల్లో అనేక పార్టీలు ప్రజలను మరోసారి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. పేదల, గుడిసెవాసుల అభివృద్ధికి సహకరించే వారికే ఈ ఎన్నికలలో సీపీఐ మద్దతు ఉంటుందన్నారు. ఈ సమావేశంలో సీపీఐ వరంగల్ జిల్లా కార్యదర్శి మేకల రవి, రాష్ట్ర సమితి సభ్యులు పంజాల రమేష్, జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ కే బాష్ మియా, నాయకులు అక్కపెల్లి రమేష్, బుస్సా రవీందర్, తోట చంద్రకళ, గుంపెల్లి మునీశ్వరుడు, వీరగోని శంకరయ్య, గుండె బద్రి, ఆరెళ్లి రవి, కందిక చెన్నకేశవులు, దామెర క్రిష్ణ, జన్ను రవి పాల్గొన్నారు.