Edupayala Temple | విధాత : భారీ వర్షాలతో మంజీరా నది(Manjira River) ఉగ్రరూపం దాల్చింది. మంజీరా నదిలోకి భారీగా వరద పెరిగిపోవడంతో సింగూర్ డ్యామ్(Singur Dam) గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. దీంతో ఏడుపాయల ఆలయం వద్ధ మంజీరా నది వరద ఉదృతి 70వేల క్యూసెక్కులకు పైగా సాగుతుంది. ఏడుపాయల వనదుర్గ ఆలయం గర్భగుడి పై కప్పును తాకుతూ వరద నీరు ప్రవహిస్తుంది.
మళ్లీ పోటెత్తిన గోదావరి
భారీ వర్షాలకు మరోసారి గోదావరిలోకి వరద పోటెత్తింది. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇక్కడ వరద మొదటి ప్రమాదకర హెచ్చరిక స్థాయిని దాటింది. కాళేశ్వరంలో(Kaleshwaram) జ్ఞాన సరస్వతి, పుష్కర ఘాట్ల మెట్ల పైనుంచి వరద ఉదృతి కొనసాగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి(Medigadda Barrage) భారీగా వరద వచ్చి చేరుతోంది. ఎగువ నుంచి 9,71,880 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. దీంతో 85 గేట్లు ఎత్తి 9,71,880 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. బాసర వద్ధ ఘాట్ల మీదుగా ప్రవహిస్తుంది. 1983తర్వాత 42ఏళ్లకు ఇంత భారీ వరద వచ్చినట్లుగా చెబుతున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు 38 గేట్లు ఎత్తి 6,76,834 క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 6,58,251 క్యూసెక్కులుగా ఉంది. శ్రీరాంసాగర్ డ్యామ్(Sri ram sagar dam) 25 గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల సాగిస్తున్నారు. అవుట్‌ఫ్లో 5,30,622 క్యూసెక్కులకు పెరిగింది. ఇటీవలి సంవత్సరాలలో ఇంత భారీగా వరద రావడం ఇదేనని అధికారులు తెలిపారు. ధర్మపురి వద్ద గోదావరికి వరద ఉధృతి కొనసాగుతుంది. ఎగువన ఉన్న కడెం, ఎస్సారెస్పీ ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదలడంతో ధర్మపురి క్షేత్రం వద్ద గోదావరికి భారీ వరద ప్రవాహం పెరిగింది. నది ఒడ్డున ఉన్న సంతోషి మాత ఆలయంలోకి వరద నీరు చేరింది.
