విధాత, హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రేపు సోమవారం(ఏప్రిల్ 27న) ప్రతి గ్రామం, పట్టణం, నియోజకవర్గం, జిల్లా కేంద్రాల్లో పార్టీ జెండాలను ఎగురవేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈరోజు పార్టీ శ్రేణులతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రేపు (ఏప్రిల్ 27న) తెలంగాణ భవన్‌లో రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశం జరుగుతుందని కేటీఆర్ తెలిపారు. ఇటీవల జగిత్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహించిన నేపథ్యంలో, ప్రస్తుత ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ ఆదేశాల మేరకు ఈసారి ప్లీనరీని కేవలం రాష్ట్ర కార్యవర్గ సమావేశానికే పరిమితం చేసినట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
ఈ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు మరియు కార్పొరేషన్ల మాజీ చైర్మన్లకు మాత్రమే ఆహ్వానం ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో పరిమిత సంఖ్యలోనే ప్రవేశం ఉంటుందని, ఆహ్వానం ఉన్న వారు మాత్రమే హాజరుకావాలని, మిగిలిన నాయకులు , కార్యకర్తలు తమ తమ నియోజకవర్గాల్లోనే ఉండి వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేటీఆర్ కోరారు. తెలంగాణ భవన్ సమావేశానికి ఆహ్వానం ఉన్న నాయకులు ఉదయాన్నే స్థానిక ప్రాంతాల్లో జెండా పండుగ ముగించుకుని, మధ్యాహ్నం 1:30 గంటల కల్లా హైదరాబాద్ చేరుకోవాలని సూచించారు.
