ఆ పెద్దపులి మ్యాన్ ఈటర్ గా మారిందా..?

మాధవ్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో ఛిద్రమైన మానవ మృతదేహం లభ్యమైన ఘటన ఇప్పుడు అటవీ శాఖ అధికారులతో పాటు సమీప ప్రాంతాల ప్రజలను కలవర పెడుతుంది. ట్రాకింగ్ డేటా ప్రకారం రేడియో కాలర్ ఉన్న ఆడపులి MT-6 సంఘటనా స్థలంలో ఉందని తేలింది. దీంతో ఎంటీ 6 పెద్దపులి మ్యాన్ ఈటర్ గా మారిందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

విధాత : మాధవ్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో ఛిద్రమైన మానవ మృతదేహం లభ్యమైన ఘటన ఇప్పుడు అటవీ శాఖ అధికారులతో పాటు సమీప ప్రాంతాల ప్రజలను కలవర పెడుతుంది. మాధవ్ టైగర్ రిజర్వ్ ప్రధాన ప్రాంతంలో కొన్ని నెలలుగా పెద్దపులి ఎంటీ 6( MT-6) సంచరిస్తుంది. ఆ పెద్దపులి ఆడవి జంతువులను కాకుండా ఎక్కువగా సమీప గ్రామాల్లోని రైతుల పశువులను చంపి తినడం  అలవాటుగా మార్చుకుంది. ఇదే అలవాటు కారణంగా ఎంటీ 6 పెద్దపులిని బంధవ్‌గఢ్ జాతీయ పార్క్ నుండి రైతుల నిరసనల నేపథ్యంలో మాధవ్ టైగర్ రిజర్వ్ ప్రాంతానికి తరలించారు. అది మాధవ్‌ అభయారణ్యంలో కూడా పశువులను వేటాడటం కొనసాగిస్తోంది. కానీ మనుషులపై ఈ పులి ఇప్పటివరకు దాడి చేసినట్లుగా ఆధారాలు లేవు. అయితే ఛిద్రమైన మృతదేహం లభ్యమైన ప్రాంతంలో ట్రాకింగ్ డేటా ప్రకారం రేడియో కాలర్ ఉన్న ఆడపులి MT-6 సంఘటనా స్థలంలో ఉందని తేలింది. దీంతో ఎంటీ 6 పెద్దపులి మ్యాన్ ఈటర్ గా మారిందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అతడిని చంపింది ఎంటీ 6 పెద్ద పులేనా..?

కానీ ఆ పెద్దపులి ఇంతకు ముందెన్నడూ మనిషిని చంపలేదు. మరోవైపు ఛిద్రమైన మృతదేహానికి సంబంధించిన ఛాతీ భాగంలో అధిక శాతం కనిపించకుండా పోయింది. మృతదేహ భాగాలపై ఏదైనా భారీ జంతువు దాడి చేసినట్లుగా పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించింది. ఇప్పుడు పలు ప్రశ్నలు అటవీ శాఖ అధికారులకు సవాల్ గా మారాయి. అసలు నిషేధిత టైగర్ రిజర్వ్ జోన్ లోకి అనుమతి లేకుండా ఆ మనిషి ఎందుకు వెళ్లాడు?..అతడిని చంపింది ఏ జంతువు?..నిజంగానే ఎంటీ 6 పెద్దపులి అతడిని చంపేసిందా? అన్న అంశాలపై వారు సమగ్ర విచారణ కొనసాగిస్తున్నారు. ఒకవేళ ఎంటీ 6 పెద్దపులి మ్యాన్ ఈటర్ గా మారితే సమీప గ్రామాల ప్రజలు, రైతులకు ప్రమాదకరం అన్న ఆందోళన వ్యక్తమవుతుంది.

భారత్ లో 2020 నుండి 2025 మధ్య పులులు 400మందికి  పైగా మనుషులను  చంపినట్లుగా రికార్డులు చెబుతున్నాయి. భారతదేశంలో సుమారు 3,965కుపైగా పులుల జనాభా ఉందని సమాచారం. ఇది ప్రపంచ పులుల జనాభాకు దాదాపు 75 శాతానికి సమానం. ప్రస్తుతం పులుల గణన మే 31వరకు కొనసాగనుంది. పెరిగిన పులుల సంఖ్యతో మానవ, వన్యప్రాణి ఘర్షణలు కూడా పెరిగిపోతున్నాయి.

1973 నుంచి  ప్రాజెక్ట్ టైగర్

భారతదేశంలోని పులులు సంతానోత్పత్తి జనాభాకు అనుకూలమైన ప్రాంతాలలో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అడవులు, కర్ణాటక, కేరళ ,తమిళనాడు రాష్ట్రాలలో విస్తరించి ఉన్న పశ్చిమ కనుమలు, పశ్చిమ బెంగాల్‌లోని సుందర్‌బన్స్ మడ అడవులు ప్రసిద్ధి.  1973నుంచి భారత్ ప్రభుత్వం ప్రాజెక్ట్ టైగర్  అమలు చేస్తుంది. భారత్ లో 18 రాష్ట్రాలలో ప్రస్తుతం 54 అధికారికంగా గుర్తించబడిన పులి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. ఇవి ప్రపంచంలోనే అతిపెద్ద సంరక్షిత వన్యప్రాణుల నెట్‌వర్క్‌లుగా గుర్తింపు పొందాయి. కార్బెట్ టైగర్ రిజర్వ్ (ఉత్తరాఖండ్), కన్హా టైగర్ రిజర్వ్ (మధ్యప్రదేశ్), బండిపూర్ టైగర్ రిజర్వ్ (కర్ణాటక),తడోబా-అంధారి టైగర్ రిజర్వ్ (మహారాష్ట్ర), రణతంబోర్ టైగర్ రిజర్వ్ (రాజస్థాన్), సుందర్‌బన్స్ టైగర్ రిజర్వ్ (పశ్చిమ బెంగాల్), నల్లమల అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్టు(తెలంగాణ) ప్రధానంగా ఉన్నాయి.

Latest News