Neuroscience | ఫ్రీజ్ చేసిన మెదడుకు మళ్లీ జీవం పోసిన శాస్త్రవేత్తలు.. క్రయోప్రిజర్వేషన్‌లో విప్లవాత్మక ముందడుగు

సినిమాల్లో చూసి ఉంటా.. లేదా నవలల్లో చదివి ఉంటాం! ఒక వ్యక్తి మెదడును సుదీర్ఘకాలం భద్రపరిచి.. ఒకానొక కీలక సమయంలో దాన్ని తిరిగి యాక్టివేట్‌ చేస్తారు! కాకపోతే ఇది ఫిక్షన్‌! కానీ.. ఈ ఊహను వాస్తవానికి దగ్గరగా తీసుకుపోయే ప్రయత్నం చేశారు శాస్త్రవేత్తలు. ఫ్రీజ్‌ చేసిన మెదడును తిరిగి యాక్టివేట్‌ చేశారు.

german scientists brain experiment- AI-generated image representational purposes only

Neuroscience | సైన్స్ ప్రపంచంలో సంచలనంగా మారే పరిశోధన ఒకటి వెలుగులోకి వచ్చింది. జర్మనీకి చెందిన శాస్త్రవేత్తలు గడ్డకట్టిన మెదడును తిరిగి దాదాపు పాత స్థితిలోకి తీసుకురావడంలో విజయవంతమయ్యారు. ఇప్పటివరకు క్రయోప్రిజర్వేషన్ కంపెనీలు మృతదేహాలను లేదా మెదడును గడ్డకట్టించి భద్రపరుస్తున్నప్పటికీ, వాటిని మళ్లీ పనిచేసే స్థితికి తీసుకురావడం సాధ్యమా అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేదు. అయితే ఈ తాజా పద్ధతి భవిష్యత్తులో మానవ శరీర సంరక్షణ సాంకేతికతను పూర్తిగా మార్చే అవకాశముందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఒక మెదడును ఫ్రీజ్‌ చేయడం.. తర్వాత దానిని మళ్లీ పనిచేసేలా క్రియాత్మకం చేయడం.. సాధారణంగా ఇది ఫిక్షన్‌ సినిమాలు, నవలలు, లేదా కథల్లో మాత్రమే కనిపించే దృశ్యం. కానీ.. శాస్త్రవేత్తలు తాజాగా చేసిన ప్రయోగం.. ఈ ఫిక్షన్‌ను కొంత వరకూ వాస్తవాలకు దగ్గరకు చేర్చింది. ఫ్రీజ్‌ చేసిన మెదడు కణ జాలాన్ని మళ్లీ పనిచేసేలా చేయడంలో జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్‌ ఎర్లాంజన్‌– న్యూంబెర్గ్‌కు చెందిన న్యూరాలజిస్టులు కీలక పురోగతి సాధించారు. ఫ్రీజ్‌ చేసిన తర్వాత మళ్లీ సాధారణ స్థాయికి తెప్పించిన మెదడులోని న్యూరాన్లు.. విద్యుత్తు సంకేతాలను ఉత్పత్తి చేశాయని వారి పరిశోధనలో వెల్లడైంది. కణాల్లోని శక్తి కేంద్రాలైన మైటోకాండ్రియా సైతం సక్రమంగా పనిచేశాయి. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు ప్రఖ్యాత సైన్స్‌ జర్నల్‌.. Proceedings of the National Academy of Sciences (PNAS)లో పబ్లిష్‌ చేశారు.

మెదడును ఫ్రీజ్ చేయడం ఎందుకు కష్టం?

మెదడును గడ్డకట్టించడం చాలా క్లిష్టమైన పని. ఎందుకంటే.. నీరు గడ్డకట్టేటప్పుడు ఏర్పడే ఐస్ క్రిస్టల్స్. ఈ క్రిస్ట్రల్స్‌ పెరిగే సమయంలో న్యూరాన్ల మధ్య ఉన్న సున్నితమైన నెట్‌వర్క్ దెబ్బతింటుంది. ఆలోచన, జ్ఞాపకం, అవగాహనకు అవసరమైన కణజాలం నాశనం అవుతుంది. అందుకు.. అందుకే ఫ్రీజ్ చేసిన మెదడును మళ్లీ మామూలు స్థాయికి తీసుకువచ్చినప్పుడు అది సాధారణంగా మునుపటిలా పనిచేయదు.

