విధాత, హైదరాబాద్: అధికారిక అభ్యర్థులకు పెను సవాలు విసిరేలా తయారైన రెబల్స్‌ను కట్టడి చేయడంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆరెస్, బీజేపీ సక్సెస్ అయినట్టే కనిపిస్తున్నది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి ప్రధాన పార్టీల తిరుగుబాటు అభ్యర్థులు మెజార్టీగా ఉపసంహరించుకొని, పార్టీ అధిష్ఠానం ప్రకారం పార్టీ అభ్యర్థికి ప్రచారం చేయడానికి సిద్దయ్యారు.
అయితే.. ప్రత్యర్థి పార్టీల్లో రెబల్స్ ఉంటే తమకు లాభిస్తుందని అన్ని పార్టీలూ ఆశపడినా.. ఆ అవకాశం దాదాపు లేకుండా పోయింది. దీంతో దాదాపు 70 స్థానాల్లో ద్విముఖ పోటీ నెలకొంటుండగా.. మరో 30 స్థానాల్లో త్రిముఖ పోటీ కనిపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీలో సహజ సిద్ధంగా ఉండే అసమ్మతిని రెబల్స్ పోటీ రూపంలో ఎన్నికలలో తమకు అనుకూలంగా మలుచుకోవాలనుకున్న బీఆరెస్ ఆశలకు కాంగ్రెస్ గండి కొట్టింది.
కాంగ్రెస్ నుంచి దాదాపు 20 స్థానాల్లో రెబల్స్ బరిలో దిగారు. వీరంతా సొంత పార్టీ ఓటు చీల్చగలవారే. వీరి ద్వారా లబ్ధి పొందాలని బీఆరెస్ ఆశించినా.. అందుకు భిన్నంగా కాంగ్రెస్ వారందరినీ బరి నుంచి తప్పించడంలో సక్సెస్ అయింది. పటేల్ రమేశ్‌రెడ్డితో సహా వివిధ నియోజకవర్గాలలో తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీ చేసివారు తమ నామినేషన్లు ఉపసంహరించున్నారు. బీఆర్‌ఎస్, బీజేపీల నుంచి కూడా రెండుమూడు చోట్ల మినహా అన్ని చోట్ల రెబల్స్ అభ్యర్థులను ఉపసంహరింప చేయడంలో సఫలం అయ్యారు.
గతానికి భిన్నంగా..
గతానికి భిన్నంగా ఈ దఫా ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు రెబల్స్ బెడద లేకపోవడం విశేషం. తిరుగుబాటు అభ్యర్థులకు ప్రధాన పార్టీలు అధికారంలోకి వచ్చాక అనేక పదవులు వస్తాయని, వాటిల్లో అవకాశం కల్పిస్తామని నచ్చజెప్పారని సమాచారం. కొంత మంది తిరుగుబాటు అభ్యర్థులకు ఇప్పటి వరకూ చేసిన ఖర్చును చెల్లిస్తామని హామీ ఇచ్చారని ప్రచారం జరుగుతున్నది.
దీనికితోడు ఈ సారి జరిగే ఎన్నికలు అత్యధిక ఖర్చుతో కూడిన విషయం కావడంతో తిరుగుబాటు అభ్యర్థిగా ఉండి ఖర్చులపాలయ్యే కంటే ఇచ్చింది తీసుకొని, తప్పుకోవడమే మేలన్న నిర్ణయానికి సదరు రెబల్స్ వచ్చి ఉండొచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి డీలిమిటేషన్‌తో పెరిగే స్థానాల్లో తమకు అవకాశాలు దక్కకపోతాయా అన్న ఆశ కూడా రెబల్స్ పోటీ నుంచి తప్పుకోవడానికి దోహదపడిందన్న చర్చ జరుగుతున్నది.
ముఖాముఖి పోరే..
