TUWJ| అక్రిడిటేషన్ల సవరణ జీవోపై టీయూడబ్ల్యూజే హర్షం

డెస్క్ జర్నలిస్టులకు సైతం అక్రిడిటేషన్ కార్డులే జారీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన సవరణ జీవో నెంబర్ 103పై తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం హర్షం వ్యక్తం చేసింది.

విధాత : డెస్క్ జర్నలిస్టులకు సైతం అక్రిడిటేషన్ కార్డులే జారీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన సవరణ జీవో నెంబర్ 103పై తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం హర్షం వ్యక్తం చేసింది. యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్ లు మాట్లాడుతూ గతంలో తీసుకువచ్చిన 252 జీవో పై టీయుడబ్ల్యూజే చేసిన పోరాట ఫలితంగా జర్నలిస్టు సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేసిన సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవరణ జీవో తేవడం, అందులో ప్రధానంగా అందరి జర్నలిస్టుల మాదిరిగానే డెస్క్ జర్నలిస్ట్ సైతం అక్రిడిటేషన్ కార్డులే జారీచేస్తామని చేస్తున్నారని స్పష్టం చేయడం ముదావహం అన్నారు. మండల స్థాయి లో లక్షన్నరకు పైగా జనాభా ఉన్నచోట అదనపు కార్డులు ఇస్తామని పేర్కొనడంతోపాటు కల్చరల్, స్పోర్ట్స్, సినిమా జర్నలిస్టులకు సైతం ప్రత్యేకంగా కార్డులు జారీ చేస్తానని ప్రకటించడం పట్ల ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

జీవో మారడం టీయుడబ్ల్యూజే సాధించిన విజయంగా వారు పేర్కొన్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో వచ్చిన 239 జీవో ప్రకారం వచ్చినన్ని అక్రిడేషన్ కార్డులు ఈ సవరణ జీవో అనంతరం కూడా ఆ స్థాయిలో రావడంలేదని విషయం తేటతెల్లమైందన్నారు. కార్డుల సంఖ్య భారీగా తగ్గనున్న నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి పునరాలోచన చేసి 239 జీవో ప్రకారం జారీ అయిన కార్డుల సంఖ్యనే వర్తింపచేయాలని కోరారు.

కేబుల్ చానల్స్, నియోజకవర్గ స్థాయి రిపోర్టర్లకు మరోసారి మొండిచెయ్యి

గతంలో రాష్ట్రస్థాయిలో కేబుల్ ఛానల్ లకు 12 కార్డులు చొప్పున ఐఅండ్ పీఆర్ ద్వారా జారీ చేశారని, ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఈ సవరణ జీవోలో కేబుల్ చానల్స్ అంశమే లేకపోవడం ఆందోళన కలిగిస్తుంది అన్నారు. యూనియన్ గా మా అభిప్రాయాన్ని చెప్పినప్పటికీ కేబుల్ చానల్స్ విషయంలో, నియోజకవర్గ స్థాయిలో రిపోర్టర్లకు ఇచ్చే కార్డుల విషయంలో ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయమన్నారు. ఈ విషయమై సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ ను వెంటనే కలిసి మరోమారు చర్చిస్తామని, అప్పటికీ స్పందించకపోతే ఈ రెండు అంశాలపై భవిష్యత్ కార్యాచరణ త్వరలో వెల్లడిస్తామన్నారు.

Latest News