– రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు
– ఒక్కటైన పల్లా, ముత్తిరెడ్డి
– ఇకనుంచి నా ఫొటో కూడా వద్దు
– చేర్యాలలో పల్లాకు నిరసన సెగ
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కష్టపడి ఒక్కో మెట్టెక్కినట్టు చేసిన తెలంగాణ అభివృద్ధి.. కాంగ్రెస్‌కు అవకాశం ఇస్తే పాము మింగినట్లు వైకుంఠపాళీలా కిందికి దిగజారుతామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు హెచ్చరించారు. జనగామ బీఆర్ఎస్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డిని ప్రకటించిన తరువాత బుధవారం స్థానికంగా జరిగిన పార్టీ విస్తృత సమావేశంలో హరీష్ రావు ప్రసంగించారు. మూటలు, మాటలు ముఠాలు, మంటలు కాంగ్రెస్ పార్టీకి మరో పేరని అన్నారు. ఆ పార్టీ అంటే అట్లనే ఉంటది, ఇంకా టికెట్లు కూడా ఖరారు గాక ముందే గాంధీభవన్ లో నాయకులు తన్నుకుంటున్నారు. టికెట్లు అమ్ముకుంటున్నారని కొందరు ఆరోపిస్తున్నారని విమర్శించారు. ఒక్క చాన్స్ ఇవ్వని కాంగ్రెస్ కోరుతుందని, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి 11సార్లు అవకాశం ఇచ్చారని మంత్రి అన్నారు. 11 ఏళ్లు కూడా నిండకముందే తెలంగాణ అభివృద్ధి చేసి కేసీఆర్ చూపెట్టండని హరీష్ రావు చెప్పారు. సాగు నీళ్లు ఇచ్చిండు, మంచినీళ్లు ఇచ్చిండు, కరెంటు ఇచ్చిండు, రైతుబంధు ఇచ్చిండు, ఎరువులు ఇచ్చిండన్నారు. కాంగ్రెస్ హయాంలో ఇవన్నీ వచ్చినయా అంటూ ప్రశ్నించారు. ఓట్ల కోసం వెంపర్లాడే పార్టీ కాదు బీఆర్ఎస్, ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పనిచేస్తుందన్నారు. నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడొకరు ఆరు నెలలకు ఒకసారి రాడు, మరో నాయకుడు కన్నతల్లిదండ్రులకు అన్నం పెట్టనోడని, ఇద్దరూ ఇక మన గురించి ఏం పట్టించుకుంటారా అంటూ ప్రశ్నించారు. మీకోసం పనిచేసే పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. 16న జరుగు సీఎం కేసీఆర్ సభను జయప్రదం చేయాలని కోరారు.
ఇది బీఆర్ఎస్ గొప్పతనం
ఇక్కడ ఒక కొత్త దృశ్యం ఆవిష్కరించబడింది. ఏ పార్టీలనైనా ఇట్లా ఉంటదా? కాటికి కాళ్లు చాపే అంతవరకు పోటీలో ఉంటానని పట్టుబడుతారు. ఇక్కడ మాత్రం ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి నిండు మనసుతో దీవించండని మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. నా ఫొటో కూడా వద్దు, నీ ఫొటోనే పెట్టుకో అని ముత్తిరెడ్డి ఆశీర్వదించిండు. ఇది బీఆర్ఎస్ గొప్పతనం అన్నారు.
నా ఫొటో కూడా వద్దు : ముత్తిరెడ్డి
జనగామ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించబడిన పల్లా రాజేశ్వర్ రెడ్డికి వేదిక మీదనే స్వీట్ తినిపించి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆశీర్వదించారు. ఆలింగనం చేసుకున్నారు. తనకంటే ఒడ్డూ, పొడవు ఉన్నాడు. నాకంటే వయసులో చిన్నవాడు. సీఎంకు దగ్గర ఉంటాడని, ఇక నుంచి జనగామ నియోజకవర్గ బాధ్యతలు నీకే ఒప్ప చెబుతున్నానని పల్లాకు అప్పగింతలు చేశారు. తాను చేసిన అభివృద్ధిని చెబుతూనే చేయాల్సిన పనుల గురించి ఏకరువు పెట్టారు. ఇక నుంచి నియోజకవర్గంలో పెట్టే ఫ్లెక్సీలలో తన ఫొటో కూడా అవసరం లేదని ప్రకటించారు. పల్లా, ముత్తిరెడ్డి మధ్య జరిగిన ఈ దృశ్యం అక్కడ వారందరినీ ఆకర్షించింది. వేదికపై నవ్వులు పూశాయి. ముత్తిరెడ్డి మాట్లాడుతుండగా అందరూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి పాల్గొన్నారు.
చేర్యాలలో పల్లాకు నిరసన సెగ
సమావేశానికి ముందు పల్లా రాజేశ్వర్ రెడ్డి చేర్యాల మీదుగా జనగామ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా చేర్యాలలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని ఆందోళన చేస్తున్న ఉద్యమకారులు.. పల్లా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం పల్లా కొమరవెల్లి దేవాలయంలో పూజలు నిర్వహించి జనగామకు చేరుకున్నారు.