విధాత: మావోయిస్టుల కంచుకోటగా గుర్తింపు పొందిన ఛత్తీస్‌గఢ్- తెలంగాణ సరిహద్దులో ఉన్న కర్రెగుట్టలలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీల వరుస పేలుడు ఘటనలో 11మంది భద్రతా సిబ్బందికి గాయపడ్డారు. వారిని ఆర్మీ హెలికాప్టర్ లో రాయపూర్ ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం తప్పినట్లుగా సమాచారం.
ఆపరేషన్ కగార్ లో భాగంగా కేంద్ర రాష్ట్ర భద్రతా బలగాలు కొన్ని నెలల క్రితం కర్రెగుట్టలలో కూంబింగ్ నిర్వహించి..అక్కడి నుంచి మావోయిస్టులను తరిమివేశాయి. ఈ క్రమంలో ఎన్ కౌంటర్లు సైతం చోటుచేసుకుని 30మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు. భద్రతా బలగాలు దాడులను కాచుకోలేక మావోయిస్టులు కర్రెగుట్టలను వదిలి సేఫ్ జోన్లకు తరలిపోయారు.
అయితే తాజాగా కర్రెగుట్టల్లో మావోయిస్టుల కదలికలు ఉన్నాయని, ఐఈడీ బాంబులు అమర్చినట్లుగా భద్రతా సంస్థలకు విశ్వసనీయ సమాచారం అందడంతో కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ఐఈడీల వరుస పేలుళ్లు సంభవించి భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఇటీవలే కర్రెగుట్టలను పర్యాటక ప్రాంతంగా మారుస్తామని గ్రేహౌండ్స్ అడిషనల్ డీజీ అనిల్ కుమార్ ప్రకటించారు. ములుగు జిల్లా నుంచి వాజేడు మండలం మొరుమూరు సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపు నుండి కర్రెగుట్టల వరకు రహదారి నిర్మాణ పనులు చేపట్టారు. కర్రెగుట్ట పరిసరాల్లో మావోయిస్టులు పెట్టి ఉండే అవకాశం ఉన్న ల్యాండ్ మైన్స్, ప్రెషర్ బాంబులను గుర్తించి నిర్వీర్యం చేయడానికి సీఆర్పీఎఫ్ ప్రత్యేక బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేశారు. ప్రమాదాలను అంచనా వేసి, నివారించేందుకు ‘ఫార్వర్డ్ ఆపరేషన్ బ్లాక్ బేస్ క్యాంపు’ కూడా ఏర్పాటు చేశారు. ఇన్ని జాగ్రత్తలు చేపట్టినా కూడా మావోయిస్టుల ఐఈడీల ముప్పు నుంచి భద్రతా బలగాలు తప్పించుకోలేకపోవడం గమనార్హం.