ప్రధాన పార్టీల రెబల్స్, బలమైన ఇండిపెండెంట్‌లు పోటీ నుంచి తప్పుకోవడంతో ఈ ఎన్నికల్లో 70 స్థానాల్లో కాంగ్రెస్, బీఆరెస్‌ల మధ్య ముఖాముఖి పోటీనెలకొంది. గ్రేటర్ హైద్రాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో బీజేపీ బలంగా ఉన్న చోట త్రిముఖ పోటీ సాగనుందని తెలుస్తోంది. త్రిముఖ పోటీ స్థానాల్లో చాలాచోట్ల పోలింగ్ తేదీ సమీపించే నాటికి ద్విముఖ పోటీ నెలకొనవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీఎస్పీ, సీపీఎం పోటీ ఎవరి ఓట్లను చీల్చగలుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్‌లో 44 మంది పోటీలో ఉన్నారు. సిద్దిపేటలో 21మంది పోటీలో ఉన్నారు. అయితే వీరందరి పోటీ నామమాత్రమేనని అంటున్నారు.
రంగంలోకి దిగిన ఏఐసీసీ
కాంగ్రెస్ పార్టీలో ముందెన్నడు లేని రీతిలో ఈ దఫా ఎన్నికల్లో రెబల్స్ అభ్యర్థులు బరిలో లేకుండా చేయడంలో పార్టీ అధిష్ఠానంతోపాటు అభ్యర్థులు సఫలీకృతులయ్యారని స్వంత పార్టీ నేతలు చెపుతున్నారు. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ఉన్నకాంగ్రెస్ అధిష్ఠానం.. ఏఐసీసీ, పీసీసీ నాయకులను ప్రత్యేకంగా పంపించి బుజ్జగింపులు చేయించింది. అభ్యర్థుల వడపోత దశ నుంచే టికెట్లు ఆశించిన ఆశావహుల మధ్య ఏకాభిప్రాయానికి కాంగ్రెస్ హైకమాండ్ సాధించిన ప్రయత్నలు అంతిమంగా సత్పలితాలనిచ్చాయని పార్టీ నాయకుడొకరు అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, వచ్చాక ఎమ్మెల్సీ, కార్పొరేషన్లు, జిల్లా పరిషత్ పదవులను కట్టబెడుతామన్న ఆఫర్లతో పాటు పలువురికి ఎంపీ టికెట్ల హామీలిచ్చి అసమ్మతిని సద్దుమణిగించగలిగారని సమాచారం. అలాగే టికెట్ వస్తుందన్న ఆశలతో వారు ఇప్పటిదాకా నియోజకవర్గాల్లో ప్రజలను, కార్యకర్తలను మచ్చిక చేసుకునేందుకు పెట్టిన ఖర్చులను చెల్లించే ఒప్పందాలు కూడా జరిగాయని అంటున్నారు. దివంగత వైఎస్సార్ ఏక నాయకత్వం సాగిన సమయంలోనూ కొనసాగిన రెబల్స్ బెడద.. ఈ దఫా ఎన్నికల్లో లేకుండా చేయడంలో కాంగ్రెస్ నాయకత్వం సఫలీకృతమైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
భారీ ఊరట
కాంగ్రెస్ అధిష్ఠానం జోక్యంతో రెబల్ అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో భారీ ఊరట లభించింది. చివరి రెండు రోజుల్లో దాదాపు 20 నియోజవర్గాల్లో రెబల్స్ వేసిన నామినేషన్లను ఉపసంహరింపచేయడంలో కాంగ్రెస్ సఫలీకృతమైంది. సూర్యాపేట కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ పటేల్ రమేశ్‌రెడ్డి.. ఎంపీ టికెట్ ఇస్తానన్న హామీతో తన నామినేషన్ ఉపసంహరించుకొని పార్టీ అభ్యర్థి గెలుపు కోసం సహకరిస్తానని ప్రకటించారు.
