Maoist Bandh | జీవో 49 ర‌ద్దు కోసం 21న ఆదిలాబాద్ జిల్లా బంద్‌కు మావోయిస్టుల పిలుపు

కేంద్ర‌ప్ర‌భుత్వం నేష‌న‌ల్ టైగ‌ర్ కన్జర్వేషన్‌ అథారిటీ ద్వారా రాష్ట్రాల‌పై ఒత్తిడి తెచ్చి పులుల సంర‌క్ష‌ణ పేరుతో మూల‌వాసులైన ఆదివాసుల‌ను ఖాళీ చేయించి, ఆ భూములు కార్పొరేట్‌, పెట్టుబ‌డిదారుల‌కు ధార‌ద‌త్తం చేసేప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. ల‌క్ష‌లాది ప్ర‌జ‌ల జీవ‌నాన్ని విచ్ఛినం చేసే కుట్ర‌ల‌ను కేంద్రం చేస్తుంద‌ని దీనికి రాష్ట్రం సానుకూలంగా ఉంటోంద‌ని జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Maoist Bandh | విధాత ప్ర‌త్యేక ప్ర‌తినిధిః కొమురం భీం టైగ‌ర్ జోన్ పేరిట విడుద‌ల చేసిన జీవో 49ని ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తూ ఈ నెల 21న ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా బంద్‌కు భార‌త క‌మ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర క‌మిటీ అధికార ప్ర‌తినిధి జ‌గ‌న్ పిలుపునిచ్చారు. ఈ బంద్‌లో అన్ని పార్టీలు, ప్ర‌జాసంఘాలు, ప్ర‌జ‌లు భాగ‌స్వామ్యం కావాల‌ని ఆదివారం విడుద‌ల చేసిన ఒక ప్ర‌క‌ట‌న‌లో కోరారు. ఆదివాసుల హ‌క్కుల కోసం జ‌ల్‌, జంగిల్,జ‌మీన్ ఉద్య‌మాన్ని న‌డిపిన పోరాట యోధుడు కొమురం భీం పేరుతో ఈ టైగ‌ర్ జోన్ ఏర్పాటు చేసి 1492.88 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల ప‌రిధిలో ఆసిఫాబాద్‌, కాగ‌జ్ న‌గ‌ర్ రెండు నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలోని ఆదివాసీ గూడాల‌ను, గ్రామాల‌ను నామ‌రూపాలులేకుండా చేసేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని వివ‌రించారు. ఆసిఫాబాద్ డివిజ‌న్ లో 1,42,243.96 ఎక‌రాలు, కాగ‌జ్ న‌గ‌ర్ డివిజ‌న్ లో 2,26,655.77 ఎక‌రాలు రెండు డివిజ‌న్ల‌లో క‌లిపి 3,68,900 ఎక‌రాల‌ను ఈ జోన్ ప‌రిధిలోకి తీసుకొచ్చి, ఈ ప‌రిధిలో నివ‌సించే ఆదివాసీలకు జీవ‌ర్మ‌ర‌ణ స‌మ‌స్య‌గా మార్చార‌ని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో నివ‌స‌రించే అన్ని వ‌ర్గాల‌కు స‌మ‌స్య‌గా మారింద‌న్నారు. అన్ని వ‌ర్గాలు ఐక్యంగా ఈ జీవో ర‌ద్దు కోసం పోరాడాలని కోరారు.

ఆదివాసీ మంత్రి సీత‌క్క , ఎమ్మెల్యేల బాధ్య‌త‌

స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు ముఖ్యంగా తెలంగాణ‌లోని ఆదివాసీ ఎమ్మెల్యేలు, మంత్రి సీత‌క్క ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌తో ఈ జీవో ర‌ద్దుచేసే వ‌ర‌కు సంప్ర‌దింపులు, చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌ని జగన్‌ ఆ ప్రకటనలో డిమాండ్ చేశారు. ఇప్ప‌టికే ఎమ్మెల్యేలు, మంత్రి, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని, దీన్ని తీవ్రం చేయాల‌ని కోరారు. దేశంలో 58 పులుల సంర‌క్ష‌ణ కేంద్రాలు ఏర్పాటు చేశార‌ని, ఇందులో 3682 పులులున్న‌ట్లు ప్ర‌క‌టించార‌ని పేర్కొన్నారు. తెలంగాణ‌లో 2012లో ఆదిలాబాద్ జిల్లాలో 2015 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల ప‌రిధిలో క‌వ్వాల్ టైగ‌ర్ రిజ‌ర్వుజోన్ ఏర్పాటు చేశార‌ని, ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ లో 2,611.39 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల ప‌రిధిలో రెండ‌వ జోన్ ఏర్పాటు చేశార‌ని తెలిపారు. ఈ రెండు కేంద్రాల్లో క‌లిపి 21 పులులు మాత్ర‌మే ఉన్నాయ‌న్నారు. ఈ ప‌రిధిలో ఇంకా కొన్ని వంద‌ల పులులు జీవనాన్నికొన‌సాగించే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు. కేంద్ర‌ప్ర‌భుత్వం నేష‌న‌ల్ టైగ‌ర్ కన్జర్వేషన్‌ అథారిటీ ద్వారా రాష్ట్రాల‌పై ఒత్తిడి తెచ్చి పులుల సంర‌క్ష‌ణ పేరుతో మూల‌వాసులైన ఆదివాసుల‌ను ఖాళీ చేయించి, ఆ భూములు కార్పొరేట్‌, పెట్టుబ‌డిదారుల‌కు ధార‌ద‌త్తం చేసేప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. ల‌క్ష‌లాది ప్ర‌జ‌ల జీవ‌నాన్ని విచ్ఛినం చేసే కుట్ర‌ల‌ను కేంద్రం చేస్తుంద‌ని దీనికి రాష్ట్రం సానుకూలంగా ఉంటోంద‌ని జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జీవో 49 ర‌ద్దు కోసం చేసే అన్ని కార్య‌క్ర‌మాల‌కు మావోయిస్టు పార్టీ మ‌ద్ధ‌తు ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు.