– ప్రజా సమస్యల తెలవని ప్రధాని ఉండడం బాధాకరం
– అవినీతిలో కూరుకుపోయిన కేసీఆర్ ను ఫామ్ హౌస్ కు పంపాలి
– ఉమ్మడి నల్గొండలో 12 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుంది
– బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం మూడు పార్టీలు ఒకటే
– కాంగ్రెస్ ను గెలిపిస్తే ఇందిరమ్మ రాజ్యమే
– నల్గొండలో కోమటిరెడ్డి గెలుపు ఖాయం
– నల్గొండ బహిరంగ సభలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే
విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: అవినీతిలో కూరుకుపోయిన కేసీఆర్ ను గద్దె దించేందుకు కాంగ్రెస్ సింహంలా పోరాడుతున్నదని, తెలంగాణ ప్రజలు ఆయన్ను ఫామ్ హౌస్ కు పంపేందుకు సిద్ధంగా ఉన్నారని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అన్నారు. దేశంలో ప్రజా సమస్యలు తెలవని ప్రధాని ఉండడం దురదృష్టకరమని చెప్పారు. బుధవారం నల్గొండ జిల్లాకేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభకు ఖర్గే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాలో ఫ్లోరోసిస్ పై ఉద్యమాలు చేసిన అంశాల స్వామికి ఆయన శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం సభలో మాట్లాడుతూ నల్గొండ జిల్లాకు గొప్ప చరిత్ర ఉందన్న ఖర్గే, ఇందిరమ్మ హయాంలోనే నాగార్జునసాగర్ డ్యాం నిర్మించారని చెప్పారు. దేశంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ఇద్దరూ అవినీతిలో కూరుకుపోవడమే కాకుండా ఢిల్లీలో మోడీ, ఫామ్ హౌస్ కు కేసీఆర్ పరిమితమయ్యారని ధ్వజమెత్తారు. దేశంలో, రాష్ట్రంలో నిరుద్యోగులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, రైతుల సమస్యలు పట్టని పాలకులకు చమరగీతం పాడాలన్నారు. దేశంలో ప్రజల బాధలను, సమస్యలను తెలుసుకునేందుకు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు జోడో యాత్ర నిర్వహించారని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం వస్తే దేశంలో ఆకలి చావులు, అన్నదాతల అరిగోసలు ఉండవన్నారు. దేశ రక్షణ కోసం బంగ్లాదేశ్, పాకిస్తాన్తో యుద్ధం చేసిన ఇందిరాగాంధీ లాంటి ఉక్కు మహిళపై కేసీఆర్ విమర్శలు చేయడం దుర్మార్గమన్నారు. తెలంగాణలోని మెదక్ లో ఎంపీగా పోటీ చేసి గెలిచారన్నారు. ఇందిర హయాంలోనే వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు హరిత విప్లవాన్ని తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది అన్నారు. పేదల కోసం బ్యాంకులను జాతీయం చేసి.. పేదరిక నిర్మూలన కోసం కృషి చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.
ప్రజాధనాన్ని కొల్లగొట్టిన బీఆరెస్
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలు అమలు చేయడంతో పాటు పాడి పంటలపై దృష్టి పెడతామన్నారు. అన్నదాతల ధాన్యానికి రూ.500 బోనస్ చెల్లిస్తుందని స్పష్టం చేశారు. మహిళలకు రూ.500కే గ్యాస్ సిలిండర్, నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధ్యాయ అవకాశాలు కల్పిస్తామన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకే సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇస్తే, కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు. కేసీఆర్ నేతృత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మొత్తం ల్యాండ్, సాండ్, మద్యం, భూదందాలు చేస్తూ ప్రజాధనాన్ని కోట్లల్లో కొల్లగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పులమయం చేశారని, కేసీఆర్ పాలన వైఫల్యమే దానికి కారణమన్నారు. దళిత, గిరిజనుల నిధులను ఇతర ప్రాజెక్టులకు మళ్లించి లక్షల కోట్ల అవినీతికి కేసీఆర్ పాల్పడ్డాడని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదలను ఆదుకోవడమే కాకుండా మౌలిక సదుపాయాలు కల్పించడం, రైతు రుణమాఫీ లాంటి పథకాలను అమలు చేస్తామన్నారు.
మరోసారి ఇందిరమ్మ రాజ్యాన్ని తెస్తాం
దేశంలో బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు మూడు ఒకటేనని, కాంగ్రెస్ మాత్రమే ప్రజల కోసం పనిచేస్తూ సింగిల్ గా పోరాడుతోందన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 స్థానాలను కాంగ్రెస్ అభ్యర్థులు గెలవబోతున్నారని ఆశాభావం వ్యక్తంచేశారు. తెలంగాణ ఉద్యమకారులను కడుపులో పెట్టుకొని చూసుకోవడమే కాకుండా ఇంటి స్థలాన్ని మంజూరు చేస్తామని, పెన్షన్లను 4 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. ప్రజలంతా కాంగ్రెస్ వెంట ఉండి గెలిపిస్తే మరోసారి ఇందిరమ్మ రాజ్యాన్ని తెస్తామన్నారు. దేశంలో మోడీకి రాష్ట్రంలో కేసీఆర్ కు టాటా.. బాయ్.. బాయ్ చెప్పాలని విజ్ఞప్తి చేశారు. వారి పాలన దేశానికి ముప్పు చేకూరుస్తుందన్నారు. నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి భారీ మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ నల్గొండ నియోజకవర్గంతో పాటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతున్నదని చెప్పారు. 70 నుంచి 80 సీట్ల మధ్యలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏఐసీసీ నేత మాణిక్యం ఠాక్రే, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, డీసీసీ శంకర్ నాయక్, రాష్ట్ర కాంగ్రెస్ నేతలు, మైనార్టీ లీడర్లు, జిల్లా నేతలు పాల్గొన్నారు.