డోర్నకల్‌లో నెహ్రునాయక్, జుక్కల్‌లో ఎస్ గంగారాం, ఇబ్రహీంపట్నంలో దండెం రాంరెడ్డి, బాన్సువాడలో కాసుల బాలరాజు, బోధ్‌లో వెన్నెల అశోక్, నరేశ్ జాదవ్, నకిరేకల్‌లో దైద రవీందర్, చొప్పదండిలో నాగి శేఖర్, ఇల్లందులో చీమల వెంకటేశ్వర్లు, వైరాలో రాంమూర్తి నాయక్, ముథోల్‌లో విజయ్‌కుమార్‌రెడ్డి, పాలకుర్తిలో లక్ష్మణ్ నాయక్, సుధాకర్ గౌడ్, మహబూబాబాద్‌లో భూక్యా మంగీలాల్, సిరిసిల్లలో ఉమేశ్‌రావు, పరకాలలో చిమ్మని దేవరాజు, చేవెళ్లలో సున్నం వసంత, వర్ధన్నపేటలో సిరిసిల్ల రాజయ్య, అదిలాబాద్‌లో సంజీవ్‌రెడ్డి నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. నర్సాపూర్‌లో నామినేషన్ ఉపసంహరించుకున్న పీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్ కుమార్ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. వరంగల్ ఈస్టులో రెబల్‌గా నామినేషన్ వేసిన జంగా రాఘవరెడ్డి నామినేషన్ తిరస్కరణకు గురైంది.
వరంగల్ పశ్చిమ కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన జంగా రాఘవరెడ్డి, డోర్నకల్ టికెట్ ఆశించిన నెహ్రూ నాయక్, పాలకుర్తి టికెట్ ఆశించిన బండి సుధాకర్ గౌడ్, లక్ష్మీనారాయణ నాయక్ తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.
దీంతో కాంగ్రెస్ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. జంగా రాఘవరెడ్డికి వరంగల్ పశ్చిమ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. నెహ్రూ నాయక్ కు పార్టీలో, రాబోయే ప్రభుత్వంలో సముచిత స్థానం ఇస్తామని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రామసహాయం సురేందర్ రెడ్డి నెహ్రూ నాయక్ తో మాట్లాడినట్లు సమాచారం. కాంగ్రెస్ టికెట్ ఆశించిన భూపాల్ నాయక్ తో కూడా సురేందర్ రెడ్డి మాట్లాడినట్లు చెబుతున్నారు.
బీఆరెస్‌లోనూ అదే వ్యూహం
బీఆరెస్‌లో వరుసగా మూడో ఎన్నికల్లోనూ 100కుపైగా స్థానాల్లో సిటింగ్‌లకు టికెట్లు కేటాయించిన తరువాత, మెజార్టీ నియోజకవర్గాల్లో ఆశావహులు అసమ్మతి గళమెత్తారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవిత.. అసమ్మతి నేతలను, నామినేషన్లు వేసిన రెబల్స్‌ను పిలిపించుకుని చర్చలు జరిపారు. పదవులు, ఆర్ధిక సహాయాల ఆఫర్లతో పోటీ నుంచి తప్పించగలిగారని తెలుస్తున్నది.
మూడోసారి మనమే అధికారంలోకి వస్తామని, రాగానే ఎమ్మెల్సీలు, కార్పొరేషన్లు, స్థానిక సంస్థల పదవులతో పాటు ఆర్ధిక అవకాశాలు కల్పిస్తామంటూ రెబల్స్‌ను తమదారికి తెచ్చుకోగలిగారని అంటున్నారు. పెద్దపల్లి నుంచి చివరి రోజు వరకు బరిలో ఉన్న నల్ల మనోహర్‌రెడ్డి కూడా పెద్దల జోక్యంతో విత్‌డ్రా చేసుకున్నారు. కొత్తగూడెం నుంచి జలగం వెంకట్రావు, మధిర నుంచి బొమ్మెర రాంమూర్తి తమ నామినేషన్లు విత్‌డ్రా చేసుకోకుండా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీలో ఉండడం గమనార్హం. వరంగల్ తూర్పులో నామినేషన్ వేసిన బీఆర్ఎస్ నాయకుడు రాజనాల శ్రీహరి కూడా తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు.
బుజ్జగించడంలో సఫలమైన బీజేపీ
బీజేపీ రెబల్స్ అసిఫాబాద్‌లో కోట్నాక్ విజయ్, బెల్లంపల్లిలో కోయల ఏమాజీ, నాగర్ కర్నూల్‌లో కొండ మణెమ్మ, సిరిసిల్లలో లగిశెట్టి శ్రీనివాస్, పటాన్ చెరులో రాజేశ్వర్‌రావు దేశ్‌పాండేలలో ఒకరిద్దరు మినహా అందరిని బుజ్జగించి పోటీ నుంచి తప్పిండంలో సఫలీకృతమైంది.