విట్రిఫికేషన్‌తో ప్రయోగం సక్సెస్‌

మెదడును ఫ్రీజ్‌ చేసే సమయంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారంగా శాస్త్రవేత్తలు ‘విట్రిఫికేషన్’ అని పిలిచే ప్రత్యేక టెక్నాలజీని వినియోగించారు. ఈ విధానంలో.. ద్రవాలను అత్యంత వేగంగా గడ్డకట్టిస్తారు. దానితో ఐస్ క్రిస్టల్స్ ఏర్పడే అవకాశం ఉండదు. కణాల్లోని లిక్విడ్స్‌.. గాజులాంటి స్థితికి మారిపోతాయి. ఫలితంగా కణజాలం నిర్మాణం దాదాపు అలాగే నిలిచిపోతుంది.

ఎలుక మెదడుపై పరీక్ష

పరిశోధకులు ఎలుక మెదడులోని ‘హిప్పోకాంపస్’ అనే భాగంపై ఈ ప్రయోగాన్ని చేశారు. ‘హిప్పోకాంపస్’ అనే భాగం నేర్చుకోవడం, జ్ఞాపకశక్తికి సంబంధించిన కీలక ప్రాంతం. ప్రయోగంలో భాగంగా మెదడు భాగాలను మైనస్‌ 196 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉన్న లిక్విడ్‌ నైట్రోజన్‌తో ఫ్రీజ్‌ చేశారు. సుమారు వారం రోజులు అదే స్థితిలో నిల్వ చేశారు. తర్వాత వేగంగా వేడిచేయడం ద్వారా అందులోని గాజులాంటి స్థితిని ద్రవ రూపానికి తీసుకువచ్చారు. ఈ ప్రక్రియలో ఐస్‌క్రిస్టల్స్‌ ఏర్పడకుండా జాగ్రత్తపడ్డారు.

మళ్లీ పనిచేసిన న్యూరాన్లు

ఫీజ్‌ చేసిన తర్వాత కొంతకాలానికి కరిగించిన పరిశోధకులు మెదడు కణజాలాన్ని పరిశీలించగా ఆశ్చర్యకర అంశాలు ముందుకు వచ్చాయి. ఈ ప్రక్రియలో న్యూరాన్‌, సినాప్స్‌ మాంబ్రేన్‌లు దెబ్బతినలేదని గుర్తించారు. మైటోకాండ్రియా సక్రమంగా పనిచేశాయి. న్యూరాన్లు విద్యుత్ సంకేతాలను ఉత్పత్తి చేశాయి. దీనర్ధం.. ఆలోచనకు అవసరమైన న్యూరల్ సర్క్యూట్రీ దాదాపు యథాతథంగా ఉన్నట్టు తేలింది.

సైన్స్ ఫిక్షన్ నుంచి శాస్త్ర వాస్తవానికి

ఈ పురోగతి సైన్స్‌ ఫిక్షన్‌ను శాస్త్రీయ వాస్తవాలకు దగ్గర చేస్తున్నదని క్రయోబయాలజీ నిపుణుడు మృత్యుంజయ్‌ కొఠారి చెప్పారు. అంతమాత్రాన ఇప్పుడే పూర్తిస్థాయి మెదడును లేదా పెద్ద అవయవాలను దీర్ఘకాలం నిల్వ చేయడం ఇప్పటికీ సుదూర లక్ష్యమేనని ఆయన స్పష్టం చేశారు.

ఏమన్నా ఉపయోగాలు ఉన్నాయా?

ఈ పరిశోధన భవిష్యత్‌లో కొన్ని ముఖ్యమైన అవకాశాలకు దారి చూపవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తీవ్రమైన మెదడు గాయాల తర్వాత కణజాలాన్ని రక్షించడం, న్యూరోడిజెనరేటివ్ వ్యాధులపై పరిశోధన, అవయవాల దీర్ఘకాల నిల్వపై కొత్త ప్రయోగాలకు ఇది మార్గం సుగమం చేస్తుందన్న ఆశాభావం వ్యక్తమవుతున్నది. ఇది ఒక చిన్న అడుగు అయినా, మెదడు సంరక్షణలో కొత్త దిశ చూపించే కీలక పురోగతిగా శాస్ర్తవేత్తలు అభివర్ణిస్తున్నారు.

Read Also |

కాంగ్రెస్ లో రాజగోపాల్ రెడ్డి సీక్రెట్ మీటింగ్ అలజడి !
తెలంగాణకు చల్లటి కబురు… ఐదు రోజులు చిరుజల్లులు.. ఈదురుగాలులు
Viral Video | వైరల్ అవ్వాలని రీల్.. యువతికి కోతి ఇచ్చిన షాక్ చూడండి!

Latest News