Site icon vidhaatha

ప్రకృతి వైపరీత్యాలను రాజకీయాలకు వాడుకుంటున్నారు: మంత్రి శ్రీధర్ బాబు

Sridhar

విద్యుత్ కోతలు అనేవి ప్రతిపక్షాల సృష్టే!
ఆరు గ్యారెంటీలకు అవసరమైనన్ని నిధుల కేటాయింపు
ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు

విధాత బ్యూరో, కరీంనగర్: రైతుల పేరిట విపక్షాలు రాజకీయాలు చేస్తుండడం పట్ల రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మండిపడ్డారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల తలెత్తిన పరిస్థితులను పార్లమెంట్ ఎన్నికల్లో వాడుకునేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటు అన్నారు. సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రామగుండం, పెద్దపల్లి శాసనసభ్యులు రాజ్ ఠాకూర్, విజయ రమణారావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. తాము అధికారంలో ఉన్న పదేళ్లలో రైతులను ఏనాడు పట్టించుకోని మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు లోకసభ ఎన్నికల్లో ఓట్లు, సీట్ల కోసం వారి సమస్యలపై ముసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకొంటుందన్నారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేకుండా చూసేందుకు గత ఏడాది ఫిబ్రవరి, మార్చ్ మాసాలలో వినియోగమైన కరెంటు కంటే మరో ఎనిమిది శాతాన్ని అధికంగా కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఎలాంటి విద్యుత్ కోతలు లేవని, కోతలు అనేవి ప్రతిపక్షాల అసత్య ప్రచారం మాత్రమేనని, ప్రజలు దీనిని నమ్మే పరిస్థితిలో లేరని తెలిపారు.

లోకసభ ఎన్నికల తర్వాత ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్లో శాసనసభ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీ ల అమలుకు సంబంధించి ప్రతి పథకానికి పూర్తిస్థాయిలో నిధులు కేటాయిస్తామని తెలిపారు. ఇప్పటికే 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడుకొన్న ప్రతి కుటుంబానికి జీరో బిల్లు అందిస్తున్నామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంలో భాగంగా ఇప్పటివరకు 35 కోట్ల ఫ్రీ టికెట్లు జారీ చేశామని, 500 రూపాయలకే సిలిండర్ అందిస్తున్నామని, ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచామని గుర్తు చేశారు.

Exit mobile version