Site icon vidhaatha

Medak : మెదక్ లో మూడు గంటల్లో 13 సెం.మీ. వర్షం

Medak Heavy Rains

మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం నాడు భారీ వర్షం కురిసింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో ఈ నెల 14 వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. మూడున్నర గంటల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో సగటున 13 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్ లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. గాంధీ నగర్, సాయినగర్, వెంకట్రావ్ నగర్, ఫతేనహార్ కాలనీలు నీటమునిగాయి. మెదక్ లోని పలు వ్యాపార సంస్థల్లోకి వరద నీరు చేరింది. మెదక్ లోని రాందాస్ చౌరస్తా వద్ద డివైడర్ ను తొలగించి వరద నీరు వెళ్లేలా చేశారు. బాలికల కాలేజీలోని వరద నీరు చేరింది. మోకాళ్లలోతువరకు నీరు వచ్చింది. లెక్చరర్ల సహాయంతో విద్యార్ధినులు కాలేజీ నుంచి బయటకు వచ్చారు. మెదక్-హైదరాబాద్ రోడ్డుపై వరద నీరు చేరింది. ఈ రోడ్డుపై మోకాలిలోతు నీళ్లు చేరాయి. జిల్లాలోని రామాయంపేట, హవేలిఘన్ పూర్,టెక్మాల్, పెద్ద శంకరంపేట,అల్లాదుర్గం, పాపన్నపేట,నార్సింగి లో కూడా వర్షం పడింది. జిల్లాలోని రాజీపల్లిలో 9.2 సెం.మీ,పాతూరులో 8 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

ఇక సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్, మనూరు, సిర్గాపూర్, సంగారెడ్డి, నాగల్ గిద్ద,కంగ్టి, జహీరాబాద్, జోగిపేటల్లో భారీ వర్షం కురిసింది. ఇక రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్ లో కూడా భారీ వర్షం కురిసింది.

Exit mobile version