విధాత, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాకేంద్రంలో ఈనెల 29న జరగనున్న రాహుల్ గాంధీ మహాసభకు వేలాదిగా తరలిరావాలని కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు. జిల్లాకేంద్రంలోని ఆర్కే గార్డెన్స్ లో మంగళవారం విజయరమణ రావు ఆధ్వర్యంలో మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, పెద్దపల్లి పార్లమెంట్ ఇంచార్జ్ మోహన్ జోషి, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మక్కాన్ సింగ్ తో నిర్వహించిన విలేకరుల సమావేశంలో శ్రీధర్ బాబు మాట్లాడారు.
గురువారం ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పెద్దపల్లి నియోజకవర్గానికి వస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సాయంత్రం బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. రామగుండం, మంథని, పెద్దపల్లి నియోజకవర్గాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం నాయకులు సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, యువకులు పాల్గొన్నారు.