– టికెట్లు అమ్ముకుంటున్న రేవంత్
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ అట్టర్ ప్లాప్ అవుతుందని, డబ్బులకు టికెట్లు అమ్ముకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ వాళ్లే విమర్శిస్తున్నారంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డబ్బులకు అమ్ముడుపోయి టికెట్లు అమ్ముకుంటండు, ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతాండని మండిపడ్డారు. జనగామలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జడ్పీ చైర్మన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్ రెడ్డితో కలిసి శనివారం మంత్రి మీడియాతో మాట్లాడారు. నీలాగా మాకు రోత మాటలు రావు, నువ్వు తిమ్మిని బమ్మి చేస్తావు. గోడలకు పెయింటింగ్ లు వేసే వాడివి… నువ్వు, నీ బతుకు గురించి ఆలోచించు, నీ కుటుంబమేంది? నీ బతుకేంది.? సంవత్సరానికి ఒక పార్టీ మారే బతుకు నీదంటూ విమర్శించారు. కొడంగల్ లో చిత్తుగా ఓడిపోయావు, బ్రోకరు మాటలెందుకు, దమ్ముంటే రంగారెడ్డి జిల్లాలో పోటీ చేసి గెలువని సవాల్ చేశారు. రేవంత్ రాగానే కాంగ్రెస్ పని ఖతం అయిపోయిందన్నారు. పార్టీ గ్రాఫ్ ఘోరంగా పడిపోయింది. 15న బీఆర్ఎస్ మ్యానిఫెస్టోతో కాంగ్రెస్ పార్టీ మొత్తం పడిపోతదన్నారు.
పొన్నాల పార్టీలోకి వస్తే స్వాగతిస్తాం
సీనియారిటీ ఉన్న పొన్నాల లక్ష్మయ్యను పట్టుకుని రేవంత్ రెడ్డి ఘోరంగా తిట్టడం సరికాదని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. దాదాపు 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్నడు. ఆయనపై రేవంత్ రెడ్డి నీచమైన మాటలను ఖండిస్తున్నానని అన్నారు. పొన్నాల బీఆరెస్ లోకి వస్తే స్వాగతిస్తామని తెలిపారు.